పన్నులు చెల్లిస్తే ప్రయోజనం మెండు

Date:14/02/2018
ఆదిలాబాద్  ముచ్చట్లు:
సర్కారీ నిధులతో పాటూ పన్నులు సకాలంలో అందితే అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్ధిక సమస్యలు ఉండవు. లేనిపక్షంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసే వరకూ వేచి చూడాల్సిందే. అందుకే దేశవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుంటాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఈ తరహా పరిస్థితే కొంత కనిపిస్తోంది. స్థానికంగా 243 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో రూ.6.04 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పటివరకు 2.78 కోట్ల మేర పన్నులు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.3.25 కోట్ల మేరక పన్నులు వసూలు కావల్సి ఉంది. నూరుశాతం లక్ష్యాలను సాధించాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పన్ను వసూళ్లు ముమ్మరం చేశారు సిబ్బంది. ప్రజలు పక్కాగా పన్నులు చెల్లించేలా ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆస్తి, కుళాయి. ఆస్తిమార్పిడి తదితర పన్నుల రాబడితో పంచాయతీలకు ఆదాయం పెరిగింది. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉండటం, విస్తీర్ణం చాలా ఎక్కువ ఉండడం, గ్రామపంచాయతీలు అధికంగా ఉండటం తదితర కారణాలతో జిల్లాస్థాయి అధికారుల నుంచి పంచాయతీ సిబ్బందికి సాయం తక్కువ ఉండేది. ప్రస్తుతం పరిధి చిన్నదిగా మారడంతో జిల్లా స్థాయి అధికారులు సూచనలతో నిత్యం పంచాయతీ సిబ్బంది ఎక్కువ శాతం వసూలు చేస్తున్నారు. కొన్నినెలల క్రితం ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన అల్లర్ల కారణంగా పన్ను వసూలుకు కొంత ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ వంద శాతం పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 46 రోజుల గడువే ఉంది. దీంతో రోజు వారీగా పంచాయతీ కార్యదర్శులు వసూలు చేసిన పన్ను వసూళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. దీంతో పాటు స్థానికంగా వసూలయ్యే పన్నులే పంచాయతీ అభివృద్ధి నిధులు. వీటిని విభాగాల వారీగా కేటాయించిన పరిధిలోనే వాడాలి. ప్రభుత్వ నిబంధనల మేర ఖర్చు చేయాలి. పంచాయతీ సిబ్బంది, కార్మికుల వేతనానికి 30 శాతం, వీధిలైట్లకు 15 శాతం, నీటి సరఫరాకు 15 శాతం, పారిశుద్ధ్యానికి 15 శాతం, పంచాయతీ స్టేషనరీ కోసం 5 శాతం, అభివృద్ధి పనుల కోసం 20 శాతం చొప్పున నిధులను కేటాయిస్తారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు పన్నులు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags: Benefit to pay taxes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *