ఫేస్‌ బుక్‌ అకౌంట్లతో జాగ్రత్త సుమా!

ముంబయి ముచ్చట్లు:

ఉద్యోగ వేటలో బిజీగా ఉన్న నిరుద్యోగులకు ఓ ఇంపార్టెంట్‌ న్యూస్‌. మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఒకటికి పదిసార్లు సరి చూసుకోండి. అసభ్యకరమైన, రెచ్చగొట్టే పోస్టులను డిలీట్‌ చేయండి. ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌కు, జాబ్‌కు లింకు ఏంటని తలలు బద్దలుకొట్టుకుంటున్నారా? జాగ్రత్తగా లేకుంటే మీ ఫేస్‌బుక్‌ అకౌంటే మిమ్మల్ని అడ్డంగా బుక్‌ చేస్తుంది. ఫేస్‌బుక్‌ అంటే సుదూరాన ఉన్న కోట్లాది మందిని అనునిత్యం టచ్‌లో ఉంచిన నెట్‌వర్క్‌. ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకోలేని వాళ్లని సైతం పక్కనే ఉన్న అనుభూతిని కల్గించిన సోషల్‌ మీడియా. విశ్వసనీయ సర్వేల ప్రకారం చదువుకున్న ప్రతి 10 మందిలో కనీసం ఆరుగురికి ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ ఉంది. ప్రతి 5 నిముషాలకొకరు ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ తెరుస్తున్నారు. 90 శాతం మంది యూజర్లు రోజులో ఒక్కసారైనా ఫేస్‌బుక్‌ చూడకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తున్నారు. కనెక్టింగ్‌ పీపుల్‌ అనే ట్యాగ్‌లైన్‌కు సరిగ్గా సరిపోయే సోషల్‌ నెట్‌వర్క్‌ ఫేస్‌బుక్‌ ఒక్కటే. కనెక్టివిటీ మాట అటుంచింతే ఫేస్‌బుక్‌ ఎన్నో నష్టాలను కొని తెస్తోంది. ఈ ఇంటరాక్టివ్‌ టూల్‌ నిరుద్యోగుల భవితవ్యాన్ని నిర్ణయిస్తోంది. ఉద్యోగాల కోసం అభ్యర్ధించే నిరుద్యోగుల రెజ్యూమెతో పాటు ఫేస్‌బుక్‌ ఐడీని కూడా కంపెనీలు అడుగుతున్నాయి. అభ్యర్ధుల అకౌంట్‌ను సమగ్రంగా పరిశీలించిన తరువాతే ఉద్యోగం ఇవ్వాలా వద్దా అనే దాన్ని నిర్ణయిస్తున్నారు. అకౌంట్‌ యూజర్‌ అప్‌లోడ్‌ చేసిన ఫోటోలు, పోస్టులు, స్టేటస్‌, కామెంట్లు, ఫేస్‌బుక్‌లో మీ స్పందనలు చూశాకే అభ్యర్ధి వ్యక్తిత్వాన్ని కార్పోరేట్‌ కంపెనీలు నిర్ణయిస్తున్నాయి. అమెరికా, చైనా, జపాన్‌లాంటి అభివృద్ది చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ పద్దతిని అవలంబిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ విధానాన్ని మన దేశంలో కూడా కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు పాటిస్తున్నాయి. అయితే కంపెనీలు అనుసరిస్తున్న ఈ విధానాన్ని యువతతో పాటు సైకాలజిస్టులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రతి వ్యక్తి ఆలోచనా విధానం ఒక సమయంలో ఉన్నట్లు ఇంకొక సమయంలో ఉండదంటున్నారు. కేవలం ప్రతిస్పందనలు, భావ ప్రకటనల ఆధారంగా అభ్యర్ధి గుణగణాలను లెక్కించటం సరికాదంటున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఫేస్‌ బుక్‌ అడ్డంగా బుక్‌ చేస్తుందనేది మాత్రం వాస్తవం. కాబట్టి వెంటనే ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసి మీ ఎకౌంట్లోని అనవసర సమాచారాన్ని అంతా తొలగించండి. లేకుంటే ఉద్యోగం రావటం కాస్త ఆలస్యమయినా కావచ్చు లేకుంటే రాకపోనూ వచ్చు.

సోషల్‌ మీడియాలో ‘ఫేక్‌’ ఇమేజ్‌
నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేయడం…

ఫేస్‌ బుక్‌’లో నరేంద్ర మోడీని 65,86,881 మంది ‘లైక్‌’ చేశారు… 5,06,732 మంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ‘ట్విట్టర్‌’లో 28,88,435 మంది మోడీని ఫాలో అవుతున్నారు… రెండేళ్ల కిందట ఇదే రోజు వరకు ఉన్న సమాచారం ఇది. ఈ గణాంకాలు చూసి సహజంగానే ”అబ్బో… ఈయనకు ఇంతమంది ఫాలోవర్సా” అని ఆశ్చర్యపడేవారు ఉంటారు. ‘కోబ్రాపోస్ట్‌’ అనే వెబ్‌సైట్‌ కూడా ఇలాగే ఆశ్చర్యపడింది. అంతటితో ఆగకుండా, ఇందులో నిజమెంతో తెలుసుకోవాలని రంగంలోకి దిగింది. బ్లూ వైరస్‌ పేరిట చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఫేక్‌ ఇమేజ్‌ నాయకులు రెడ్‌ హ్యాండెడుగా పట్టుబడ్డారు. మోడీతోపాటు, ఇంకా ఎంతో మంది నాయకులు సామాజిక వెబ్‌ సైట్లలో సృష్టించుకున్న బూటకపు ఇమేజ్‌ గుట్టును కోబ్రాపోస్ట్‌ రట్టుచేసింది. సోషల్‌ మీడియా రాకతో రాజకీయ ప్రచారం రూపురేఖలే మారిపోయాయి. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లను వాడుకుంటూ నేతలు ప్రచారానికి తెరలేపుతున్నారు. సోషల్‌ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తున్న వారే నేడు, రేపు ఓట్ల వేటలో ముందుండబోతున్నారన్నది కాదనలేని నిజం. ప్రచారం వరకైతే పర్వాలేదు కానీ దాని మాటున కొందరు అసత్య ప్రచారానికి పూనుకుంటున్నారు. శక్తివంతమైన సోషల్‌ మీడియా ద్వారా ఓట్లు రాబట్టుకోవడానికి రాజకీయ పార్టీలు విలువలకు తిలోదకాలిస్తున్నాయి. ఫలానా నాయకుడి కామెంట్‌పై ఇంత మంది ప్రతిస్పందించారు. ఫలానా నాయకుడికి ఇంత మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఫలానా నేత వ్యాఖ్యలను ఇంతమంది ఖండిచారు అన్న ప్రచారం ఇటీవలి కాలంలో మీడియాలో బాగా పెరిగిపోయింది. అయితే ఇదంతా నిజమేనా? నిజంగా ఆ నేతలకు అంత మంది ఫాలోవర్స్‌ ఉన్నారా? ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి కోబ్రాపోస్ట్‌ వెబ్‌సైట్‌ రంగంలోకి దిగింది. ఆపరేషన్‌ బ్లూ వైరస్‌ పేరిట స్టింగ్‌ ఆపరేషన్‌ను నిర్వహించింది. కేవలం రాజకీయ పార్టీలకు సోషల్‌ మీడియాలో ప్రచారం కల్పిస్తూ బతికేస్తున్న ఓ రెండు డజన్ల ఐటీ కంపెనీలు దేశంలో ఉన్నట్లు ఈ ఆపరేషన్‌లో తేలింది. ఆయా పార్టీలకు ఫేక్‌ ఫాలోయింగ్‌ కల్పించడం, ప్రత్యర్థుల ఇమేజ్‌ను దెబ్బ తీసే పోస్టింగ్‌లు చేయడం… ఈ కార్పొరేట్‌ కంపెనీల పనిలో భాగం. కోబ్రా పోస్ట్‌ ప్రతినిధి ఆయా ఐటీ కంపెనీలను కాంటాక్ట్‌ చేసినపుడు, డబ్బిస్తే చాలు… నెగటివ్‌ పబ్లిసిటీ ద్వారా ప్రత్యర్థులకు చెక్‌ పెడతామని ఈ కంపెనీలు నిస్సిగ్గుగా వెల్లడించాయి. ఓటింగ్‌ సందర్భంగా తప్పుడు ప్రచారం చేసి, ఒక వర్గం వారిని పోలింగ్‌ బూత్‌లకు రాకుండా కూడా చేస్తామని ఈ కంపెనీలు ఆఫర్‌ చేశాయి. ఈ ఐటీ కంపెనీలు అందించే సేవల్లో… నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసి ఫేక్‌ ఫాలోయింగ్‌ సృష్టించడం, నెగెటివ్‌ కామెంట్లను తొలగించడం, ట్విట్టర్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సృష్టించడం మొదలైనవి ఉన్నాయి. ఇతరుల కంప్యూటర్లను హ్యాక్‌ చేసి, వాటి ద్వారా మెసేజ్‌లను పోస్ట్‌ చేయడం, అసెంబుల్డ్‌ కంప్యూటర్లను కొనుగోలు చేసి, ప్రాజెక్టు పూర్తయ్యాక వాటిని నాశనం చేయడం ఈ ఐటీ కంపెనీల ప్రత్యేకతలు. ఇలాంటి ప్రచారంలో బీజేపీ ప్రథమస్థానంలో ఉందని కోబ్రాపోస్ట్‌ వెల్లడించింది. ప్రధాని పదవి రేసులో ఉన్న గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీ కోసం ఇలా అనేక ఐటీ కంపెనీలు కృషి చేస్తున్నాయని తెలిపింది. ఈ స్టింగ్‌ ఆపరేషన్లలో ఎక్కువగా మోడీ పేరే వినిపించిందని కోబ్రాపోస్ట్‌ ఎడిటర్‌ అనిరుద్ధ బహల్‌ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ కార్యకలాపాలన్నీ భారతీయ శిక్షాస్మృతి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ ప్రకారం నేరం. అయినప్పటికీ.. నేతలు ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. అధికార పీఠం కోసం విలువలకు తిలోదకాలిస్తూ రాజకీయాలను దిగజార్చిన ఘనత మన నాయకులదే అన్న విషయం ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.

Tag : Beware With Face Book Accounts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *