టిటిడి అధికారులు, సిబ్బందితో జెఈవో ప్రమాణం

Date: 11/01/2018

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

టిటిడిలో ఉద్యోగ బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహిస్తామని ఉద్యోగులు, సిబ్బంది గురువారం ఉదయం ప్రమాణం చేశారు. తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి భ‌వ‌నం ప్రాంగ‌ణంలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు ఈ మేర‌కు అధికారులు, సిబ్బంది చేత ప్రమాణం చేయించారు.

“అఖిలాండ‌కోటి బ్రహ్మాండ‌నాయ‌కుడైన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కొలువులో ఒక ఉద్యోగిగా సేవ చేసే అదృష్టం నాకు క‌లిగింది. ఇది నా పూర్వ‌జ‌న్మ పుణ్య‌ఫ‌లంగా భావిస్తున్నాను. ఈ స‌ద‌వ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని నేను నా ఉద్యోగధ‌ర్మాన్ని త్రిక‌ర‌ణ‌శుద్ధిగా నిర్వ‌హిస్తాను. స్వామిని సేవించ‌డానికి నిత్య‌మూ వేల‌కొల‌దిగా తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఏమాత్రం అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చిత్త‌శుద్ధితో నా విధులు నెర‌వేరుస్తాను. విధినిర్వ‌హ‌ణ‌లో నీతి, నిజాయితీతో న‌డ‌చుకుంటాను. హిందూ ధ‌ర్మాన్ని, హిందూ సంప్ర‌దాయాన్ని పాటిస్తూ,  అన్య‌మ‌త పాటింపు, ప్ర‌చారానికి పాల్ప‌డ‌ను. జిఓ.ఎంఎస్‌.నం.1060, తేదిః 24.1.1989 లోని 9(6)ని అతిక్ర‌మించ‌ను. ఏదైనా కార‌ణాల‌తో అన్య‌మ‌తం పాటించ‌డం గానీ, ప్ర‌చారంలోగానీ లేదా అలాంటి కార్య‌క్రమాల్లో పాల్గొన్న‌ట్టు యాజ‌మాన్యం దృష్టికి వ‌స్తే త‌గిన క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు బాధ్యుడిన‌వుతాను” అని శ్రీ‌వారి చిత్ర‌ప‌టం ముందు ప్ర‌మాణం చేశారు.

ప్ర‌మాణం చేసిన‌వారిలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేర‌కు అధికారులతో, సిబ్బందితో ప్ర‌మాణం చేయించిన‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు ప్ర‌మాణప‌త్రంతో ప్ర‌మాణం చేసిన విష‌యాన్ని ఉద్యోగుల స‌ర్వీస్ రిజిస్ట‌ర్‌లో ఎంట్రీ వేయిస్తామ‌న్నారు. ఉద్యోగులు ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలియ‌జేశారు.

Tags: CEO with TTD officers and staff

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *