స్వచ్ఛతకు తుప్పు !

Date:18/06/2018
నిర్మల్‌ ముచ్చట్లు:
నిర్మల్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో చెత్త సేకరించటడానికి సరఫరా చేసిన రిక్షాలను పారిశుధ్య విభాగం సిబ్బంది మూలన పడేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం నేపథ్యంలో చెత్తను సేకరించేందుకు ఈ రిక్షాలు అందించారు. అయితే ఇవి పలు గ్రామాల్లో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాయి. కొన్ని రిక్షాలైతే తుప్పు పట్టి పనికిరాకుండా పోయాయి. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా మారిందని అంతా అంటున్నారు. ఈ రిక్షాలు అందించడంతో ప్రధాన ఉద్దేశం గ్రామాలను స్వచ్ఛతకు చిరునామాగా తీర్చిదిద్దడమే. గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో వీటిని కొనుగోలు చేశారు. పంచాయతీల్లో పారిశుద్ధ్య మెరుగుకు మంజూరు చేసిన ఈ వాహనాలు నిరుపయోగంగా మారాయి. వీటిని కొనుగోలు చేసి వదిలేయడంతో జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా రూ.లక్షల ప్రజాధనం వృథా అయిందని అంతా అంటున్నారు. జిల్లాలోని గ్రామాల్లో ప్రభుత్వం ఎంతో సంకల్పంతో ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నీరుగారిపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పంచాయతీలకు పంపిణీ చేసిన రిక్షాలన్నీ వినియోగించకుండా నిరుపయోగంగా ఉన్నాయని వీటిని తక్షణమే వాడుకలోకి తీసుకురావాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.
గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్తసేకరించడం మంచి ఫలితాలు ఇస్తోంది. ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనం ఇవ్వడంలేదు. దీంతో ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా విభాగం తరఫున కూడా గ్రామాల్లో మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2016 జనవరిలోనే గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం కింద ఈ మూడు చక్రాల సైకిళ్లను కొనుగోలు చేశారు. ఒక్కోటి రూ.18,500ల వ్యయంతో కొన్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 450 సైకిళ్లను రూ.63.45 లక్షలతో కొనుగోలు చేశారు. పంచాయతీ జనాభా ఆధారంగా ఒకటి నుంచి ఆరు సైకిళ్లు పంపిణీ చేశారు. రిక్షాలు చాలా బరువుగా ఉండటంతో పంచాయితీ సిబ్బంది వాటిని వినియోగించడానికి ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. మరోవైపు పంచాయతీ అధికారులకు రిక్షాల గురించి ఎటువంటి ఆదేశాలు రాలేదని అందుకే వీటిని వినియోగించడం లేదని పలు పంచాయతీల కార్యదర్శులు చెప్తున్నారు. మొత్తంగా రిక్షాలు తుప్పుపట్టి పాడైపోతున్నా.. అధికార యంత్రాంగంలో చలనంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ రిక్షాలను వినియోగంలోకి తీసుకురావాలని అంతా కోరుతున్నారు.
Tags:Corrosion of purity!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *