Construction of the Amravati Housing Society

అమరావతి హౌజింగ్‌ సోసైటీ స్థలంలో నిర్మాణాలు

ఏపీలో బహుళ అంతస్థుల నిర్మాణం సాధ్యమేనా?

Date: 03/01/2018

గుంటూరు ముచ్చట్లు:

రాజధాని నిర్మాణంలో ఏపీ సర్కార్‌ వేగంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియ మొదలైంది. అమరావతి హౌజింగ్‌ సొసైటీ స్థలంలో ఆధునిక టెక్నాలజీతో నిర్మాణాలకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు ఐదు లక్షల చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే భూ సేకరణతో ముందుకొచ్చిన ప్రభుత్వం ఈపీసీ టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని సింగపూర్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊదరగొడుతున్నారు. కొత్త రాజధానిలో బహుళ అంతస్తులతో ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తామని తెగేసి చెప్తున్నారు. నవ్యాంధ్రరాజధానిని సింగపూర్‌, మలేషియా తరహాలోనే నిర్మిస్తామని ఢంకా భజాయించి మరీ చెప్తున్నారు. అయితే బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుకూలంగా రాజధాని భూములు ఉన్నాయా అంటే ప్రశ్నార్థకమే అంటున్నారు ఇంజనీరింగ్‌ నిపుణులు. నవ్యాంధ్ర రాజధానిలో ఆకాశ హర్మ్యాలను నిర్మించడం అంత సులువేంకాదని చెప్తున్నారు. సింగపూర్‌ తరహాలో ఏపీలో భారీ అంతస్తులు నిర్మించాలంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న భూములు అనుకూలంగా లేవని ఇంజనీరింగ్‌ నిపుణులు చెప్తున్నారు. దీంతో కొత్త రాజధానిలో ఆకాశ హర్మ్యాలు నిర్మించడం అనుకున్నంత సులువేం కాదంటున్నారు. ఎందుకంటే కృష్ణానదీ చుట్టుపక్కల ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తేమ నేలలు ఎక్కువగా ఉండి, సేద్యానికి అనుకూలంగా ఉన్నాయి. సాధారణంగా రెండు మూడు అంతస్తుల భవనాలు నిర్మించడానికే ఇక్కడి నేలలు అనుకూలంగా ఉండవు. అలాంటప్పుడు 40,50 అంతస్తులు, ఇంకా అంతకంటే ఎక్కువ అంతస్తుల భవనాలను నిర్మించాలంటే భూగర్భంలోకి కనీసం 15 నుంచి 20 అడుగుల వరకు తవ్వాల్సి ఉంటుంది. రాతినేల తగిలిన తర్వాత పునాదులు వేస్తేనే నిర్మాణాలు దృఢంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలను భూ సమీకరణ ద్వారా సేకరిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సింగపూర్‌, జపాన్‌ దేశాల రాజధానుల మాదిరిగా బహుళ అంతస్తులతో ఏపీ రాజధాని నిర్మాణం ఎలా చేపడుతారంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో..తేమనేలలు ఎక్కువగా ఉండటం వల్ల 20 మీటర్ల లోతులో పునాదులు తీస్తే కానీ 40 నుంచి 50 అంతస్తుల భవనాల నిర్మాణం సాధ్యం కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు అంత లోతులో పునాదులు తవ్వి, ఆకాశ హర్మ్యాలను నిర్మించే పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో లేదు. ఇప్పుడున్న ఆర్‌ అండ్‌ బి శాఖ కూడా రోడ్ల మరమ్మత్తులు, మామూలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకే పరిమితమైంది. అంతేతప్ప బహుళ అంతస్తుల భవనాలను నిర్మించే సామర్థ్యం లేదు. ఏది ఏమైనా,.ఇక్కడ ఉన్న భూముల పరిస్థితిని బట్టి బహుళ అంతస్తులను నిర్మించేముందు తగిన జాగ్రత్తలు తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

Tags: Construction of the Amravati Housing Society

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *