ముఖ్యమంత్రి స్పెషల్‌ సెక్రటరీ దువ్వూరి కృష్ణ మీడియా సమావేశం

రాష్ట్ర పరపతిని దెబ్బతీయడానికే దుష్ప్రచారం….
రుణాలు రాకుండా.. అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవడానికే విష ప్రచారం.
 
అమరావతి ముచ్చట్లు:
 
– ఇటీవల కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ పత్రికలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షం మొదలుపెట్టిన ఈప్రచారాన్ని కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను వక్రీకరించి, ప్రజల్లో అపోహలను సృష్టించడానికి ఈ ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా బాధకరమైన పరిస్థితి.
– వీరు ఒకవైపు వాదనను వినిపించడమో లేదా ఆర్థిక అంశాలమీద పూర్తి అవగాహన లేక ఇచ్చే ప్రకటనల వల్లకూడా కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
– తప్పుడు ప్రచారం వెనుక ఉద్దేశం ఏంటో మనకు అందరకూ తెలుసు. ఆర్థిక పరంగా రాష్ట్రం చాలా దయనీయ పరిస్థితిలో ఉందని, రాష్ట్రం దివాళా మార్గంలో పయనిస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని నమ్మించి రాష్ట్రానికి పరపతి లేకుండా చేయాలని, అప్పులు పుట్టనివ్వకుండా చేసి తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగనీయకుండా అడ్డు వేయాలన్నది దీనివెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం తన ప్రతిష్టను కోల్పోతుందనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో ఈ తప్పుడు, దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. అందుకే వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మీడియా మిత్రులను ఇవాళ కలిశాను.
రెవిన్యూ లోటుపై వక్రీకరణలా?
2017–18 మొదటి మూడు త్రైమాసికాలకు రెవిన్యూ లోటు5,484%
అప్పుడు ఎందుకు కథనాలు రాయలేదు?
– తాజాగా ఒక పత్రికలో ఒక కథనం వేశారు. రాష్ట్రం రెవిన్యూ లోటు, బడ్జెట్‌ అంచనాలకు మించి, మొదటి మూడు త్రైమాసికాల్లోనే, డిసెంబరు నాటికే 918%కి చేరుకుందని అని ఈ కథనంలో రాశారు.
– దీనిద్వారా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఈ కథనం ద్వారా ఒక ప్రయత్నం చేశారు.
– నిజం చెప్పాలంటే.. ఇదొక బడ్జెటింగ్‌ ఎక్సర్‌సైజ్‌. బడ్జెట్లో పేర్కొన్న అంచనాలకు సంబంధించి ఆదాయాలు, ఖర్చులు… తదితర అంశాలరు సంబంధించి ఈ ప్రమాణాలను పేర్కొంటూ ఉంటారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ.
– గడచిన మూడేళ్లుగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉండడం, మరియు కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు కచ్చితంగా ఇంతే రెవిన్యూ లోటు ఉంటుందని కచ్చితంగా అంచనా వేయడంకూడా చాలా క్లిష్టమైన పరిస్థితి.
– ఎలాంటి విపత్తు, ఎలాంటి కష్టం లేనప్పుడు కూడా టీడీపీ హయాంలో రెవిన్యూ లోటు ఎలా ఉందో గణాంకాలు చూస్తే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. 918 శాతం రెవిన్యూ లోటు ఉందని ఏ రికార్డు చూసి చెప్పారో, అదే రికార్డులో 2016–19 మధ్య మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రెవిన్యూ లోటుకు సంబంధించిన గణాంకాలను ఒకసారి పరిశీలించాలి.
– 2016–17లో మొదటి మూడు త్రైమాసికాలకు రెవిన్యూ లోటును చూస్తే 422 శాతం ఉంది.
– 2017–18 మొదటి మూడు త్రైమాసికాలకు రెవిన్యూ లోటును చూస్తే దాదాపు 5,484 శాతం ఉంది.
– 2018–19 మొదటి మూడు త్రైమాసికాలను చూస్తే రెవిన్యూ లోటు 359శాతం ఉంది.
– రెవిన్యూ లోటు 918 శాతం ఉందంటూ ఒక కథనం రాసి, ఆర్థిక సంక్షోభం ఉందంటూ ఏ పత్రికైతే చెప్పిందో, ఆరోజు కూడా అదే పత్రిక ఉంది. మరి 5,484% రెవిన్యూ లోటు ఉన్నప్పుడు ఆపత్రిక ఎందుకు రాయలేదు? ఈ విషయాన్ని ప్రజల దృష్టికి ఆ పత్రిక ఎందుకు తీసుకురాలేదు? ఈవివరాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ బాగోలేదనే సంకేతాన్ని ఇవ్వడానికి ఆ పత్రిక ఎందుకు అప్పుడు ప్రయత్నించలేదు?
– వాస్తవం చెప్పాలంటే రెవిన్యూ లోటు ఎంత ఉంటుందో బడ్జెట్లో అంచనాలు పెట్టడానికి అప్పట్లో కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులు లేవు.
– అనూహ్యంగా కోవిడ్‌ రావడం, లాక్‌డౌన్‌ విధించడం, ఆర్థిక వ్యవస్త పూర్తిగా నిలిచిపోవడం లాంటి ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు కదా? జీవనోపాధిని ప్రజలు కోల్పోవడం, విపరీతమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు అప్పుడు లేనేలేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా అంత రెవిన్యూ లోటును మనం చూశాం.
– ఇప్పుడు వరుసగా మూడేళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ మందగమనంతోపాటు, కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తాయి.
– ఉదాహరణకు చూసుకుంటే…కేంద్ర ప్రభుత్వం 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవిన్యూ లోటు బడ్జెట్‌ అంచనాలు, రూ.6,09,219కోట్లు కాగా, వాస్తవానికి రెవిన్యూ లోటు రూ.11,40,526 కోట్లు? ఆదాయాలు గణనీయంగా పడిపోవడమే కాక, ఖర్చులు కూడా అనూహ్యంగా పెరగడం వల్ల ఇది జరిగింది.
– దీనివల్ల 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీలో రెవిన్యూలోటు దాదాపుగా 5.34% ఉంది. ఇలాంటి సమయంలో బడ్జెట్లో కచ్చితంగా అంచనాలు పెట్టడం అనేది సాధ్యంకాదు.
కోవిడ్‌ లాంటి కష్టకాలం అప్పుడు ఉందా?
– కేంద్రం పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటాను గమనిస్తే 2018–19లో రూ.32,781 కోట్లుగా ఉంది. సాధారణంగా కోవిడ్‌లాంటి విపత్తు లేని సందర్భాల్లో ఏటా 10 –15 శాతం పెరుగుతుంది. కాని, 2019–20లో అది రూ. 28,012 కోట్లకు పడిపోయింది. 2020–21 నాటికి రూ.24,460 కోట్లకు పడిపోయింది. 2022–23 నాటికి కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా అంచనా రూ.33,050 కోట్లు చూపిస్తున్నారు. అంటే 2018–19లో వచ్చిన పన్నుల వాటానే 2022–23లో కూడా చూపిస్తున్నారు. దాదాపుగా నాలుగు సంవత్సరాలపాటు వృద్ధిని కోల్పోయామని ఇక్కడ స్పష్టమవుతోంది.
– సాధారణ పరిస్థితుల్లో 8% వృద్ధి ఉందని అంచనా వేసుకున్నా కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా 2022–23కి సంబంధించి కనీసంగా రూ.44,600 కోట్లు వచ్చేది. ఎంతకష్టకాలమో, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
– వీటికితోడు రాష్ట్ర విభజన పర్యవసానంగా తలెత్తిన సమస్యలు, ఆతర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలో జరిగిన లోప భూయిష్టమైన పరిపాలన, వారసత్వంగా వచ్చి రుణాలు, చెల్లింపులు మరొక కారణం.
బాబుగారి హయాంలో ఏటా పెరిగిన అప్పులు 17శాతం అయితే
ఇప్పుడు 14శాతం కాదా?
– రాష్ట్రం విభజించే నాటికి రాష్ట్రానికి అప్పులు రూ. 97,213 కోట్లు. పబ్లిక్‌ అక్కౌంట్‌తో కలుపుకుని రూ.1,20,556 కోట్లు. టీడీపీ పాలన ఐదేళ్లలో రూ,2,68,225 కోట్లకు అప్పులు చేరాయి. ఆ ఐదేళ్లలో సగటున ప్రతి ఏడాదికి 17శాతం మేర అప్పులు పెరుగుకుంటూ వచ్చాయి. అంతేకాదు చెల్లించకుండా వదిలిపెట్టిన బకాయిలు రూ.39వేల కోట్లు ఉన్నాయి.
– రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో తెచ్చిన అప్పులు దాదాపుగా రూ.14,028 కోట్లు ఉన్నాయి. అదికాస్తా గత ప్రభుత్వం హయాంలో రూ.58వేల కోట్లకు వెళ్లింది. అన్నికంటే.. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. 2019 ఎన్నికలకు ఒక రోజు ముందు.. ఏప్రిల్‌ 9న ఒకరోజులోనే ఆర్బీఐలోనే రూ.5వేల కోట్లు అప్పులు చేసింది. ఒకరోజులో ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసిన రాష్ట్రం ఇటీవలి కాలంలో ఎక్కడా లేదు.
కాని ఇవాళ పత్రిల్లో కథనాలు జూన్, జులై, ఆగస్టుల్లో అప్పులు చేసినా సంవత్సరానికి ఇచ్చిన రుణ పరిమితిలో మొత్తం అంతా ఇప్పుడే చేసేస్తున్నట్టుగా రాస్తున్నారు. మరి ఆరోజు ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదట్లోనే ఒకే రోజులో రూ.5వేల కోట్లు అప్పులు చేశారు.
ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు, కార్పొరేషన్ల రూపేణా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు, అలాగే విద్యుత్‌ రంగంలో చేసిన అప్పులు ఇవన్నీ కలుపుకుంటే.. రూ.4 నుంచి రూ.4.2లక్షల కోట్ల వరకూ ఉంది. రీపేమెంట్‌ను పక్కనపెడితే సర్వీసు ఖర్చులే రూ.30వేల నుంచి రూ.32వేల కోట్ల వరకూ ఉంటుంది. ఆనాటి ప్రభుత్వం సృష్టించిన ఇలాంటి పరిస్థితులను కూడా ఈప్రభుత్వం ఇప్పుడు ఎదుర్కొంటోంది.
ఇందులో చాలా బకాయిలను ఈ ప్రభుత్వం తీర్చింది కూడా.
చంద్రబాబు హయాంలో అప్పులు భారాన్ని ఈ ప్రభుత్వం భరించడంలేదా?
బకాయిలను తీర్చలేదా?
విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకోసం ఖర్చు చేయలేదా?
ముఖ్యమంత్రిగారి కార్యదక్షత, సంకల్పంతో అన్ని కార్యక్రమాలూ ముందుకు సాగడంలేదా?
ఈ ప్రభుత్వం చెల్లించిన కొన్ని ముఖ్యమైన బకాయిలను చూస్తే
– ఫీజు రియింబ్స్‌ మెంట్‌కు సంబంధించి 2016 నుంచి 2019 వరకూ మూడు ఆర్థిక సంవత్సరాల్లో పెట్టిన బకాయిలు రూ.1880 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది.
– ఆరోగ్య శ్రీకి సంబంధించిన బకాయిలు రూ.686 కోట్లు చెల్లించింది.
– రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ బకాయిలు రూ.1100 కోట్లు చెల్లించింది.
– ఉపా«ధిహామీకి సంబంధించిన బకాయిలు రూ.1500 కోట్లును ఈ ప్రభుత్వం చెల్లించింది.
– ఇవికాకుండా సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ కొంత అప్పు చేసి, ఆ అప్పుడు మళ్లీ పబ్లిక్‌ అక్కౌంట్లో పెట్టి గత ప్రభుత్వం వాటిని దారిమళ్లించింది. దీనికి సంబంధించి దాదాపు రూ.960 కోట్లను ఈ ప్రభుత్వమే చెల్లించింది.
– ఇలాంటి క్లిష్టపరిస్థితులు ఎన్నింటినో ఈప్రభుత్వం ఎదుర్కొంది.
– గర్వంగా చెప్పదలచుకున్న విషయం ఏంటంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ గారి కార్యదక్షత, సంకల్ప బలంతోటి ఈ రెండున్నరేళ్లకాలంలో రూ.1.27లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో అవినీతి లేకుండా, వివక్ష లేకుండా ప్రజల్లో పెట్టగలిగాం. దీన్ని సగర్వంగా చెప్పగలం.
– మహిళా సాధికారిత, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో చక్కటి పురోగతి సీఎంగారు చేపట్టిన కార్యక్రమాల వల్ల చూస్తున్నాం.
– వైయస్సార్‌ ఆసరా, చేయూతలను అర్హులైన మహిళల చేతుల్లోనే పెట్టాం. దీనివల్ల ఆయా కుటుంబాల్లో పేదరికం తగ్గుతోంది. వారిపై రుణభారం తగ్గుతోంది. ఆర్థికంగా వారికి భరోసా ఉంటోంది.
– స్వయం సహాయక సంఘాలు పరిస్థితి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక సూచికలా పరిగణించవచ్చు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయితే దీన్ని పట్టించుకోలేదు, నెరవెర్చలేదు. దీనివల్ల దాదాపు 23 శాతం డ్వాక్రా సంఘాల అక్కౌంట్లు ఓవర్‌ డ్యూ అయ్యాయి. మరో 11 శాతం అక్కౌంట్లు ఎన్‌పీఏలుగా మారిపోయాయి. వాటి రేటింగ్స్‌కూడా పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన డ్వాక్రా అక్కౌంట్లనే తీసుకుంటే 17శాతం ఎన్‌పీఏలుగా మారిపోయాయి. డ్వాక్రా అప్పులు రూ. 14వేల కోట్ల నుంచి రూ.27వేల కోట్లకుపైగా పెరిగిపోయాయి.
– ఈ ప్రభుత్వం వచ్చాక డ్వాక్రా మహిళలపై ఉన్న రుణభారాన్ని తగ్గించింది. వైయస్సార్‌ చేయూత, ఆసరా పథకాల ద్వారా వారిలో సుస్థిర జీవనోపాధికి ఈ ప్రభుత్వం మార్గం వేసింది. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఈ రెండు పథకాలు కాపాడాయి.
– ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యారంగంపై పెట్టుబడులు పెడితే.. అది మంచి ఫలితాలను ఇస్తుంది. టీడీపీ హయాంలో జీఈఆర్‌ రేటు 1 నుంచి 9 వ తరగతి వరకూ తీసుకుంటే.. దేశవ్యాప్తంగా 99శాతం ఉంటే. మన రాష్ట్రంలో 84.48శాతం ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.
– పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను బాగా మెరుగుపరచడం, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను పెట్టడం, మంచి బోధనను అందించడం లాంటి సమస్యలను ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. నాడు – నేడు ద్వారా 10 రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 15వేల స్కూళ్లలో మొదటివిడతలో ఈ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు రెండో విడతను కూడా ప్రారంభిస్తోంది.
– పిల్లలను స్కూళ్లకు పంపించేలా తల్లులను ప్రోత్సహించడం కూడా మరోకీలక అంశం. జగనన్న అమ్మ ఒడిద్వారా ప్రతి ఏటా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ ఆర్థికంగా రూ.15వేల ప్రోత్సాహకాన్ని ఇస్తున్నారు.
– జగనన్న విద్యాకానుక ద్వారా పిల్లలకు కావాల్సిన యూనిఫారమ్స్, పుస్తకాలు అన్నీకూడా స్కూళ్లో చేరిన మొదటి రోజునే అందిస్తున్నారు.
– గతంలో టీడీపీ హయాంలో చూస్తే స్కూళ్లు ప్రారంభించిన 6 నెలల వరకూ పుస్తకాలు ఇవ్వని పరిస్థితి.
– అలాగే ఆరోగ్య రంగం మీద ఎంత పెట్టుబడి పెట్టినా కూడా అదిచాలా ముఖ్యమైన ఖర్చు అవుతుంది. ప్రజారోగ్య వ్యవస్థలో లోపాలు ఏంటో కోవిడ్‌ సమయంలో మనకళ్లతో మనం చూశాం.
– నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను బాగు చేస్తున్నాం. విలేజ్, వార్డు క్లినిక్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 16 మెడికల్‌కాలేజీలను కొత్తగా నిర్మిస్తున్నాం.
– ఆరోగ్య శ్రీ పరిధిని పెంచాం. వేయికిపైగా చికిత్సలు పెంచి 2,446 చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి తీసుకువచ్చాం.
– ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు 1100 ఉంటే దాన్ని 1900కు పెంచాం.
– గత ప్రభుత్వం హయాంలో నెలకు ఆరోగ్య శ్రీ ఖర్చు రూ.110 కోట్లు–115 కోట్లు అయితే, ఈప్రభుత్వం హాయంలో రూ.200 కోట్ల నుంచి రూ.210 కోట్లు అవుతోంది.
– ఆపరేషన్‌ తర్వాత కేర్‌కోసం ఈప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య ఆసరా దాదాపుగా రోజుకు రూ.1 కోటి ఖర్చు అవుతోంది. ఏడాదికి రూ.365 కోట్లు ఖర్చు అవుతోంది. ఆరోగ్య ఆసరాలో బిల్లు ఆరోజు ఆరోజు క్లియర్‌ అవుతుండడం మనం గర్వించదగ్గ విషయం.
– నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో దాదాపు 32 లక్షలమందికి అర్హులైన వారికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. మొదటివిడతలో 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి అవకాశాలు కూడా బాగా మెరుగుపడుతున్నాయి,
ముఖ్యమైన వాటికి ఆటోడెబిట్‌ చెల్లింపులు జరగడం లేదా?
– ఏదైనా బిల్లు చెల్లించాలంటే ప్రభుత్వం బాగా ఆలస్యం చేస్తోందని ఇటీవల పత్రికల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. బిల్లులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై నిందలు కూడా వేస్తున్నారు.
– 3 లక్షలమంది కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఇతరత్రా సిబ్బందికి అటో డెబిట్‌పద్ధతుల్లో ఎలాంటి జాప్యం లేకండా వారికి ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నాం.
– గోరుముద్ద, సంపూర్ణ పోషణ బిల్లులను కూడా ఆటో డెబిట్‌ పద్దతుల్లోనే చెల్లిస్తున్నాం.
– వృద్ధాప్యం ఫించన్లు గతంలో కేవలం 90శాతం మాత్రమే పంపిణీ అయ్యేవి. ఇప్పుడు 61 లక్షలకుపైగా పెన్షన్లు.. ప్రతి నెలా ఎలాంటి జాప్యం లేకుండా వారి చేతికి అందుతున్నాయి. 2017–18లో పెన్షన్లు కోసం ఖర్చు చేసింది రూ.5,470 కోట్లు అయితే, ఈ ప్రభుత్వం 2020–21లోనే రూ.17,669 కోట్లు ఖర్చు చేసింది.
ఇవన్నీకూడా ఎలాంటి జాప్యాలు లేకుండా, కచ్చితమైన ప్రణాళికతో ఈప్రభుత్వం వీటిని అమలు చేస్తోంది.
– నిన్ననే ఒక పత్రికలో చూశాం. ఆర్వోబీ బ్రిడ్జిలను పూర్తిచేయడానికి కూడా రుణ సంస్థల దగ్గరకు వెళ్తున్నారని ఒకరకమైన ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిడ్జిలు కట్టడం అన్నది క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌. క్యాపిటల్‌ అన్వెస్ట్‌మెంట్‌కోసం డబ్బులు తెచ్చుకోవడం అన్నది సహజం, దేశానికి సంబంధించి మౌలిక సదుపాయాలు ఎలాఉన్నాయో తెలుసుకోవాలంటే జాతీయ రహదారులను చూస్తే అర్థం అవుతుంది.
– జాతీయ రహదారులను ఎన్‌హెచ్‌ఏ నిర్మిస్తోంది. దాదాపు రూ.3.20లక్షల కోట్లు అప్పు ఎన్‌హెచ్‌ఏకు ఉంది. ఎన్‌హెచ్‌ఏ అప్పులు చేస్తోంది కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనే సంకేతం ఇవ్వగలుగుతామా?
– టీడీపీ హయాంలో, అంతకుముందు హయాంలో ప్రకటించిన ఆర్వోబీలకు దాదాపు రూ.530 కోట్లు కావాల్సి వస్తే ఖర్చు చేసింది అక్షరాల రూ.81,33 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
– ఆర్వోబీలను కట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే.. ఇంత తక్కువ మొత్తాన్ని ఎందుకు ఖర్చు చేశారు.
ఎంతకావాలంటే అంత అప్పులు కుదురుతాయా?
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు పాటించడం లేదా?
– ఇక రాష్ట్రం అప్పులు సంగతికి వస్తే.. అప్పలు అన్నవి ఎంత కావాలంటే అంత? ఎంత ఇష్టమైతే అంత? చేసుకోవడానికి ఆస్కారం లేదు.
– కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితి, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి అప్పులు ఇప్పటి ప్రభుత్వం చేసిన సందర్భం ఎప్పుడూలేదు.
– గత ప్రభుత్వం హయాంలో ఏ ఏడాది తీసుకున్నా నిర్దేశించిన పరిమితిలోబడి అప్పులు తీసుకున్న సందర్భం ఎప్పుడూ లేదు.
2014–15లో జీఎస్‌డీపీలో 3% పరిమితి ఉంటే.. 3.95% అప్పులు చేశారు.
2015–16లో జీఎస్‌డీపీలో 3% పరిమితి ఉంటే.. .3.65% అప్పులు చేశారు.
2016–17లో జీఎస్‌డీపీలో 3% పరిమితి ఉంటే.. .4.52% అప్పులు చేశారు.
2017–18లో జీఎస్‌డీపీలో 3% పరిమితి ఉంటే.. 4.12% అప్పులు చేశారు.
2018–19లో జీఎస్‌డీపీలో 3% పరిమితి ఉంటే.. .4.07% అప్పులు చేశారు.
– ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏమంటుందంటే.. రూ.16,418 కోట్లు ఈప్రభుత్వం సమయంలో రుణపరిమితిని కత్తిరిస్తామని చెప్తోంది. ఇన్ని సమస్యల మధ్య ఇదొక సమస్యగా తయారయ్యింది. ఆర్థిక అంశాల్లో గత ప్రభుత్వం ఇలాంటి పనితీరును పెట్టుకుని ఈ ప్రభుత్వం గురించి మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం?
– కోవిడ్‌ లాంటి పరిస్థితులు కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదాయాలు పడిపోయి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
– టీడీపీ హయాంలో పరిస్థితులను ఒక్కసారి చూస్తే
మార్చి 31, 2014 నాటికి పబ్లిక్‌ అక్కౌంట్‌తో కలుపుకుని రాష్ట్రం అప్పు రూ. 1,20,556 కోట్లు.
మార్చి 31, 2019 నాటికి పబ్లిక్‌ అక్కౌంట్‌తో కలుపుకుని రాష్ట్రం అప్పు రూ.2,68,115 కోట్లు.
ఆ ఐదేళ్ల కాలంలో అప్పుల వృద్ధి (సీఏజీఆర్‌)17.33%
ఈ సమయంలో ఎలాంటి విపత్తులూ, అనుకోని కష్టాలు లేవు.
అదే ఈప్రభుత్వ హయాంలో చూస్తే
– మార్చి 31, 2019 నాటికి పబ్లిక్‌ అక్కౌంట్‌తో కలుపుకుని రాష్ట్రం అప్పు రూ.2,68,115 కోట్లు.
– ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ ఇచ్చిన వివరాలు ప్రకారం మార్చి 31, 2022 నాటికి రాష్ట్రం అప్పు 4,08,172 కోట్లు.
గడచిన మూడేళ్లలో అప్పులు పెరుగుదల 2019–22 మధ్య వృద్ధి (సీఏజీఆర్‌)14.88% మాత్రమే.
– ఇందులో ఇది గత ప్రభుత్వం చేసిన అప్పులు, 2019 ఆర్థిక సంవత్సరం మొదటి పదిరోజుల్లో చేసిన రూ.6వేల కోట్ల అప్పులు ఉన్నాయి.
– కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులు మధ్య ఈ 14.88శాతం అప్పులు పెరిగాయి.
– ఇలాంటి పరిస్థితుల్లో కూడా అత్యంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు సాగుతున్నాం. ఒక క్యాలెండర్‌ పెట్టి.. ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నామో కూడా చెప్తున్నాం.
– టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పులు 9%శాతం కంటే తక్కువగా పెరిగాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పులు 14శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
– స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 కేంద్ర ప్రభుత్వం మొత్తం చేసిన అప్పులు రూ.90లక్షల కోట్లు అయితే, ఈ మూడేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.45 లక్షల కోట్లు. దేశానికి ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయో మనకు అర్థం అవుతోంది.
– రెవిన్యూలు పడిపోయాయి, ముందు ప్రజలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో అధికంగా ఖర్చు చేయాల్సిన నేపథ్యంలో అప్పులు చేయాల్సి వచ్చింది.
– ఆరోజుకూడా మీడియా ఉంది. అదే మీడియా…ఆరోజుల్లో ఎందుకు ఈ అంశాలను ప్రస్తావించలేదు. ఈ గణాంకాలన్నీ ప్రజాబాహుళ్యంలో ఉన్నా.. ఎందుకు మాట్లాడలని అనిపించలేదు. ఇది ఎంతవరకూ న్యాయం? ఇంతటి కష్టకాలంలో కూడా అప్పుల పెరుగుదల 14శాతానికే పరిమితం చేసి ముందుకు వెళ్తున్నా కూడా ఈరకంగా మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాలి.
విద్యుత్‌ రంగాన్ని బాబుగారు కుప్పకూల్చలేదా?
ఇప్పుడు తీసుకుంటున్న చర్యలతో పరిస్థితులు మెరుగుపడ్డంలేదా?
– ఇక విద్యుత్‌ రంగం విషయానికొస్తే.. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తానొక విజనరీ అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు.
– ఆరోజుల్లో విద్యుత్‌ రంగాన్ని చూస్తే.. విద్యుత్‌పరంగా దేశం మిగులు సాధించింది.
– మార్చి, 2014 నాటికి దేశంలో పీక్‌ డిమాండ్‌ 1.35 లక్షల మెగావాట్లు ఉంది. కాని జనరేషన్‌ కెపాసిటీ 2.43 లక్షల మెగావాట్లు ఉంది. విద్యత్తు పరంగా దేశంలో ఎలాంటి కొరతా లేదు.
– ఏపీలో అప్పుడు మన డిమాండ్‌ 54,225 మిలియన్‌ యూనిట్లు. అందుబాటులో ఉన్న విద్యుత్తు 54, 867 మిలియన్‌ యూనిట్లు. అంటే అప్పుడు విద్యుత్తు కొరత ఏమీ లేదని స్పష్టం అవుతోంది.
– ఇలాంటి సమయంలో పీపీఏలు చేసుకునేటప్పుడు దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యరాకుండా చేసుకోవాలి. పరుగెత్తిమరీ పీపీఏలు చేసుకోవాల్సిన అవసరంలేదు. మనకు కరెంటు దొరకదు అన్న చందాన పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా సోలార్, విండ్‌ ఎనర్జీకి సంబంధించి 8వేల మెగావాట్లకు పీపీఏలు చేసుకున్నారు. యూనిట్‌ ఖరీదు రూ.4.84 నుంచి రూ.7 ల వరకూ పెట్టి ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
–భవిష్యత్తులో సోలార్‌ఎనర్జీ రేటు గణనీయంగా తగ్గుతుందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఎలాంటి అవసరం లేకుండా ఈ పీపీఏలను ఎందుకు కుదర్చుకున్నారో… అందరూ ఆలోచించాల్సిన విషయం.
– ఈ ఒప్పందాల వల్ల రోజుకు 4 కోట్ల యూనిట్ల ఖరీదైన విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాం.
– యూనిట్‌పై నష్టం రూ.2లు వేసుకున్నా కూడా రోజుకు రూ.8 కోట్లు నష్టపోతున్నాం. సుమారుగా ఏడాదికి రూ.3 వేలకోట్లు నష్టపోతున్నాం. 25 సంవత్సరాలకు ఇది ఎన్నివేల కోట్లు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
– విభజన జరిగే నాటికి నాలుగు విద్యుత్‌ సంస్థల అప్పులు
రూ.33,587 కోట్లు అయితే, 2014–19 నాటి టీడీపీ ప్రభుత్వం పాలన పూర్తయ్యే నాటికి రూ.70,254 కోట్లు అయిపోయింది. ఇవికాకుండా విద్యుత్‌ ఉత్పత్తిచేసిన సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్రం విభజన నాటికి రూ. 2,893 కోట్లు అయితే, ఐదేళ్ల టీడీపీ పాలన పూర్తయ్యే నాటికి రూ.21,540 కోట్లకు చేరుకున్నాయి. ఈరెండు భారాలను కలుపుకుంటే.. దాదాపు రూ.93వేలకోట్ల అప్పులకు చేరాయి.
విద్యుత్‌రంగం నికర విలువ చూసుకుటటే… అప్పులు పోను రాష్ట్ర విభజన నాటికి నెగెటివ్‌గా రూ. – 4,315 కోట్లు ఉంది. అది ఐదేళ్ల నాటికి రూ. – 19,926 కోట్లు చేరింది. అదీ విద్యుత్‌ రంగం ఎంతటి అథమ స్థితికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 5 రెట్లు నెగెటివ్‌లోకి వెళ్లిపోయింది.
– అదే ఈ ప్రభుత్వం మొన్ననే కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో రూ.2.49లకు యూనిట్‌ చొప్పున ఒప్పందం చేసుకుంది. అదే గత ప్రభుత్వం కుదర్చుకున్న ఒప్పందాల వల్ల సగటున కొనుగోలు ఖర్చు యూనిట్‌కు రూ.5.10 లు ఉంది. అంటే సగానికే ఈప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనివల్ల ఏడాదికి రూ.3750 కోట్ల మేలు జరుగుతుంది. గత ప్రభుత్వంలో యూనిట్‌ కరెంటు రూ.3.5లకే అందుబాటులోకి వస్తే రూ.6లకు పీపీఏలు కుదుర్చుకున్నారు.
– రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యుత్‌ రంగంలో క్రమేణా సత్ఫలితాలు వస్తున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్‌ స్థిరంగా దీర్ఘకాలంగా అందాలనే ఉద్దేశంతో, విద్యుత్‌రంగ సంస్థలపై భారం పడకుండా… సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
– ఉచిత విద్యుత్‌ కోసం ఇతరత్రా కరెంటు సబ్సిడీలను గత ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలకు చెల్లించకపోవడంతో అప్పులు ఇంత దారుణంగా పెరిగిపోయాయి. ఆ ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.13,255 కోట్లు అయితే, ఈ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ల కాలంలోనే రూ.21,497 కోట్లు చెల్లించింది.
ఏపీఎస్‌డీసీ రాజ్యాంగ విరుద్ధమా?
ఎన్‌హెచ్‌ఏకు అప్పులు అలాంటి మార్గంలోనే రావడంలేదా?
– ఏపీఎస్‌డీసీ వ్యవహారంపై కూడా కొన్నినెలలుగా జరుగుతున్న ప్రచారాన్ని చూస్తున్నాం. ప్రజల్లో అపోహలు సృష్టించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీఎస్‌డీసీ చేస్తున్న అప్పు రాజ్యాంగ విరుద్ధమని ఇవాళ ఈనాడులో కథనం వేశారు. ఏపీ ప్రభుత్వంతో లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరికలు జారీచేసినట్టుగా ఈ కథనలో రాశారు.
– ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అన్నది న్యూ మోడల్‌తో తీసుకు వచ్చాం. టీడీపీ హయాంలో కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పు రూ.14 వేల కోట్ల నుంచి రూ.58వేల కోట్లకు పెరిగింది. రైతు సాధికారిత సంఘం పేరిట అప్పులు కూడా చేశారు. కాని ఆ అప్పులు తీర్చడానికి సదకు సంస్థకు వనరులు ఎలా సమకూరుతాయనే విషయాన్ని ఆ ప్రభుత్వం చూపించలేదు. కేవలం ప్రభుత్వం పూచీకత్తు ఆధారంగా ఇన్నివేలకోట్ల అప్పులు కూడా చేశారు.
– ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా కొన్ని కార్యక్రమాలను అమలు చేయడానికి పెట్టాం. ప్రత్యేకంగా ట్యాక్సును లెవీచేసి, దీనిద్వారా వచ్చే డబ్బును కార్పొరేషన్‌ ఉద్దేశాలను నెరవేర్చడానికి మాత్రమే వినియోగిస్తామన్న కోణంలో ఈ కార్పొరేషన్‌ పెట్టడం జరిగింది.
– ఎస్‌డీసీ కార్పొరేషన్‌కు కొన్ని బ్యాంకులు కూడా రుణాలు మంజూరుచేశాయి. మంజూరు చేసిన బ్యాంకుల బోర్డుల్లో ఆర్బీఐ ప్రతినిధులు కూడా ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతినిధులు కూడా ఆ బోర్డుల్లో ఉన్నారు. అత్యత్తమ రేటింగ్‌ ఏజెన్సీల్లో ఒకటైన ఫిచ్‌ అనే సంస్థకూడా ‘ఎఎ’ రేటింగ్‌ ఇచ్చింది. చాలా తక్కువ సంస్థలకు ఇలాంటి రేటింగ్స్‌ వస్తాయి.
– ఎన్‌హెచ్‌ఏలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి మోడల్‌నే అనుసరిస్తున్నారు. పెట్రోలు మీద వేసే సెస్సును, ప్రభుత్వం కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లోకి వెళ్లి, తర్వాత ఎన్‌హెచ్‌ఏకి వెళ్తోంది. దీన్ని చూపించుకుని ఎన్‌హెచ్‌ఏ అప్పులు తీసుకుంటోంది.
– ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఎస్‌డీసీని రాజ్యాంగ విరుద్ధమని అంటూ ప్రచారం చేస్తున్నారు. కాని ఇది వాస్తవ విరుద్ధం. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా ఎస్‌డీసీకి రాజ్యాంగ బద్ధత ఉందని స్పష్టమైన అభిప్రాయం చెప్పారు. రాజ్యాంగంలోని 293,266 అధికరణాలను ఉల్లంఘించడంలేదని విస్పష్టంగా చెప్పారు.
– చాలా రాష్ట్రాల్లో ఇలాంటి విధానాన్ని అనుసరించారు. అప్పులు తీసుకోవడమే కాదు, వాటిని ఎలా తీరుస్తారనే విషయాన్ని ఈ విధానంలో స్పష్టంగా చెప్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు. పారదర్శకంగా ఉంటుంది. ఇది అర్థంకాక చాలా మంది ప్రతిపక్షానికి చెందిన వ్యక్తులు తలోరకంగా మాట్లాడుతున్నారు.
– ఎస్‌డీసీకి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ ఇచ్చిన వివరణతో కేంద్ర ఆర్థికశాఖ కూడా సంతృప్తి వ్యక్తంచేసింది. గతేదాడి జులైలో కేంద్ర ఆర్థికశాఖ ఆడిగితే ఆతర్వాత వివరణ ఇస్తే.., వివరణ ఇచ్చాక రుణాలు మంజూరు అయితే, ఇప్పుడు మళ్లీ ఆ వార్త రావడం ఆశ్చర్యకరం. సంబంధిత పత్రిక తన కథనంలో పేర్కొన్న విషయాలు కూడా వాస్తవ విరుద్ధం.
తాత్కాలిక రుణ సదుపాయాలపైనా విషప్రచారమా?
తక్కువ వడ్డీకి రుణాలు వస్తే తీసుకోవడం నేరమా?
– ఎస్‌డీఎఫ్, డబ్ల్యూఎంఏ, ఓడీ సదుపాయల మీద కూడా పత్రికలు పలురకాలుగా కథనాలు రాస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలు రాకముందు కేంద్రం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని బాండ్లను విడుదల చేసేవి. ఆర్బీఐ ఆ బాండ్లను నేరుగా కొనుక్కునేంది. తద్వారా కొత్త నోట్లు ప్రింట్‌ అయ్యేవి, డబ్బు ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేది. మనీ సప్లై పెరిగేది. 2005 తర్వాత ఆర్బీఐ కేంద్రం నుంచి కాని, రాష్ట్రాల నుంచి కాని బాండ్లను కొనుగోలు చేయకూడదని చెప్తూ తాత్కాలికంగా రుణ సదుపాయాన్ని మాత్రమే కల్పిస్తూ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంచేశారు.
– ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో పేర్కొన్నట్టుగా స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ, వేస్‌ అండ్‌మీన్స్, ఓవర్‌ డ్రాఫ్ట్‌ ద్వారా తాత్కాలిక రుణ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా డబ్బు తీసుకోవడం ద్వారా చాలా తక్కువగా వడ్డీ పడుతుంది. రెపీ 4శాతం ఉంటే ఎస్డీఎఫ్‌ ద్వారా 3 శాతానికే రుణం వస్తుంది. డబ్ల్యూఎంఏ ద్వారా తీసుకుంటే రెపోరేటుకే అంటే 4శాతానికే రుణం వస్తుంది. పరిమితులకు లోబడి ఓడీ చేస్తే , రెపోకన్నా అధికంగా రెండు శాతం అంటే మొత్తంగా 6శాతానికే రుణం వస్తుంది.
– కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బాండ్‌ 6.87శాతం వద్ద ట్రేడ్‌ అయితే, అలాంటిది ఇక్కడ 6శాతానికే తక్కువ వడ్డీకే తాత్కాలికంగా రుణం వచ్చే అవకాశం కలుగుతోంది.
– ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ తప్పు జరుగుతుందనే సంకేతం ఇవ్వడం ఎంతవరకూ సమంజసం?
– గత ప్రభుత్వం 10.32%కి అప్పులు తెచ్చిందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి. దాన్నొక ఘనతగా కూడా చెప్పుకున్నారు.
– ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ఆర్భాటాలు, అనసవర ప్రచారాలకు పోకుండా తక్కువ వడ్డీరేటుకే అప్పులు తీసుకువచ్చి వాటిని సక్రమ పద్ధతుల్లో ప్రాధాన్యతాంశాలపై వినియోగించడంపై దృష్టిపెట్టింది.
ఆస్తులు అమ్మేయడంకన్నా.. తాకట్టు పెట్టడం ఘోరమా?
– ప్రభుత్వ ఆస్తుల తాకట్టుపైనా కూడా చాలా ప్రచారాలు చేస్తున్నారు. ఏదైనా రుణం తీసుకునేటప్పుడు దానికి సెక్యూరిటీ చూపించడం అన్నది నిబంధన. అది ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే. గత ప్రభుత్వం భూములు తాకట్టుపెట్టి సీఆర్డీకు రుణాలు సమకూర్చుకుంది. తెస్తున్న రుణాలన్నీకూడా ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు. చెల్లింపులు అన్నవి ఎప్పటికీ విఫలం కావు. ఈ తాకట్టులపై ఎందుకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారో అర్థంకావడంలేదు. చాలారాష్ట్రాలైతే ఆయా చోట్ల భూములను అమ్మేసి మానిటైజ్‌ చేసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కోకోపేట లాంటి చోట్ల భూములు అమ్మి దాదాపు రూ.2700 కోట్లు సమీకరించింది. కేంద్ర ప్రభుత్వమైతే పెట్టుబడుల ఉపంసహరణకోసం ఏకంగా ఒక డిపార్ట్‌మెంట్‌నే పెట్టారు. ప్రతిష్టాత్మకమైన ఎల్‌ఐసీ లాంటి సంస్థలో కూడా పెట్టుబడుల ఉపసంహరణ చేయాలనే ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారు. రకరకాల ఆస్తులను ప్రైవైటేజేషన్‌ చేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ అంటే.. ఆస్తులను అమ్మడమే. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2021–22లో రూ.78వేల కోట్లు పెట్టుబడుల ఉపంసహరణ ద్వారా వస్తున్నట్టు కేంద్రం బడ్జెట్‌లో అంచనాలు పెట్టింది. అలాగే 2022–23లో రూ.65వేల కోట్లు వస్తాయని అంచనావేశారు. అలాంటిది మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆస్తుల అమ్మకాలు జరగలేదు. కేవలం తాకట్టు మాత్రమే పెట్టారు. ఆ రుణాలకు ప్రభుత్వం కూడా గ్యారెంటీ ఉంది. ఇవన్నీకూడా ప్రజలు గమనించాలి.
– దేశంలో ప్రతి రాష్ట్రంకూడా ఆర్బీఐ ఫ్లాట్‌ ఫాం మీద, ప్రతి మంగళవారం బాండ్స్‌ను ఇష్యూ చేస్తారు. స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్స్‌ పేరిట బాండ్స్‌ను వేలం వేస్తారు. ఎవరైతే తక్కువకు ఈల్డ్‌చేస్తారో వారికి బాండ్స్‌ అలాట్‌ అవుతాయి. దీనిపై కూడా వివిధ కథనాలు రాస్తున్నారు. ప్రచారాలు చేస్తున్నారు. ఏపీ ఎక్కువ రేటుకి బాండ్స్‌ ఇష్యూ చేస్తోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్బీఐ ఫ్లాట్‌ఫాం మీద కొన్ని రాష్ట్రాలు ఎక్కవు వ్యవధికి, కొన్ని రాష్ట్రాలు తక్కువ వ్యవధికి బాండ్లను విడుదలచేస్తాయి. దీర్ఘకాలానికి ఇష్యూ చేయడం వల్ల తక్కువ రేటుపడుతుందనే రాష్ట్రం టెన్యూర్‌ ఎక్కువ ఉన్న కాలానికి బాండ్లను ఇష్యూ చేస్తుంది. నవంబర్‌ 30న కర్ణాటక 10 ఏళ్ల కాలానికి ఉస్‌డీఎల్‌ 6,83% వడ్డీకి ఇష్యూ చేసింది. అదే రోజున రాజస్థాన్‌ 5 ఏళ్లకాలానికి ఎస్‌డీఎల్‌ 6.07% వడ్డీకి ఇష్యూ చేసింది. మన రాష్ట్రంలో వచ్చిన పత్రికల్లో కథనం ప్రకారం ఇక్కడ కర్ణాటక కన్నా.. రాజస్థాన్‌ ఆర్థికంగా మంచి పనితీరును చూపిస్తోందని చెప్పగలమా?
– నిజానికి ఈప్రభుత్వం చేసిన అప్పులు అన్నీకూడా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఖర్చు చేస్తున్నారు. కష్టకాలంలో ప్రజలకు మంచి విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇవన్నీ అందడానికి ఇంత ఖర్చు చేస్తున్నారంటే ఇది గర్వించదగ్గ విషయం.
– ప్రభుత్వం ఏచేసినా సరే అది తప్పుగా చూపించడం పరిపాటిగామారింది.
– నిష్పక్షపాతంగా ఈ విషయాలను ప్రజల ముందు ఉంచుతారని విశ్వసిస్తున్నాం.
 
 
Tags: Chief Minister’s Special Secretary Duvvuri Krishna Media Conference

Natyam ad