శ్రీవారి ఆజ్ఞతోనే అంజనాద్రిలో భూమి పూజ -శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో స్వామివారి ఆశీస్సులు లేకుండా ఏపనీ సాధ్యం కాదని, శ్రీవారి ఆజ్ఞతోనే అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలం అభివృద్ధికి భూమిపూజ చేయగలిగామని విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి అన్నారు. తిరుమల ఆకాశగంగ వద్ద బుధవారం శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి భూమిపూజ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన ఆర్కిటెక్చరల్ డిజైన్‌ను ప్రదర్శించారు. అదేవిధంగా శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలం అంజనాద్రి – తిరుమల పేరుతో సిద్ధం చేసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంజనాద్రి వైశిష్ట్యంపై ఎస్వీబీసీ రూపొందించిన దృశ్య శ్రవణ గీతాన్ని ఆవిష్కరించారు.శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి అనుగ్రహభాషణం చేస్తూ స్వామివారిని సాక్షాత్కారం చేసుకున్న శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, శ్రీ పురందరదాసులవారు తమ సంకీర్తనల్లో హనుమంతుని జన్మస్థలంపై ఎన్నో ప్రమాణాలను తెలియజేశారని చెప్పారు. అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అనేక వైష్ణవ క్షేత్రాలతో కూడిన భారతదేశంలో అత్యంత పుణ్యభూమి తెలుగు రాష్ట్రాలు మాత్రమేనన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి, శ్రీశైలం మూడు ప్రాంతాలను కలిపి త్రిలింగదేశం అంటారని, ఈ ప్రాంతం వేదాలకు పుట్టినిల్లు అని తెలిపారు.
శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానంద సరస్వతీ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీమన్నారాయణుడి అవతారమే శ్రీరాముడని, రామభక్తుడైన హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషకరమని అన్నారు. ఈ క్షేత్రం బాగా అభివృద్ధి చెందుతుందని, హనుమంతుని అనుగ్రహం అందరిపైగా ఉంటుందని చెప్పారు.
గొప్పక్షేత్రంగా హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి :
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి
తిరుమల ఆకాశగంగ వద్ద ఉన్న హనుమంతుని జన్మస్థలం, బాలాంజనేయస్వామి, శ్రీ అంజనాదేవి ఆలయం అయోధ్య తరువాత అంతటి గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. ఇక్కడి ఆలయంలో ఎలాంటి మార్పు చేయడం లేదని, ఆలయ ప్రాంగణం అభివృద్ధి, సుందరీకరణ పనులు మాత్రమే చేపడుతున్నామని వివరించారు. వివాదాల జోలికి వెళ్లకుండా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు హిందూ ధర్మ ప్రచారానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో జీర్ణావస్థకు చేరుకున్న వందల ఏళ్ల నాటి పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఎస్సి, ఎస్టి, బిసి, మత్స్యకార గ్రామాల్లో తొలిదశలో 502 ఆలయాలు నిర్మించామని, రెండో దశలో 1000 ఆలయాలకు పైగా నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తద్వారా గిరిజన గ్రామాలు, వెనుకబడిన తరగతుల కాలనీలకు చెందిన పేదలు ఇతర మతాల వైపు చూడకుండా హిందూ ధర్మం ఆచరణకు మరింత కంకణబద్దులు అయ్యే మార్గం ఏర్పడుతుందన్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాక అన్ని ముఖ్య పుణ్యక్షేత్రాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి తమ ధర్మకర్తల మండలి నడుం బిగించిందన్నారు. జమ్మూలో రూ.35 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయని, కన్యాకుమారిలోని శ్రీవారి ఆలయంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. విశాఖపట్నంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి మార్చి నెలలో కుంభాభిషేకం నిర్వహించి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. రాబోవు రోజుల్లో ఈ అంజనాద్రి క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులు బాల ఆంజనేయస్వామి, శ్రీ అంజనాదేవిని దర్శించుకునేలా అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
భక్తుల సూచనతోనే హనుమంతుని జన్మస్థలంపై ముందడుగు :
టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ హనుమంతుని జన్మస్థలంపై ఈ సమయంలోనే ఎందుకు ప్రకటన చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారని, అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ జరిగిన తరువాతే ఈ జన్మస్థలం గురించి హనుమంతుడు భక్తులకు తెలిపాడని భావిస్తున్నానని చెప్పారు. దీని నేపథ్యం గురించి తెలియజేస్తూ హనుమంతుని జన్మస్థలంగా తిరుమలలోని అంజనాద్రిని గుర్తించాలంటూ పలువురు భక్తులు కొంతకాలంగా లేఖల ద్వారా, ఇ-మెయిళ్ల ద్వారా టిటిడిని కోరుతున్నారని చెప్పారు. దీనిపై పలువురు పండితులతో చర్చించి నిర్ధారించేందుకు 2020 డిసెంబరులో పండిత పరిషత్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో అప్పటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి కీ.శే. ఆచార్య మురళీధర శర్మ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానుమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త శ్రీ రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తు శాఖ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ విజయ్‌కుమార్ సభ్యులుగా ఉన్నారని చెప్పారు. అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పర్యవేక్షణలో టిటిడి ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ సమన్వయకర్తగా వ్యవహరించారని తెలియజేశారు.ఈ పండిత పరిషత్ పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ నాలుగు నెలల పాటు క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని నిర్ధారణ చేసిందన్నారు. 2021, ఏప్రిల్ 21న శ్రీరామనవమినాడు పూర్తి ఆధారాలతో హనుమంతుని జన్మస్థలం తిరుమల అని నిరూపణ చేశామని చెప్పారు. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించామని, ఒకరు అభ్యంతరం తెలపగా, సరైన వాదన లేకపోవడంతో పరిగణనలోకి తీసుకోలేదన్నారు.
హనుమత్ శక్తితో మానవశ్రేయస్సు సుసాధ్యం :
శ్రీశ్రీశ్రీ స్వామి గోవిందదేవ్ గిరి జీ మహరాజ్
అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు కోశాధికారి శ్రీశ్రీశ్రీ స్వామి గోవిందదేవ్ గిరి జీ మహరాజ్ మాట్లాడుతూ హనుమత్ శక్తి జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందని, తద్వారా దుష్టశక్తులు తొలగిపోయి మానవశ్రేయస్సు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషంగా ఉందని, హనుమంతుని సేవ కోసం శ్రీరాముడే తనను ఇక్కడికి పంపినట్టు భావిస్తున్నానని చెప్పారు. మహారాష్ట్రలో 700 సంవత్సరాల క్రితం ఉన్న శ్రీ జ్ఞానేశ్వర్ మహరాజ్, వందేళ్ల క్రితం వరకు ఉన్న శ్రీ సాయిబాబ జన్మస్థలాలను ఇప్పటివరకు నిర్ధారించలేకపోయారని, అలాంటిది యుగాల ముందు జన్మించిన హనుమంతుని జన్మస్థలంపై చర్చలు అవసరం లేదని అన్నారు. ప్రతి ఇల్లు హనుమంతుని పూజాస్థానమేనని, వివాదాలను పట్టించుకోకుండా అందరూ కలసి కార్యసిద్ధికి పాటుపడాలని కోరారు.
సశాస్త్రీయంగా అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం : శ్రీశ్రీశ్రీ రామభద్రాచార్య మహరాజ్
చిత్రకూటంలోని శ్రీ తులసీ పీఠ్ సేవా న్యాస్ స్వామీజీ, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీశ్రీశ్రీ రామభద్రాచార్య మహరాజ్ అనుగ్రహభాషణం చేస్తూ వివాదాలు వస్తే పరిష్కరించేవి శాస్త్రాలు మాత్రమేనన్నారు. శాస్త్రాలు సత్యాన్ని మాత్రమే బోధిస్తాయని, పక్షపాతం లేకుండా శాస్త్రం చెప్పిందే పాటించాలని సూచించారు. అంజనాదేవి అంజనాద్రిలో తపస్సు చేసి హనుమంతునికి జన్మనిచ్చినట్టు అష్టాదశ పురాణాలు, రామచరిత మానస్ తదితర గ్రంథాల్లో స్పష్టంగా ఉందని, ఆ ప్రకారం అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమని తెలియజేశారు. దీనిపై వివాదం చేస్తున్న కొందరు తనను కూడా వారించారని, అయితే సత్యం ఎక్కడుంటే తాను అక్కడుంటానని చెప్పారు. 8వ శతాబ్దంలో శ్రీ మురారి రచించిన అనర్గరాఘవం గ్రంథం, 12వ శతాబ్దంలో శ్రీ గోవిందరాజ్ రచించిన భూషణ్ టీకా గ్రంథంలో హనుమంతుని జన్మస్థలానికి సంబంధించిన సశాస్త్రీయమైన ప్రమాణాలు ఉన్నాయని తెలియజేశారు.
యువతకు ఆదర్శం హనుమంతుడు : కప్పగంతుల కోటేశ్వర శర్మ
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీ కప్పగంతుల కోటేశ్వర శర్మ మాట్లాడుతూ శౌర్యానికి ప్రతీక అయిన హనుమంతుడు యువతకు ఆదర్శనీయుడని అన్నారు. ప్రస్తుతం యువత సాధన చేస్తున్న కరాటే, జూడో తరహా క్రీడల్లో హనుమంతుడు నిష్ణాతుడని పురాణాల ద్వారా తెలుస్తోందని చెప్పారు. నేటి యువతలో మౌలిక జీవనానికి సంబంధించిన విలువలు తగ్గుతున్నాయని, హనుమంతుని అరాధన ద్వారా వాటిని పెంచుకోవాలని కోరారు. హనుమంతుని జన్మస్థలానికి సంబంధించి టిటిడి సేకరించిన ఆధారాలు అపూర్వమైనవని, ఎప్పటికీ ఇవి సత్యానికి కట్టుబడి ఉంటాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్, మొరంశెట్టి రాములు, లక్ష్మీనారాయణ, మారుతిప్రసాద్, చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు శేఖర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, సిఇ నాగేశ్వరరావు, ఎస్ఇ- 2 జగదీశ్వర్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈవో సురేష్‌కుమార్, దాతలు ఎన్.నాగేశ్వరరావు, కె.మురళీకృష్ణ, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు రాణి సదాశివమూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags: Bhoomi Puja in Anjanadri by the order of Srivari – Sri Sri Swarupanandendra Saraswati Mahaswami