సరకు రవాణా సమస్యలకు చెక్

Date:12/03/2018
నిర్మల్‌ ముచ్చట్లు:
మారుమూల గిరిజన గ్రామాలకు సరకుల రవాణా కొంత ఇబ్బందిగా ఉంటోంది. రవాణా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో గిరిపుత్రులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక వారు పండించే పంటలు లేదా విక్రయించే సరుకులు ఇతర ప్రాంతాలకు చేరవేయడంలో తిరిగి స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఇకమీదట ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోనున్నాయని నిర్మల్ జిల్లా అధికారులు అంటున్నారు. కేవలం నిర్మల్ జిల్లాలోనే కాక మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో మారూమూల గిరిజన గ్రామాల్లో సరకు రవాణా ఇక్కట్లు తొలగించేందుకు సర్కార్ రూ.6.04కోట్లను మంజూరు చేసిందని చెప్తున్నారు. ఈ నిధులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 252 మినీ ట్రాలీలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో వాహనానికి 60శాతం సబ్సిటీ చొప్పున అర్హులైన గిరిజన యువతకే అందించనున్నారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులు పండించిన పత్తి, కందులు ఇతరత్రా పంటలను వారు మార్కెట్‌కు తెచ్చి విక్రయించేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో తమవద్దకు వచ్చే దళారులకే పంటలు విక్రయిస్తూ నష్టపోతున్నారు. దీంతోపాటు చౌకధరల దుకాణాలలో ఇచ్చే సరకులను తమ ఇళ్లకు తెచ్చేందుకు చిన్న వాహనాలులేక ఇబ్బంది పడుతున్నారు. గిరిజన రైతుల సరకు రవాణా సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ గిరిజన కార్పోరేషన్‌ ద్వారా రూ.6.04కోట్ల నిధులను మంజూరు చేసింది. ఐటీడీఏ చోదక, యాజమాని పథకం ద్వారా 252 వాహనాలను అర్హులైన నిరుద్యోగ గిరిజన యువతకు మంజూరు చేయనుంది. మినీ ట్రాలీలపై గరిష్ఠంగా రూ.2.40లక్షలు రాయితీ లభించనుంది. లబ్ధిదారుని వాటా 10శాతం, 30శాతం బ్యాంకు రుణంతో వాహనం లబ్ధిదారునికి అందజేయనున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాడ్జి నెంబరు కలిగిఉండి, గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి వార్షిక ఆదాయం రూ.2లక్షలు కలిగిఉన్న నిరుద్యోగ గిరిజన యువతను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అర్హులు ఈనెల 15లోగా తమ మండల పరిషత్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం మండలాభివృద్ధి అధికారి, బ్యాంకు మేనేజర్‌, ఐటీడీఏ ఏపీఓ జనరల్‌ లేదా డీటీడీఓ, డీఆర్‌డీఏ, మండల మహిళా సమాఖ్య సభ్యురాలుతో కూడిన ఎంపిక కమిటీ అభ్యర్థిని ఎంపిక చేస్తుందని చెప్పారు.
Tags: Check for freight transport issues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *