బ్యాంకుల్లో ఉపాధి కూలీలకు నగదు కష్టాలు

Date:19/06/2018
వరంగల్ ముచ్చట్లు:
ఉపాధి కూలీలకు నగదు కొరత సమస్య వెంటాడుతోంది. చెమటోడ్చి పనిచేసినా కూలి డబ్బులు సకాలంలో రాకపోవడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. పనిచేసిన పైసలు ఎప్పుడు వస్తాయని బ్యాంకులు, పోస్టాఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. చెల్లింపుల విషయంలో డబ్బులు కొరత ఏర్పడడంతో నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారు. రబీ సీజన్‌లో జిల్లాలో సాగుబడి తక్కువగా కావడంతో వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో గ్రామాల్లో పేదలు ఉపాధి పనుల బాట పట్టారు. ఎన్నడూ లేని విధంగా ఈ వేసవి సీజన్‌లో పనిచేసే కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి నుంచి మే చివరి వారం వరకు ప్రతిరోజు సగటున 15వేల నుంచి 18వేల మంది జిల్లాలో ఊపాధి పనులకు వెళ్లారు. ప్రధానంగా నగదు కొరత ఉపాధి పథకానికి అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. ఫ లితంగా కూలీలు పనిచేసి నెలల గడుస్తున్నా డబ్బులు తీసుకునే పరిస్థితిలేదు. ఈ కారణంగా కుటుంబ పరంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు మదనపడుతున్నారు. ఆ మూడు మండలాల్లో మరింత కష్టాలుజిల్లాలో ఆరు మండలాల్లోని 94 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. 42వేల జాబ్‌కార్డులు ఉండగా సుమారు 80వేలకుపైగా కూలీలు అర్హులున్నారు. ఒక్కో కార్డుపై కుటుంబంలో ఒక్కరి నుంచి 4వరకు జాబ్‌కార్డుల్లో పేర్లు కలిగి ఉన్నారు. జిల్లాలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లో బ్యాంకుల ద్వారా, మిగతా మూడు మండలాలు ధర్మసాగర్, హన్మకొండ, హసన్‌పర్తి మండలాల్లో పోస్టాఫీస్‌ల ద్వారా డబ్బుల చెల్లింపులు జరుగుతున్నవి. ఈ సీజన్‌లో మార్చి మాసం నుంచి 12వేల మందికిగాను సుమారు రూ. రెండుకోట్ల వరకు కూలీలకు రావాల్సి ఉంది ,కాని పెద్ద నోట్ల రద్దు, పోస్టాఫీస్ ఉద్యోగుల సమ్మె కారణంగా చెల్లింపుల్లో జాప్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.ఉపాధి హామీ డబ్బుల చెల్లింపుల విషయంలో నగదు కొరత సమస్యగా ఉంటే, మరో సమస్య గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు సమ్మెతో కూలీలకు డబ్బులు రావడంలేదు. దీంతో కూలీలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని కలెక్టర్ ఆమ్రపాలి సమ్మె విరమణ తర్వాత కలెక్టరేట్‌లో ఉపాధి బిల్లుల చెల్లింపులపై డీఆర్‌డీఏ, బ్యాంకర్స్, పోస్టాఫీస్ అధికారులతో సమీక్ష చేశారు. వెంటనే కూలీలకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. జిల్లాల్లో మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.రెండుకోట్ల రెండు లక్షలకు గానూ కలెక్టర్ చొరవతో వారంరోజుల్లో రూ.43 లక్షలు చెల్లించారు. వీటిలో పోస్టాఫీస్‌ల నుంచి చెల్లింపులు జరిగే మూడు మండలాలు ధర్మసాగర్, హన్మకొండ, హసన్‌పర్తి గ్రామాలకు చెందిన కూలీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇంకా జిల్లా వ్యాప్తంగా 10వేల మందికిపైగా రూ.కోటి 59 లక్షలు చెల్లించాల్సి ఉంది. మొత్తానికి గ్రామాల్లో ఉపాధి పని మీద ఆధారపడి జీవించే పేదలకు నగదు సమస్య కష్టాలను తెచ్చిపెట్టింది.రాష్ట్రప్రభుత్వం జాబ్‌కార్డు ఉన్న ప్రతీఒక్కరికి సీజన్‌లో వంద రోజుల పని కల్పించాలనే ఆదేశాలు జారిచేయడం, పైగా రోజు వారి కూలి వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.195 నుంచి రూ.205వరకు పెంచడంతో వేసవి సీజన్‌లో కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఇదే సీజన్‌లో 5వేల నుంచి 10వేల కూలీలు మాత్రమే పనిచేశారు. ఈ వేసవి సీజన్‌లో ఈ సంఖ్య రెండింతలు పెరగడంతో ఈ ఏడాది పనిదినాల టార్గెట్‌ను కేవలం మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే పూర్తిచేశారు. ఉపాధి కూలీల డబ్బులు పదిహేను, నెల రోజుల్లో నే కేంద్రప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా చెల్లించేది. అయితే పెద్ద నోట్ల రద్దు, ఇటీవల పోస్టాఫీస్ గ్రామీణ ఉద్యోగుల సమ్మె కారణంగా డబ్బుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.
Tags:Cash hards for employers in banks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *