BJP's efforts to boost south

దక్షిణాదిన బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం

Date:31/12/2018
గుంటూరు ముచ్చట్లు:
ఎన్నికల వేళ దక్షిణాదిన బలపడేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు కొత్త ఇంఛార్జ్ లను నియమించింది. మరో నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ పార్టీ వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే, ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా దెబ్బతిన్నది. ఐదు సిట్టింగ్ స్థానాల్లో నాలుగు కోల్పోయి ఒకే స్థానానికి పార్టీ పరిమితం అయిపోయింది. ఇక, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇంఛార్జ్ గా మురళీధరరావును నియమించింది. తెలంగాణకు చెందిన ఆయన బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. బీజేపీ ఉనికి కూడా ఎక్కువగా లేని పలు రాష్ట్రాల్లో ఆయన పార్టీ బాధ్యతలు తీసుకుని పార్టీకి బలం తీసుకువచ్చిన ఉదాహరణ ఉన్నాయి.
ఇటీవలి కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ఆ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ గా ఆయనే ఉన్నారు. అక్కడ బీజేపీ అధికారంలోకి రాకపోయినా అతిపెద్ద పార్టీగా నిలిచింది. చెప్పుకోదగ్గ స్థాయిలో క్యాడర్, బలం ఉన్న తెలంగాణలోనే బీజేపీ చతికిలపడింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ పూర్తిగా నామమాత్రంగా ఉంది. గత ఎన్నికల్లో తెలంగాణ లానే ఏపీలో కూడా గత ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇద్దరు ఎంపీలు సైతం గెలిచారు. విభజన తర్వాత కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత భారీగా ఉండటంతో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. ఓ దశలో ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కూడా ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే, పరిస్థితి కొన్ని రోజుల్లోనే పూర్తిగా తలకిందులైంది. ఆ పార్టీతో టీడీపీ తెగదెంపులు చేసుకున్నాక సీన్ రివర్స్ అయ్యింది. అన్నిరోజులు బీజేపీని, కేంద్ర ప్రభుత్వ పెద్దలను పొగిడిన నోళ్లే తిడుతున్నాయి.
బీజేపీని రాష్ట్రంలో విలన్ గా చూపించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సక్సెస్ అయ్యింది. దీంతో ప్రత్యామ్నాయంగా మారుతుందనుకున్న బీజేపీ పత్తా లేకుండా పోయే పరిస్థితి నెలకొంది. ఏపీలో పార్టీ బాధ్యతలను మురళీధరరావు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఆయనపై ఇప్పుడు ఉన్న ప్రధాన సవాల్.. ఏపీ పాలిట బీజేపీ విలన్ కాదు అని చెప్పడం. అయితే, అది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. బీజేపీకి మీడియా మద్దతు ఎలానూ లేదు. పైగా వ్యతిరేకంగా ఉంది. ఇక ప్రజల్లోకి వెళ్లి చెప్పాలన్నా గ్రామగ్రామానా క్యాడర్ కూడా లేదు. ఈ సమయంలో ప్రజల్లోకి తమ వాదనను తీసుకువెళ్లడం వారికి సవాల్ గానే మారింది. అయితే, నరేంద్ర మోదీ ద్వారానే విమర్శించే నోళ్లకు జవాబు చెప్పించాలనే వ్యూహాన్ని కూడా ఆ పార్టీ అమలు చేయనుంది.
దీనికి తోడు ఈ నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం ఏ విధంగా సహకరించిందో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ భావిస్తోంది. ఇక, ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని అనుకుంటోంది. ఆ పార్టీకి ఏపీలో కలిసివచ్చే పార్టీలేవీ లేవు. దీంతో ఎలాగూ ఒంటరి పోరే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పాటు బలమైన నాయకులు ఉన్న పలు నియోజకవర్గాలను గుర్తించి వాటిపై ప్రత్యేకంగా టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఏపీలో తమ ప్రాతినిథ్యం ఉండేలా చూసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. మరి, మురళీధర్ రావు ఈ కష్టతర బాధ్యతలను ఎలా నిర్వహిస్తారో చూడాలి.
Tags:BJP’s efforts to boost south

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *