జోరందుకున్న నిరంతర నీటి సరఫరా పనులు

Date:13/02/2018
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ సిటీకి నిరంతరంగా తాగునీరు సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటి. ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టును అమలు చేసందుకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ప్రాంతీయంగా మానేరు జలాశయం ఉండటం, నీటి నిల్వ సామర్థ్యం బాగానే ఉండటంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో సైతం ప్రాధాన్యం ఇచ్చారు. నిధుల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికోసం భగీరథ నిధులతో పాటు అమృత్‌ నిధులను వినియోగించుకుంటున్నారు. వీటితో పాటు స్మార్ట్‌సిటీ మిషన్‌ కింద విడుదలయ్యే నిధులను సైతం వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నగర పరిధిలో హైలెవల్‌, లో లెవల్‌ జోన్లుగా విభజించి రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది నవంబరు కల్లా పనులు పూర్తిచేసి నిరంతర నీరు సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు. నీటి సరఫరా నిమిత్తం నగర పరిధిలోని అన్ని డివిజన్‌లలో తాగునీటి పైపులైన్లు వేసే పనులు జోరందుకున్నాయి. అర్బన్‌ మిషన్‌ భగీరథలో భాగంగా శివారు కాలనీలతో పాటు, పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయనున్నారు. కొత్త పైప్ లైన్లకు తరచూ లీకేజీలు అయ్యే వీధులతో పాటూ  పైపులైన్ల సామర్థ్యం లేని, ఇప్పటికీ పైపులైన్లు లేని వీధులను ఎంచుకున్నారు. ఇప్పటివరకు 315 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు ఉన్నాయి. 110 డయా పైపులైను 147 కి.మీ., 150ఎంఎం, 600ఎంఎం డయా 27.55 కి.మీ. మేర పైపులైన్లు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలాఉంటే విద్యుత్తు ఉన్న సమయంలోనే తాగునీరు సరఫరా చేయాలనే విధానానికి స్వస్తి పలకనున్నారు. ఎత్తయిన ప్రదేశంలో రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేయాలనుకుంటున్నారు. రిజర్వాయర్లకు నీటిని పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి నీటిని సరఫరా చేస్తారు. దీనికోసం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శాతవాహన యూనివర్సిటీ గుట్టపై దీన్ని నిర్మిస్తుండటంతో నీటి సమస్యలు దూరమైనట్లేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జనాభాకు తగ్గట్లుగా నీటి నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. భగీరథ కింద చేపడుతున్న తాగునీటి సరఫరా పనుల్లో ఈ నిల్వ కేంద్రాల డిజైన్లు తయారు చేశారు. 2033 సంవత్సరం వరకు 4.03 లక్షల జనాభాకు సరిపడేలా 68.65 ఎంఎల్‌డీల సామర్థ్యంతో పనులు చేస్తున్నారు. నగరానికి నిరంతరాయంగా మంచినీరు అందేలా అధికారులు తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి తాగునీటి కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు.
Tags: Continuous water supply tasks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *