Chandrababu

చంద్రబాబు అన్నింటికీ అతీతుడా?

-ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనా?

Date: 13/01/2018

అమరావతి ముచ్చట్లు:

ప్రభుత్వాధినేత అంటే నిరంకుశడు కాదు. ప్రజలు అధికారం ఇచ్చినంత మాత్రాన తమ చిత్తానికి చెలరేగిపోతామని అనడానికి లేదు. ప్రతి నిర్ణయానికి, ప్రతి చర్యకు, ప్రతి పైసా ఖర్చుకు ప్రజా ప్రతినిధుల బాధ్యులుగా వుండాల్సిందే. ఆ సంగతి విస్మరించి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యంగా రాజధాని వ్యవహారంలో ఆయన ఎవరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు ఆఘ మేఘాల మీద ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు. ఇప్పుడు ఏమనుకున్నా, మయసభలాంటి అందమైన రాజధాని నగరం కళ్ల మందు ప్రత్యక్షమైన తరువాత ప్రజలు అన్నీ మరచిపోయి, దాన్ని చూస్తూ వుండిపోతారని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పదేళ్ల తరువాత అంది వచ్చిన అధికారంతో తమకు ఎంతో కొంత పనులు, అధికారవైభోగం సంప్రాప్తిస్తే చాలు, బాబు ఎలా చేసుకుపోయినా, తాము సమర్థిస్తాం అనేట్లు వున్నారు ఆయనను నమ్ముకున్న జనాలంతా. రాజధానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సమాధానాలు లేవు. అనేక అభ్య్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సమాధానాలు లేవు. అన్నింటికి మించి ఓ రాష్ట్రం ఓ విదేశంతో కలిసి ఓ రాజధాని కోసం కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటన్నది ఇంకా పూర్తిగా బహిరంగం కాలేదు. ఆరంభంలో వందల కోట్ల ఫీజు అన్నారు. ఇప్పుడు ఫ్రీ సర్వీసు అంటున్నారు. సింగపూర్‌ లాంటి వాణిజ్య దేశం, అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి, ఆ దేశ ఆదాయం కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థ, భారత్‌లోని ఓ రాష్ట్రానికి ఏ ఉద్దేశంతో ఫ్రీ సర్వీసు చేస్తుంది అన్నది తెలియాల్సి వుంది. అదే విధంగా, మన దేశంలోని ఓ రాష్ట్రం, ఓ విదేశంతో ఒప్పందం కుదుర్చుకుంటే, దాని విధివిధానాలు కేంద్రానికి తెలియాల్సిన అవసరం వుందా లేదా అన్నది కూడా తెలియాల్సి వుంది. అలా తెలియాల్సి వుంటే, కేంద్రానికి తెలసిందా? ఆ ఒప్పందానికి కేంద్రం తలూపిందా? అన్నది కూడా తెలియాలి. అలాగే, సిఆర్‌డిఎ అన్నది కేంద్రంలోని స్వంతంత్ర స్వంస్థ కాగ్‌ పరిథిలోనే వుంటుందా? వుండదా? దాని జమా ఖర్చులు అన్నీ కాగ్‌ కూడా చూస్తుందా చూడదా? ఒకదగ్గర అడవులు నాశనం చేస్తే, ప్రత్యమ్నాయంగా అడవులు పెంచాలన్నది కేంద్ర విధానం. మరి పంట పొలాలు ముఫై వేల ఎకరాలు పాడయిపోతుంటే, వేరే చోట బంజరులను సాగులోకి తెచ్చే ఆలోచన ఏమన్నా వుందా లేదా? అసలు రాజధాని నిర్మాణం 30 వేల ఎకరాలేనా? ఇంకా ఎక్కువా? ప్రజలకు అడిగే హక్కవుంది. చంద్రబాబుకు చెప్పాల్సిన బాధ్యత వుంది. అడిగితే తెలుగుదేశం మీడియా విభాగం సరఫరా చేసిన తిట్లు వల్లించినంత మాత్రాన బాధ్యతల నుంచి తప్పించుకోలేరు అని తెలుగు తమ్ముళ్లు గమనించుకోవాలి.

Tags: Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *