వివేక హంతకులపై కుట్ర..?

కడప ముచ్చట్లు:
 
కడపలోని కేంద్ర కారాగారంలో ఊహించరాని సంఘటన ఏదైనా జరగబోతోందా? గతంలో అనంతపురం జిల్లా జైలులో జరిగిన మాదిరిగానే కడప సెంట్రల్ జైలు కూడా మరో సంచలనానికి వేదికగా మారబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కడప సెంట్రల్ జైలు ఇన్ ఛార్జి సూపరింటెండెంట్ గా పోచా వరుణారెడ్డి బాధ్యతలు చేపట్టడమే ఈ అనుమానాలకు అవకాశం ఇస్తోందని అంటున్నారు. గతంలో టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను అనంత‌ జిల్లా జైలులో ఉన్నప్పుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో అదే జైలులో ఇన్ చార్జి సూపరింటెండెంట్‌గా పోచా వరుణారెడ్డి ఉన్నారు. అదే వరుణారెడ్డిని ఇప్పుడు కడప సెంట్రల్ జైలుకు ఇన్ చార్జి సూపరింటెండెంట్ గా వైసీపీ సర్కార్ నియమించడంతో అనుమానం రాజుకుంటోంది.పోచా శ్రీనివాసరెడ్డి కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జి సూపరింటెండెంట్ గా ఉంటే ఏదో అనూహ్య సంఘటన ఎందుకు జరుగుతుందనే సందేహం రావచ్చు. ఏపీ సీఎం జగన్ రెడ్డి బాబాయ్, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఇప్పుడు కడప సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారు ఉంటే.. ఏమవుతుందని అనుకోవచ్చు. అనంతపురం జిల్లా జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ గా వరుణారెడ్డి ఉన్నప్పుడు జైలు బ్యారక్ లోనే మొద్దు శీను హత్య జరిగింది. ఆ సమయంలో వరుణారెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. మొద్దు శీను హత్యకు పక్కా ప్లాన్ ప్రకారమే జైలులో ఏర్పాట్లు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
 
 
అలాంటి అనుమానాలు వ్యక్తం చేసిన వారిలో వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా ఉన్నారు. తన తండ్రి హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఆమె కడప నుంచి ఢిల్లీ స్థాయి వరకూ పోరాడుతూనే ఉన్నారు. న్యాయపోరాటమూ చేస్తున్నారు. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి నిందితులుగా సీబీఐ పేర్కొని అరెస్ట్ చేసినప్పటికీ వారి వెనక సొంత ఫ్యామిలీలోని ముఖ్యుల హస్తం కూడా ఉండొచ్చనే ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. వివేకా హత్య కేసులో నిజాలు నిగ్గుతేలి, ప్రధాన సూత్రధారుల బండారాన్ని సీబీఐ త్వరలో బయటపెట్టే అవకాశమూ లేకపోలేదు.ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసులో నిజాలు ఎప్పటికీ బయటికి రాకుండా చేసే కుట్ర ఏదో జరగబోతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ఒక సంచలన హత్య జరిగినప్పుడు ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అనూహ్యంగా హతమైపోతున్న సంఘటలు గతం నుంచీ జరుగుతుండడం ఈ అనుమానాలకు తావిస్తోంది.పరిటాల రవి హత్య కేసు తుది దశకు చేరుకున్న దశలో అప్రూవర్ గా మారుతున్నట్లు మొద్దు శీను అప్పట్లో ప్రకటించాడు. అలా మొద్దు శీను ప్రకటించిన కొద్ది రోజుల్లో అంటే 2008 నవంబర్ 9న హత్యకు గురయ్యాడు. జైలు బ్యారక్ లోనే మొద్దు శీను హత్య జరిగిన తర్వాత పోచా వరుణారెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మొద్దు శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాశ్ అప్పట్లో ఆ జైలులోని సరస్వతి 2 బ్యారక్ లో ఉండేవాడు. ఓం ప్రకాశ్ వద్ద డబ్బు ఉందనే అనుమానంతో సరస్వతి 2 బ్యారక్ ను వరుణారెడ్డి సోదా చేశారు. డబ్బు దొరకలేదు. తర్వాత మొద్దు శీను ఉండే యమునా బ్యారక్ లోకి ఓం ప్రకాశ్ ను మార్చారు.
 
 
 
 
అందుకు మొద్దు శీను అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాతే మొద్దు శీను హత్య జరిగింది. మొద్దు శీను బ్యారక్ లోకి ఓంప్రకాశ్ ను వరుణారెడ్డి ఉద్దేశపూర్వకంగానే మార్చారంటూ పరిటాల రవి హత్య కేసులో మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా జడ్జికి అప్పట్లో లేఖ రాశాడు. పరిటాల రవి హత్య కేసులో తర్వాత నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి కూడా హైదరాబాద్ నడిబొడ్డున బొగ్గులకుంటలో హత్యకు గురైన విషయం ఇక్కడ ప్రస్తావించదగ్గ అంశం.మొద్దు శీను హత్య జరిగిన రోజున అనంతపురం జిల్లా జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్లడం, ఇన్ చార్జి సూపరింటెండెంట్ గా వరుణారెడ్డి వ్యవహరించారు. కడప సెంట్రల్ జైలుకు జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ హోదా ఉన్న అధికారిని నియమించాలి. గత సంవత్సరం ఆగస్టు వరకు అదే స్థాయి ఉన్న రవికిరణ్ సూపరింటెండెంట్ గా ఉన్నారు. ఆయనకో ప్రమోషన్ రావడంతో ఇటీవలి వరకూ అదనపు సూపరింటెండెంట్ గన్యా నాయక్ ఇన్ చార్జిగా కొనసాగారు. తాజాగా అదనపు సూపరింటెండెంట్ హోదా ఉన్న వరుణారెడ్డిని కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జిగా నియమించడంపై పలువురిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు వెలుగు చూడకుండా చేసేందుకు పెద్ద స్థాయిలో ఏదో జరగబోతోందా? అందుకు కడప సెంట్రల్ జైలు వేదిక అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
 
Tags: Conspiracy against sage murderers ..?

Natyam ad