ఆదమరిస్తే..అంతే సంగతి

Date:13/03/2018
ఖమ్మం ముచ్చట్లు:
సింగరేణి ప్రాంతంలోని బైపాస్‌ కూడలి ఇల్లెందు-మహబూబాబాద్‌ ప్రధాన రహదారి చెక్‌పోస్టు దగ్గర రోడ్డు ప్రమాదకరంగా మారిందని వాహనదారులు అంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఆదమరచినా ప్రమాదమే అని చెప్తున్నారు. ఇటీవలిగా ఇక్కడ భారీ అనేక రోడ్డు ప్రమాదాలు త్రుటిలో తప్పాయని వాహనదారులే కాక స్థానికులూ వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితి పరిశీలిస్తే వారి వ్యాఖ్యల్లో అతిశయోక్తి లేదనిపిస్తుంది. స్థానికంగా నిత్యం వందలాది బొగ్గు లారీలు, కేవోసీ, జేకేవోసీల నుంచి సీహెచ్‌పీ వార్ప్‌ లోడింగ్‌ పాయింట్‌కు రవాణా నిమిత్తం తిరుగుతుంటాయి. ఈ క్రమంలో ఇల్లెందు-మహబూబాబాద్‌ కూడలి దాటి సీహెచ్‌పీ వైపు రావాల్సిన పరిస్థితి. అయితే సరిగ్గా చెక్‌పోస్టు దగ్గరకు రాగానే వేగాన్ని నియంత్రించేందకు ఎలాంటి ప్రమాద సూచికలు, నియంత్రికలు ఏర్పాటుచేయలేదు. దీంతో లారీలు, ఇతర వాహనాలు ఇరువైపుల దూసుకెళ్తున్నాయి. ఆ వేగానికి ద్విచక్రవాహనాలు, ఆటోలు నడిపేవారు బెంబేలెత్తిపోతున్నారు.మరోవైపు లారీలు వెళ్తున్నప్పుడు దుమ్ము, దూళీ ఎగిసిపడుతుండటంతో వాహనదారులతో పాటు చెక్‌పోస్టులో విధులు నిర్వహించే గార్డులు నానాపాట్లు పడుతున్నారు. మూడు రహదారుల ఒకే చోట ఉండేడడంతో ఎటువైపు నుంచి ఏమి వస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కొత్తవారికి ఈ రహదారి కూడలి దగ్గరకు వచ్చే వరకు కన్పించని పరిస్థితి నెలకొంది. గతంలో జరిగిన ప్రమాదాల్లో కొందరు తీవ్ర గాయాలపాలుకాగా మరికొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. రోడ్డుపై దుమ్ము వ్యాప్తి చెందకుండా నీరు చల్లకపోవడంతోపాటు రహదారి కంకర తేలింది. ఇప్పటికైనా సంబంధిత విభాగం అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. లేకుంటే ఈ ప్రాంతం పెను ప్రమాదాలకు కేంద్రంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
Tags: But that’s all

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *