Cousin you need it!

దాయాదికీ కావాల్సింది నీరే!

Date: 14/12/2017

దాయాది దేశమైన పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని తెలిసీ భారత్ తన స్నేహ హస్తాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే వస్తోంది. ఆ దేశంతో మనకు ఎంతటి సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సింధు జల ఒప్పందం మాత్రం నిలకడగానే ఉంది. నదీ జలాలు ఇరుగు పొరుగు మధ్య వైషమ్యాలనే సృష్టించాలని లేదు. శాంతి సౌహార్ద్రతలకు, అభివృద్ధికి సంకేతాలుగా నిలవవచ్చన్నదానికి ఈ చరిత్రాత్మకమైన సింధు జల ఒప్పందం ఒక మచ్చుతునకగా పేర్కొనవచ్చు. రెండు దేశాల మధ్య మనస్పర్థలను తొలిగించుకోవడానికి తాజా చర్చల్లో ఇరు పక్షాల పెద్దలూ పురోగతి సాధించారనే చెప్పాలి. భారత్ కిషన్‌గంగా, చీనాబ్ నదులపై కొన్ని పరిమితులతో జలవిద్యు త్ ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చునని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య కార్యదర్శుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చలు సౌహార్ద్రపూరిత వాతావరణంలో జరిగాయని, సెప్టెంబర్‌లో మళ్లీ సమావేశం కావడానికి అంగీకారం కుదిరిందని ప్రపంచబ్యాంకు వెల్లడించింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న సమయంలో నదీ జలాలపై ఇరు పక్షాలు చర్చించుకోవడమే అభినందనీయం. అయితే, జమ్మూకశ్మీర్‌లో నిర్మించ తలపెట్టిన రెండు జల విద్యుత్ ప్రాజెక్టులపై మాత్రం పాకిస్థాన్ అభ్యంతరం చెబుతోంది. కిషన్ గంగా నదిపై నిర్మించే జల విద్యుత్ కేంద్ర నిర్మాణం 2007లో ప్రారంభమైంది. ఇది గత ఏడాదే పూర్తి కావలసింది. అయితే దీనిపై పాకిస్థాన్ హేగ్ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. కనిష్ఠ స్థాయిలో జలాన్ని భారత్ జలవిద్యుత్ కోసం మళ్ళించుకోవచ్చునని హేగ్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. చీనాబ్ నదిపై రాత్లే దగ్గర నిర్మించతలపెట్టిన జల విద్యుత్ ప్రాజెక్టు (850 మెగావాట్లు)పై కూడా పాకిస్థాన్ అభ్యంతరం తెలిపింది. అయితే ప్రపంచబ్యాంకు భారత్ తప్పులేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సింధు జల ఒప్పందంలోని సంక్లిష్టతల దృష్ట్యా అనేక సాంకేతిక అంశాలు, వ్యాఖ్యానాలు ముందుకు వస్తున్నాయి. సింధునదీ బేసిన్‌లోని ఆరు నదులు టిబెట్‌లో జనించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు జల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19వ తేదీన కుదిరింది. దీనిపై అప్పటి ప్రధాని నెహ్రూ, నాటి పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకా లు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లేజ్ నదులపై నియంత్రణ భారత్‌కు, జీలం, చీనాబ్, సింధు నదులు పాకిస్థాన్‌కు కేటాయింపు జరిగింది. భారత్ పశ్చిమ నదులను కూడా వినియోగించుకోవచ్చునని అంటూనే నిలువపై పరిమితులను ఈ ఒప్పందం నిర్దేశిస్తోంది. భారత్, పాకిస్థాన్ దేశాలు జలవివాదాన్ని పరిష్కరించుకుని, కాపాడుకుంటున్న తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకొంటోందనే చెప్పాలి. రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురికాలేదంటే ఆ ఒప్పందంపై రెండు దేశాలకు ఉన్న నిబద్ధతను అర్ధంచేసుకోవాలి. అయితే ఎగువన ఉన్న దేశమైన భారత్ ఏ ప్రాజెక్టు చేపట్టినా తమకు నీటి లభ్యత తగ్గుతుందనే కారణాలను చూపి పాకిస్థాన్ అభ్యంతరాలు చెబుతున్నట్లు ఉందే గానీ, భారత్‌తో వివాదానికి దిగాలన్న ఆలోచన ఆ దేశానికి లేనట్టే కనిపిస్లోంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రక్తం, నీరు కలిసి ప్రవహించదు అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. సింధు జల ఒప్పంద కమిషన్ చర్చలకు భారత్ హాజరుకాలేదు. కానీ ఆ తరువాత వివాద పరిష్కారానికి చర్చలకు వెళ్ళాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో గత మార్చిలో రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రపంచబ్యాంకును కోరింది. తటస్థ నిపుణుడిని నియమించమని భారత్ కోరింది. అయితే రెండు దేశాలు భిన్న వాదనలు చేయడంతో ప్రపంచబ్యాంకు విడిగా ఇరుపక్షాలతో చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే గత సోమ, మంగళవారాలు వాషింగ్టన్‌లో చర్చలు జరిగాయి. భారత్ జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించుకోవడానికి అనుమతి సాధించింది. వానలు సరిగా పడని కాలంలో నీటి లభ్యత దాదాపు సగానికి తగ్గుతోంది. దీంతో నీటి పంపకం కష్టమవుతుందనేది హెచ్చరించింది. నీటి వివాదాలను పరిష్కరించడంలో ఈ ఒప్పందం విఫలమైందని పాకిస్థాన్ ఇప్పటికే ఆరోపిస్తోంది. భారత్ పాకిస్థాన్ సమగ్ర చర్చలలో సింధు జల వివాదాన్ని కూడా చేర్చాలని పాకిస్థాన్ కోరింది. కానీ ఒకసారి ఒప్పందం నుంచి బయట పడితే మరొకటి కుదుర్చుకోవడం అంత సుల భం కాదని భారత్ భావిస్తోంది. భారత్ ఏ నీటి నిలువ వ్యవస్థలు నిర్మించుకున్నా అవి ఒప్పందానికి వ్యతిరేకమంటూ పాకిస్థాన్ అభ్యంతరాలు చెబుతూనే ఉంటుంది. ఒప్పందంలోని సంక్లిష్టతలు, సాంకేతికతల దృష్ట్యా పాకిస్థాన్ భిన్న వ్యాఖ్యానాలను ముందుకు తేవచ్చు. భారత ఉపఖండం యుద్ధాలతో తల్లడిల్లాలని కొన్ని విదేశీ శక్తులు కోరుకోవచ్చు. భారత్ ఎంతో చాతుర్యంతో, సహనంతో వ్యవహరించవలసి వస్తున్నది. ఒప్పందాన్ని కాపాడుకుంటూనే, ఒప్పందం పరిధిలో వీలైనంత ఎక్కువ జలాలను వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగానీ, ఇరుగు, పొరుగు దేశాలతోను, సరిహద్దు దేశాలతోనూ కోరి సమస్యలు తెచ్చుకునేలా పరిస్థితులు ఉండకూడదు.

Tag: Cousin you need it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *