రాములోరి కళ్యాణానికి బస్సులు రెడీ

Date:17/03/2018
ఖమ్మం ముచ్చట్లు:
భద్రాద్రి పుణ్యక్షేత్రంలో ఈ నెల చివరి వారంలో జరగనున్న శ్రీరామ నవమి ఉత్సవాలకు భక్తులను అధిక సంఖ్యలో తరలించేందుకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రా నుంచి తరలివచ్చే భక్తులకు రవాణాలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో తెలంగాణ జిల్లాల ఆర్టీసీ డిపో మేనేజర్లు, డివిజనల్‌ మేనేజర్లు, ఆంధ్రాలోని రాజమండ్రి, తిరువూరు, విజయవాడ, కొవ్వూరు, ఏలూరు డిపోలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నవమి ఉత్సవాలకు ప్రయాణికులను తరలించేందుకు తీసుకున్న కార్యాచరణను పరిశీలించారు. అప్పుడు వచ్చిన భక్తుల సంఖ్యను బేరీజు వేసుకొని ఈ దఫా విళంబినామ సంవత్సరం(శ్రీరాముడు జన్మించిన సంవత్సరం) ప్రతీ 60 ఏళ్లకోసారి వచ్చే సంవత్సరం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చేందుకు అవకాశాలను అంచనా వేశారు. ఇందుకు సంబంధించి సరిపడా బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి కార్యాచరణ రూపొందించారు. రెండు రాష్ట్రాల నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి 687 బస్సులను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. రద్దీ పెరిగే అవకాశాలుంటే అదనంగా మరో 200 బస్సులను ఏర్పాటు చేయడానికి సన్నద్ధంగా ఉండాలని ఈడీ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి పుణ్యక్షేత్రం వద్ద పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చర్చించారు. ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రణాళికబద్ధంగా బస్సులను పార్కింగ్‌ చేయడానికి స్థలాన్ని కేటాయించి అక్కడే పాయింట్ల వారీగా(జిల్లాల వారీగా) బస్సులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకునే విషయంపై సుధీర్ఘంగా చర్చించారు.
Tags: Buses will be ready for rallies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *