బెల్లంపల్లి ఆసుపత్రి ని సూపర్ స్పెషాలిటీ మార్చాలి- సబ్బని కృష్ణ
బెల్లంపల్లి ముచ్చట్లు:
బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో ఎంసీపీఐ యూ సబ్బలి కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం లో ఎంసీపీఐ యూ జిల్లాకార్యదర్శి సబ్బని కృష్ణ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని 200ల పడకలుగా మార్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా చేసి, వైద్యనిపుణులను నియమించి,ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ లతో పాటు అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించి,పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకి విజ్ఞప్తి చేశారు.గత పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విద్యా, వైద్యం,సాగునీరు, త్రాగునీరు, రహదారుల్లో వెనుకపడేశారని అయన తెలిపారు.బెల్లంపల్లి నుండి ఆసిఫాబాద్,వాంకిడి వరకు ఇటు సిర్పూర్, కాగజ్ నగర్ వరకు,చెన్నూరు నుండి జన్నారం వరకు వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, వైద్య నిపుణులు,మందులు, అనేక రకాల పరీక్షల సౌకర్యాల కొరత విపరీతంగా ఉందని పేర్కొన్నారు.ఇప్పుడున్న బెల్లంపల్లిలోని 30పడకల ఆసుపత్రి,మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి అరకొర వసతులతో,సౌకర్యాలతో కడు దయనీయంగా ఉన్నాయన్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగిన, తీవ్రమైన అనారోగ్యానికి గురైన కరీంనగర్, వరంగల్, హైద్రాబాద్ కు పంపించే రెఫరల్ ఆస్పత్రులుగా మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు.మెరుగైన సౌకర్యాలు లేక సుదూర ప్రాంతాల ఆసుపత్రులకు పంపించడం వల్ల మార్గం మధ్యలోనే సగం మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గర్భిణీలకు సరైన సమయంలో వైద్యం అందక అంబులెన్స్ లలోనే ప్రసవిస్తున్న సంఘటనలు కోకొల్లలు అన్నారు.ఆసుపత్రులలో డాక్టర్లు స్థానికంగా ఉండేలా చూడాలని,సరైన పద్ధతుల్లో మెరుగైన వైద్య సేవలు అందించి అన్నివర్గాల ప్రజల ప్రాణాలని కాపాడాలని ఎంసీపీఐ యూ పార్టీ తరుపున కోరుతున్నామన్నారు.ఈకార్యక్రమంలో ఎంసీపీఐ యూ జిల్లా నాయకులు జాగాటి రాజలింగు,కొండ శ్రీనివాస్, సబ్బని రాజేంద్రప్రసాద్,పసులేటి వెంకటేష్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Tags: Bellampalli Hospital should be made a super specialty – Sabbani Krishna