Assure to Christians

క్రైస్తవులకు భరోసా 

చర్చిల మరమ్మతులకు నిధుల పెంపు 
-రాబోయే క్రిస్మస్‌ నాటికి క్రిస్టియన్‌ భవన్‌ 
-రాజధానిలో చర్చిల నిర్మాణానికి స్థలాలు 
-పర్యటక ప్రాంతంగా ఫిరంగిపురం చర్చి 
-క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం చంద్రబాబు 

Date : 24/12/2017

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో చర్చిల మరమ్మతులకు ఇచ్చే మొత్తాన్ని రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నామని, రానున్న బడ్జెట్‌లో గణనీయంగా నిధులు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.  గుంటూరులోని ఎల్‌ఈఎం పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. కేకు కోసి నేతలు, క్రైస్తవ మతపెద్దలకు తినిపించారు. మతపెద్దలు ముఖ్యమంత్రికి జ్ఞాపికలు, బహుమతులు అందించారు. ‘‘క్రిస్మస్‌ శుభ సందర్భంలో రాష్ట్రం కోసం, పేదవారి కోసం, మెరుగైన పాలన కోసం ఏసుక్రీస్తును ప్రార్థించాలి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల సంపద సృష్టించి తద్వారా పేదరికాన్ని నిర్మూలించాలి’’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రపంచం మొత్తం చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్‌ అని అన్నారు. క్రైస్తవ సంస్థలు సేవకు మారుపేరుగా నిలిచాయని, అప్పట్లో విద్యా సంస్థలు స్థాపించడం వల్లే ఇక్కడ ఏసీ కళాశాలలో ఎన్టీఆర్‌ చదువుకుని మహానటుడిగా గుర్తింపు పొందడంతో పాటు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారని అన్నారు. ఎన్టీఆర్‌ జ్ఞాపకార్థం ఏసీ కళాశాలలో ఒక బ్లాకు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో చర్చిల నిర్మాణానికి, ఆధునిక శ్మశాన వాటికల ఏర్పాటుకు భూములు కేటాయిస్తామన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అనుమతులతోనే చర్చిలు నిర్మించుకునేలా మార్గదర్శకాలు ఇచ్చి నిర్మాణాలకు తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. వచ్చే క్రిస్మస్‌ నాటికి గుంటూరులో క్రిష్టియన్‌ భవన్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి ఇక్కడే వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఫిరంగిపురంలో వందేళ్ల చరిత్ర కలిగిన చర్చి ఉందని, దీనిని పర్యటకంగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చేలా చూస్తామన్నారు. పేదలు ఈ పండుగను ఆనందంగా చేసుకోడానికి క్రిస్మస్‌ కానుక అందిస్తున్నామన్నారు. పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు చంద్రన్న విద్యా జ్యోతి పేరుతో రూపొందించిన అభ్యసన సామగ్రి పంపిణీని ఇక్కడ ప్రారంభించారు. మంత్రులు నక్కా ఆనందబాబు, కేఎస్‌ జవహర్‌, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌, గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ వర్ల రామయ్య, ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ జేఆర్‌ పుష్పరాజ్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags : Assure to Christians

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *