నల్గొండ ఉపఎన్నిక కోసం కారు కసరత్తు

Date:17/03/2018
నల్గొండ ముచ్చట్లు:
నల్లగొండకు ఉప ఎన్నిక ఖాయమన్న నిశ్చితాభిప్రాయానికి అధికార టీఆర్‌ఎస్‌ నాయకత్వం వచ్చింది. ఈ మేరకు జిల్లా నేతలతో పార్టీ అధినాయకత్వం మంతనాలు జరుపుతోంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు.. నల్లగొండపై పట్టు సాధించేందుకు అవసరమైన వ్యూహ రచన చేస్తోంది. బుధవారం రాత్రి కేబినెట్‌ భేటీ సుదీర్ఘంగా జరగడం వల్ల జిల్లా నాయకులతో కూలంకశంగా చర్చించలేక పోయారని, గురువారం సీఎం కేసీఆర్‌ మరో మారు పార్టీ ముఖ్య నాయకులు కొందరిని పిలిపించుకుని ఎన్నికల వ్యూహంపై చర్చించారని తెలిసింది.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విసిరిన మైక్‌ హెడ్‌సెట్‌ శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు తగిలి కంటికి గాయమైందని తేల్చారు. స్పీకర్‌ నిర్ణయం మేరకు కోమటిరెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయినట్లు గుర్తిస్తూ శాసన సభా సచివాలయం భారత ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో ఎన్నికలు జరిగే ఖాళీ స్థానాలతో కలిపి నల్లగొండ ఉపఎన్నిక కూడా వస్తుందన్న అభిప్రాయం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఉపఎన్నిక అనివార్యమైతే, ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ జిల్లా నాయకులు దిశానిర్దేశం చేశారని సమాచారం. పార్టీ వర్గాలు చెబుతున్న వివరాల మేరకు నల్లగొండ నియోజకవర్గంలో అంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. టీడీపీ నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరగానే ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో అప్పటిదాకా ఇన్‌చార్జిగా వ్యవహరించిన దుబ్బాక నర్సింహా రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముందునుంచీ ఎడమొహం, పెడమొహంలా ఉంటున్న ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి, కంచర్ల వర్గాలు కలిసి పనిచేస్తాయా అన్న అనుమానాలూ రేకెత్తాయి. దీంతో అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిందేనని, అందరినీ కలిసి, కలుపుకొని పోవాల్సిన బాధ్యత భూపాల్‌రెడ్డిదేదని కేసీఆర్‌ చెప్పారని అంటున్నారు.ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా, రాకున్నా, 2019 సార్వత్రిక ఎన్నికల కోసమైనా ఇప్పటినుంచే పనిచేసుకుంటూ పోవాలని కూడా సూచించారని సమాచారం. మరో వైపు జిల్లా నాయకులను, ముఖ్యంగా నియోజకవర్గంలోని గ్రూపులను సమన్వయం చేసి, అంతా కలిసికట్టుగా పనిచేయించే బాధ్యతను, ఉప ఎన్నికకు ఇన్‌చార్జ్‌గా మంత్రి కేటీఆర్‌ను నియమించారని తెలిసింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్‌ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ వ్యవహారాలు ముగిసి ఉప ఎన్నిక ప్రకటన వెలువడేలోగా పార్టీని బలోపేతం చేసుకోవడం, తమలో ఉన్న అభిప్రాయ బేధాలను పక్కన పెట్టి కలిసి పనిచేసేలా కార్యక్రమాలను రూపొందించే పనిలో టీఆర్‌ఎస్‌ ఉంది.
Tags: Car work for Nalgonda Upellika

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *