Cool pudding

పంజా విసురుతున్న చలిపులి

-తెలుగు రాష్ట్రాలపై మంచు దుప్పటి

-కనిష్టస్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Date: 14/01/2018

ఆంధ్రప్రదేశ్‌ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. రెండు రాష్ట్రాలనూ మంచుదుప్పటి కమ్మేస్తోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలకు పడిపోతున్నాయి. భారీ ఎత్తున మంచు కురవడం, చలిగాలులు వీస్తుండటంతో ప్రజల పరిస్థితి మంచుగడ్డపై కూర్చున్నట్టుగా మారింది. ముఖ్యంగా గడిచిన నాలుగు రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది. దీంతో ఉదయం 10 గంటల వరకూ ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల స్థాయికి పడిపోయాయి. ఈనెలాఖరు వరకూ పొగమంచు, చలిగాలుల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న తీవ్రమైన చలిగాలుల కారణంగానే ఇక్కడ పరిస్థితి నెలకొందని చెప్పారు. కాగా, అటు విశాఖలో కూడా చలి పంజా విసురుతోంది. మన్యం గ్రామాల్లో చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు చలితో గజగజా వణికిపోతున్నారు. ఇక లంబసింగిలో అయితే మైనస్‌ డిగ్రీల టెంపరేచర్‌ నమోదవుతోంది. రోడ్లన్నీ పొగమంచుతో కప్పుకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చలికి స్వైన్‌ఫ్లూ వంటి వైరస్‌ విజృంభించే ప్రమాదం లేకపోలేదని జనం భయాందోళనకు గురవుతున్నారు. జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉన్నవారు అనుమానంతో ఆసుపత్రులకు పరుగుపెడుతున్నారు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, అప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్‌ ప్రమాదం కూడా తగ్గుతుందని అటు వాతావరణ శాఖ, ఇటు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

Tags: Cool pudding

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *