ప్రణయ్ హత్య కేసులో నిందితులు అరెస్ట్

Date:18/09/2018

నల్గొండ ముచ్చట్లు :

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందించారు.

 

జులై మొదటివారంలోనే ప్రణయ్‌ హత్యకు స్కెచ్ వేశారని, హత్యకు కోటి డిమాండ్ చేసిన అస్గర్ అలీ చివరకు 50 లక్షలకు ఒప్పందం చేసుకుని బీహార్‌కు చెందిన సుభాష్ శర్మతో ఈ హత్య అమలు చేయించినట్లు తెలిపారు. ఈ హత్య చేయించిన అమృత తండ్రి తిరునగరి మారుతీరావు జులై రెండో వారంలో గ్యాంగ్‌కు రూ.15 లక్షలు చెల్లించినట్లు వెల్లడించారు.

ప్రణయ్ హత్యకు ఆగస్టు 9 నుంచీ రెక్కీ జరిగిందని, ఆగస్ట్ 14న తొలిసారి హత్యకు ప్రణాళిక వేశారని చెప్పారు. తొలుత మిర్యాలగూడలోని బ్యూటీ పార్లర్ వద్ద ప్రణయ్‌ని చంపేందుకు ప్రయత్నించారని రంగనాథ్ వెల్లడించారు.

 

ఈ కేసులో ఏ1గా తిరునగరి మారుతిరావు, ఏ2గా తిరునగరి శ్రవణ్, ఏ3గా సుభాష్ కుమార్ శర్మ(బీహార్), ఏ4గా అస్గర్‌అలీ(నల్గొండ), ఏ5గా అబ్దుల్‌బారీ(నల్గొండ), ఏ6గా అబ్దుల్ కరీం, ఏ7గా సముద్రాల శివ గౌడ్ (డ్రైవర్) ఉన్నారు.

గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో కొన్నాళ్లు జైల్లో ఉన్న అస్గర్‌ అలీ అక్కడే సుభాష్ శర్మతో పరిచయం అయ్యిందని, మారుతీరావు మిర్యాలగూడలో అస్గర్, కరీంలను కలిసినట్లు రంగనాథ్ తెలిపారు.

 

 

ఆగస్ట్ 22న ఇంటి వద్ద ప్రణయ్‌ హత్యకు విఫలయత్నం చేసిన ఈ నిందితులు చివరికి ఈ నెల 14న ప్రణయ్‌ను హతమార్చారు. మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ 302, 120(బి) 109, ఆర్‌/డబ్ల్యూ34, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

సోమల మండలంలో ఎమ్మెల్యేపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన వివరాలు..

Tags: Arrested in Pranay murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *