మేడారంలో కాసుల పంట.

వరంగల్ ముచ్చట్లు:
తెలంగాణలో అట్టహాసంగా జరిగిన సమ్మక్క-సారలమ్మల జాతరకు సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా సోమవారం నాటికి పది కోట్ల రూపాయలు దాటింది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో కానుకల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 450 హుండీల లెక్కింపు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీల ద్వారా రూ.10,00,63,980 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్లు వివరించారు. నాణేలను కూడా లెక్కించిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తామన్నారు. లెక్కించిన నగదును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులకు అప్పగించి బ్యాంకులో జమ చేస్తున్నారు. దేవస్ధానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కింపు జరిగే మండపం పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.2020లో మేడారం జాతర సందర్భంగా రూ.15 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వాటిలో నగదు రూపంలో రూ.11.65 కోట్లు, 1,063 గ్రాముల బంగారం, 53 కిలోల వెండి సమకూరింది. అయితే ఈ సారీ జాతర ముందు నుంచే తల్లులను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మేడారం మహా జాతర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మొత్తం కోటి ముప్పై లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా వేశారు. 50 లక్షల మందికి పైగా భక్తులు జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. వేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు.
 
Tags:Cassava crop in Medaram

Natyam ad