ఘనంగా ముగిసిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు.

తిరుప‌తి   ముచ్చట్లు:
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నిబంధ‌న‌ల నేపథ్యంలో ఆల‌యంలో ప‌విత్ర జ‌లం నింపిన గంగాళంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ముందుగా ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వ‌ర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
అనంత‌రం చ‌క్ర‌స్నానం జ‌రిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తులు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. రాత్రి 7 నుంచి 8 గంట‌ల‌ వరకు నిర్వహించే ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో జెఈవో వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, డీఎఫ్ వో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్రాయలు పాల్గొన్నారు.
 
Tags:Brahmotsavalu of Sri Kalyana Venkateswaraswamy which ended in a grand manner

Natyam ad