మారుతున్న రాజకీయం 

Date:14/03/2018
విశాఖపట్నం  ముచ్చట్లు:
జిల్లా రాజకీయం మారుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం మంత్రులు వైదొలగిన తరువాత సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి మాత్రమే వైదొలిగామని, ఎన్‌డీఏలో ఇంకా కొనసాగుతున్నామని తెలుగుదేశం పార్టీ చెబుతున్నా…ప్రస్తుతం ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరికి వారు వ్యూహాలు రచించుకుంటున్నారు. ఆ ప్రభావం జిల్లాపైనా స్పష్టంగా కనిపిస్తోంది.మొన్నటివరకు 2019 ఎన్నికల్లోను తెలుగుదేశంతోనే కలిసి పనిచేస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ మాటలు చెప్పడానికి సాహసించలేకపోతున్నారు. ఉప్పు, నిప్పులా మారిన రెండు పార్టీలు పూర్తిగా తెగతెంపులు చేసుకునే స్థితికి వచ్చేశాయని ప్రజల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్‌ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశమవుతోంది. అందులో దేనిపై చర్చిస్తారు? తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఎలా వుండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ, టీడీపీల మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. 2014 ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీకి తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఒక లోక్‌సభ (విశాఖపట్నం) సీటు, రెండు అసెంబ్లీ (విశాఖ ఉత్తరం, పాడేరు) సీట్లు కేటాయించింది. వాటిలో రెండింటిని బీజేపీ గెలుచుకుంది. పాడేరు అసెంబ్లీ స్థానానికి పోటీచేసిన లోకుల గాంధీ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే 2019 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఈ మూడు స్థానాలకు తమ అభ్యర్థులను రంగంలోకి దించాల్సి ఉంటుంది.
ప్రధానంగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎవరిని పోటీలో దింపుతుందనేది నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీలుగా పోటీ చేయడానికి ప్రస్తుతం పార్టీలో ఎవరూ సుముఖంగా లేరు. గీతం కళాశాల అధ్యక్షులు ఎంవీవీఎస్‌ మూర్తి గతంలో ఎంపీగా పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక ప్రస్తుత గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన పురందేశ్వరి విజయం సాధించారు. ఆ తరువాత కాలంలో పల్లా శ్రీనివాస్‌ తెలుగుదేశంలో చేరి గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తగిన అభ్యర్థి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లేదంటే పార్టీలో సీనియర్‌ నేత, మంత్రి గంటా శ్రీనివాసరావును బరిలో దించే అవకాశాలు కూడా వున్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన తన వారసుడిగా కుమారుడు రవితేజను రాజకీయాల్లోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నారు. పార్టీ అధిష్ఠానం అంగీకరిస్తే…ఎంపీగా తాను ఢిల్లీకి వెళ్లి, ఎమ్మెల్యేగా కుమారుడిని బరిలో దించాలనే ఆలోచనలో వున్నట్టు సమాచారం.వీరెవరూ ముందుకు రాకపోతే…ఎన్నికల సమయానికి వేరొకరిని పార్టీ రంగంలోకి దింపే అవకాశం ఉంది. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్‌రాజు ఉన్నారు. అక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేదు. అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న వారిలో మాజీ కార్పొరేటర్‌ ముత్యాలనాయుడు, దువ్వారపు రామారావు తదితరులు ఉన్నారు. అయితే ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా వున్నారని సమాచారం.
అందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు భోగట్టా. ఇక్కడ మళ్లీ విష్ణుకుమార్‌రాజే ఎమ్మెల్యేగా పోటీలో దిగితే…ఆయన్ను ఢీకొనగలిగిన నాయకుడినే తెలుగుదేశం దింపాల్సి ఉంటుంది. పాడేరు సీటును తెలుగుదేశం పార్టీ అప్పట్లో బీజేపీకి ఇవ్వడం ఇష్టంలేకపోయినా కొన్ని సర్దుబాట్లు చేయాల్సి రావడంతో తప్పనిసరై వదిలేసింది. అక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన లోకుల గాంధీ నాల్గవ స్థానంలో నిలిచారు. పాడేరు సీటుకు తెలుగుదేశం పార్టీలో ఆశావహులు ఎక్కువమంది ఉన్నారు. మాజీ మంత్రి మణికుమారి, ప్రసాద్‌ బొర్రా నాగరాజు గత ఎన్నికల్లోనే సీటు ఆశించారు. అయితే ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా వైసీపీని వీడి తెలుగుదేశంలోకి వచ్చేయడంతో బహుశా ఆమె అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది.
Tags: Changing politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *