Compassionate

కరుణించిన వరుణుడు

 Date:18/08/2018
కామారెడ్డి ముచ్చట్లు:
సకాలంలో వర్షాలులేక రైతులు సతమతమవుతున్నారు. ఈ తరుణంలో వారంరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మొత్తానికి ఆలస్యంగానైనా వరుణుడు కరుణించడంతో రైతులకు ఊరట లభించింది. అయితే భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో నీట మునిగిన దుస్థితి. కామారెడ్డి జిల్లాలోనూ ఈ పరిస్థితి ఉంది. ఏదేమైనా వానలు కురుస్తుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
కరవు ఛాయలు కమ్ముకొన్న వేళ వరుణుడు కరుణించాడని అంటున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం పంటలకు జీవం పోసినట్టైందని చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుండడం మంచిదే అని ఈ వానలకు నీటి వనరులు వృద్ధి చెందడంతో పాటూ భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇదిలాఉంటే కామారెడ్డి అంతటా విస్తారంగానే వానలు పడుతున్నాయి.
ఇప్పటికే 27.1మి.మీ వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు చెప్తున్నారు. దీంతో స్థానికంగా నీటి వనరులు పెరిగే అవకాశం ఉంటుందని అంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోనూ వర్షపాతం ఆశాజనంగానే ఉంది.
ఇక్కడ సగటు వర్షపాతం 27.2 మి.మీ.గా నమోదైంది. వానలు విస్తారంగా కురుస్తుండడంతో వాగులు, జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువులు, బావులు, కుంటలు సైతం నిండడంతో రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. వాస్తవానికి ఖరీఫ్‌ సీజన్ ప్రారంభంలో మురిపించిన వానలు ఆతర్వాత ముఖం చాటేశాయి.
ఎండలు పెరగడంతో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు భూగర్భజల మట్టం పడిపోయి బోరుబావుల్లో నీటి జాడలు క్షీణించాయి. దీంతో పంటలు వాడిపోయాయి.  ఇటీవలిగా వరుసగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలకు కొండంత ఊరట లభించినట్లైంది. సాగునీరు సమృద్ధిగా లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్న రైతులను వానలు ఆదుకున్నాయనే చెప్పాలి.
ముసురు వాతావరణం కొనసాగుతుండడంతో వాడిపోతున్న పంటలు తెప్పరిల్లాయి. ఇక బోరుబావుల దగ్గర ఉన్న వరితో పాటు మొక్కజొన్న, సోయా, పత్తి, పప్పు దినుసుల పంటలకు ప్రస్తుత వానలు మేలే చేశాయి. ఇదిలాఉంటే వానల ఎఫెక్ట్ కు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, బావులు నిండాయి. వాగుల్లో వరద ఉధృతి పెరిగింది. గాంధారి వాగు ఉరకలెత్తుతోంది.
లింగంపేట మండలంలోని పెద్దవాగుకూ నీరు భారీగా చేరింది. పోచారం ప్రాజెక్టు సైతం నీటితో కళకళలాడుతోంది. తుక్కోజీవాడి వాగు కూడా వర్షపు నీటితో నిండుగా ఉంది. కళ్యాణి ప్రాజెక్టులోనూ భారీగా జలాలు వచ్చి చేరాయి. ఇక నిజాంసాగర్‌ మండలం షేరకపల్లి వాగు ప్రవాహం పెరిగింది. సింగీతం ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
మొత్తంగా వానలకు జిల్లాలో నీటి వనరులు మెరుగుపడ్డాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుందో వేచి చూడాలి. ఎందుకంటే జూన్, జులై మొదటి వారాల్లోనూ ఇలాగే వానలు కురిశాయి. నీటి మట్టాలు పెరిగాయి. అయితే కొన్నిరోజులకే సాగునీటికి సమస్యలు ఎదురయ్యాయి.
అందుకే వర్షపునీటిని ఒడిసిపట్టి భూమిలోనే ఇంకిపోయేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాననీటిని భూమిలోనే ఇంకిపోయేలా చేయడం ద్వారా భూగర్భ జలమట్టాలను పెంచుకోవచ్చని నీటి కొరతను కొంతమేర అధిగమించవచ్చని అంటున్నారు.
Tags:Compassionate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *