అడవికి గొడ్డలి పెట్టు

Date:15/02/2018
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లాలో అటవీప్రాంతం ధ్వంసమవుతున్నట్లు చాలాకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కుల ఆగడాలకు అడ్డకట్టపడడంలేదని అంతా అంటున్నారు. రోజుకు రూ.3 నుంచి రూ.5లక్షల విలువైన కలపను దోచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే గానీ ఈ దందాకు తెరపడదని వ్యాఖ్యానిస్తున్నారు. ధనాశతోనే పలువురు అక్రమార్కులు అడవిపై కన్నేశారు. ఇష్టారాజ్యంగా చెట్లను నరికేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ అక్రమాన్ని అడ్డుకున్నవారిపై ఎంతకైనా తెగిస్తున్నారు. అధికారులను సైతం ఖాతరు చేయడంలేదు. తరచూ వారిపై దాడులకు తెగబడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. పెంబి, ఖానాపూర్‌ అటవీప్రాంతాల నుంచి సిరికొండ, ఇచ్చోడ అటవీ మార్గాల మీదుగా ఇచ్చోడ వరకు అడ్డదారుల్లో కలపను రవాణా సాగుతోంది. జాతీయరహదారి మీదుగా నిజామాబాద్‌, హైదరాబాద్‌కు కలపను తరలిస్తున్నారు. ఈ మార్గంలో అడ్డు చెప్పేవారు లేకపోవడంతో అక్రమార్కులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. నిర్మల్ తో పాటూ ఆదిలాబాద్ జిల్లాలోనూ అటవీ ప్రాంత విధ్వంసం యథేచ్ఛగా సాగిపోతోంది. స్థానికంగా బరి తెగించిన స్మగ్లర్లు ఉండడమే దీనికి కారణంగా చెప్తున్నారు. ప్రధానంగా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ రేంజి పరిధిలో ఈ దందా మితిమీరిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ తంతు ఇలాగే కొనసాగితే అక్రమార్కులు చెట్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తారని, భవిష్యత్ లో అడవి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రాంతీయంగా సాగుతున్న ఈ దందాను పరిశీలిస్తే.. స్థానికుల ఆందోళన సబబే అనిపిస్తుంది. ఎందుకంటే ఐదు నెలల వ్యవధిలో అధికారులు సీజ్ చేసిన కలప విలువ రూ.35లక్షలు పైనే. ఈ ఐదు నెలల్లోనే అధికారులపై నాలుగు సార్లు దాడులు కూడా జరిగాయి. ప్రాంతీయంగా అడవి ఏ రేంజ్ లో ధ్వంసమవుతుందో తెలుసుకోడానికి ఈ లెక్కలు చాలు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి అక్రమార్కులు సాగిస్తున్న అటవీ విధ్వంసాన్ని అరికట్టాలని అంతా కోరుతున్నారు. లేదంటే అమూల్యమైన వృక్ష సంపద అడ్రస్ లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు.
Tags: Ax to the jungle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *