At least Rs. 10 thousand

ప్రతీ కుటుంబానికీ నెలకు కనీసం రూ. 10 వేలు

ఆదాయం సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మాగంటి

Date:11/01/2018

ఏలూరు ముచ్చట్లు:

ప్రతీ కుటుంబానికీ నెలకు కనీసం 10 వేల రూపాయలు ఆదాయం దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ఏలూరు పార్లమెంటు సభ్యుడు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) చెప్పారు. ఏలూరు రూరల్‌ మండలం చాటపర్రు గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి-మాఊరు గ్రామసభలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు సామాజిక, నీటి, ఆహార, ఆరోగ్య, గ్యాస్‌ భద్రత కల్పిస్తూ పేదకుటుంబాలు కనీసం నెలకు 10 వేల రూపాయలు ఆదాయం సంపాదించే కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకువస్తున్నదన్నారు. సమాజంలో ప్రతీ పేదకుటుంబం పేదరికం నుండి బయటపడడానికి నిరంతరం ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో ముందు నిలపడానికి సాయశక్తులా సియం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనతో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సమృద్ధివైపు అడుగులు వేయిస్తూ నవ్యాంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సియం కృషి చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలికసదుపాయాల కల్పనకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పధకాన్ని అనుసంధానంచేసుకుని రాష్ట్రంలో 13 వేల కిలోమీటర్లు సిమెంటు రోడ్లు వేసుకోవడమే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 3 వేల కిలోమీటర్లు సిసిరోడ్లు వేసుకున్నామన్నారు. రాష్ట్రంలో అరకోటిమందికి ప్రతీనెలా 1వ తేదీ నుండి 5వ తేదీలోపు పెన్షన్లను అందిస్తున్నదని అదే పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు లక్షలమంది వరకూ వివిధ వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, తదితర పెన్షన్లు పొందుతున్నారన్నారు. మరోప్రక్క చంద్రన్న బీమా పధకాన్ని తీసుకొచ్చి పేదకుటుంబాలకు ఒక భరోసాను కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా మలుచుకునేందుకు మహోత్తర లక్ష్యాన్ని ముందు పెట్టుకుని సాగుతున్నామన్నారు. ఈ విషయంలో పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని పూర్తి చేసుకోవడం ద్వారా గోదావరి, కృష్ణానదుల అనుసంధానం చేసుకోగలిగామన్నారు. మరోప్రక్క పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. ఇందుకోసం 50 వేల కోట్ల రూపాయలను కేంద్రం అందిస్తున్నదన్నారు. ప్రాజెక్టు నిర్మాణవ్యయంలో 34 వేల కోట్ల రూపాయలు కేవలం ప్రాజెక్టు నిర్వాసితుల కోసమే ఖర్చు చేస్తున్నామన్నారు. ఈప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర సుస్ధిరాభివృద్ధికి, వ్యవసాయ స్ధిరీకరణకు దోహదపడుతుందన్నారు. చాటపర్రు గ్రామాభివృద్ధికి 50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రభుత్వం చేసిందన్నారు. ఇద్దరు పార్లమెంటు సభ్యుల స్వస్ధలమైన చాటపర్రు గ్రామాన్ని ప్రభుత్వవిప్‌ చింతమనేని ప్రభాకర్‌, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తామన్నారు. రైతు ఋణమాఫీ క్రింద 637 మంది రైతులకు రూ. 3.57 కోట్లు రుణమాఫీ చేసామన్నారు. 132 డ్వాక్రా గ్రూపులకు రూ. 1.56 కోట్లు బ్యాంకు రుణాలు అందించామని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి 550 మందికి 82 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించామన్నారు. చాటపర్రు గ్రామంలో యన్‌టిఆర్‌ భరోసా క్రింద 534 మందికి ప్రతీనెలా 5 లక్షల 88 వేల రూపాయలు పెన్షన్లు క్రింద అందిస్తున్నామని, మరో 154 మంది అర్హులైనవారికి ఫిబ్రవరి నుండి క్రొత్త పెన్షన్లు అందిస్తామని మరో 156 మందికి క్రొత్తగా రేషన్‌ కార్డులు అందిస్తున్నామని బాబు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వవిప్‌ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ద్వారా 13వ ఆర్ధిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్ధిక నిధులు లక్షరూపాయలతో కలిపి లక్షా 70 వేలతో యస్‌సి పేటలో గ్రావెల్‌ రోడ్డు నిర్మించామన్నారు. నీరు-చెట్టు క్రింద 33 లక్షలతో మంచినీటి చెరువులను విలీనం చేసి మంచినీటి చెరువు విస్తీర్ణం పెంచడం జరిగిందన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు మరింత అండగా నిలిచి సియం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతగా ఉండాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ డి. భాగ్యశ్రీ, యంపిపి మోరు హైమావతి, జడ్‌పిటిసి మట్టా రాజేశ్వరి, వైస్‌ యంపిపి మాణిక్యాలరావు, కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యులు గుత్తా చంద్రశేఖర్‌, మాజీ జడ్‌పిటిసి గుత్తా కాశీబాబు, ఉప సర్పంచ్‌ యం. విజయతులసీరాణి, యంపిటిసిలు డి. వీరబ్రహ్మం, సరస్వతి, తహశీల్ధారు చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. తొలుత చాటపర్రు గ్రామంలో పలువురు మహిళలు వేసిన ముగ్గులను యంపి మాగంటి బాబు పరిశీలించారు.

Tags : At least Rs. 10 thousand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *