కనెక్షన్ కష్టాలు

Date:13/02/2018
నల్గొండ ముచ్చట్లు:
నల్గొండ జిల్లాలో దీపం పథకం అమలు పూర్తిస్థాయిలో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ పథకం ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ప్రకియ జాప్యమవుతోంది. లబ్ధిదారులను గుర్తించే బాధ్యతలను తహసీల్దార్‌లకు ఇచ్చింది సర్కార్. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల్లోనే భూ సర్వే చేపట్టడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో దీపం కనెక్షన్లు అందించే పని వాయిదా పడింది. అధికారులు మాత్రం దరఖాస్తులు తీసుకోవాలని గ్యాస్‌ ఏజెన్సీల నిర్వహకులకు చెప్తున్నారు. అధికారయంత్రాంగం సూచనల మేరకు ఏజెన్సీలు దరఖాస్తులు తీసుకుంటున్నాయి. అయితే వీటిని ఆన్‌లైన్‌ చేసే పని తహసీల్దార్‌ కార్యాలయంలో జరగాలి. వారు భూ సర్వే వివరాలు నమోదులో తలమునకై ఉండటంతో ఈ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. దీంతో లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీపం పథకానికి ఆది నుంచి అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయని గ్యాస్ కనెక్షన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నామని వాపోతున్నారు.లబ్ధిదారుల ఆవేదనలోనూ కొంత వాస్తవం ఉంది. దీపం పథకం ప్రకటించగానే రాజకీయ జోక్యం తెరపైకి వచ్చింది. నిజమైన లబ్ధిదారులకు కాకుండా రాజకీయ అండదండలు ఉన్నవారికే కనెక్షన్లు మంజూరు అయినట్లు తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా గత సార్వత్రిక ఎన్నికల ముందు హడావుడిగా లబ్ధిదారులను ఎంపిక చేసినా రాజకీయ జోక్యంతో అసలు కనెక్షన్లు మంజూరు చేయలేకపోయారట. ఆ తరువాత మంజూరు చేసిన 60 వేల కనెక్షన్లలో 37,516 పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకంలో అవకతవకలు చోటులేకుండా మరింత పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో అప్పటి వరకు ఎంపీడీవోల ద్వారా అమలైన లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను తహసీల్దార్‌లకు అప్పగించింది ప్రభుత్వం. దరఖాస్తులను స్వీకరించి కోటా ప్రకారం కాకుండా అర్హులందరికీ దీపం కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో త్వరలోనే గ్యాస్ కనెక్షన్లు అందుతాయని లబ్ధిదారులు భావించారు. కానీ వివిధ దశల్లో అధికార యంత్రాంగానికి అనేక పనులు వచ్చిపడుతున్నాయి. దీంతో దీపం పథకం లక్ష్యం పూర్తికావడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి త్వరితగతిన గ్యాస్ కనెక్షన్లు అందజేయాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags: Connection difficulties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *