సేద్యపు కుంటలతోనే పంటలు సురక్షితం!

Date:13/03/2018
నల్గొండ ముచ్చట్లు:
భూగర్భ జలాలు పడిపోవడంతో పాటూ వేసవి ప్రభావం ప్రారంభమవడంతో రైతులకు సాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. 24 గంటలు విద్యుత్ ఉంటున్నా పొలాలకు నీరు అందని పరిస్థితి. దీంతో పలు ప్రాంతాల్లో పంటలు వాడిపోతున్నాయి. కొన్ని చోట్ల ఎండిపోయాయి. ఈ సమస్యను అధిగమించేందుకు నల్గొండ జిల్లా రైతాంగం నానాపాట్లు పడుతోంది. పలువురు రైతులు వ్యవసాయక్షేత్రాలకు తడులు అందించేందుకు కొత్తగా బోర్లు కూడా వేస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం ఉండడంలేదు. ఇన్ని ఇక్కట్ల మధ్యే చిన్నశంకరంపేట రైతులకు ఓ ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టి పంటలు వాడిపోకుండా రక్షించుకోగలుగుతున్నారు. స్థానిక రైతులు పొలంలో ఎత్తైన ప్రాంతంలో నీటి నిల్వ కుంటను ఏర్పాటు చేసుకుంటున్నారు. బోర్లలో నుంచి ధారగా వస్తున్న నీటిని అందులో నింపి నేరుగా పైరుకు తడులు ఇస్తూ పైరును కాపాడుకుంటున్నారు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల రైతులు ఆచరిస్తున్న తీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది.
మండలంలో పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రబీలో వరి సాగును తగ్గించేశారు రైతులు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుసెనగ, కూరగాయలనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొన్నిచోట్ల వరి సాగు చేసిన రైతులు నీటి నిల్వ ట్యాంకులు ఏర్పాటు చేసుకుని పంటలకు నీటి అందిస్తున్నారు. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలు సాగుచేసి ఇప్పటికే మూడు నెలలు పూర్తయ్యాయి. మరో 20 నుంచి 30 రోజుల వ్యవధిలో దిగుబడులు చేతికి అందనున్నాయి. నీరు పెద్దమొత్తంలో అందుబాటులో లేకున్నా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫలసాయం చేతికి వస్తోందని పలువురు రైతులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే మండలంవ్యాప్తంగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో 300లకు పైగా వ్యవసాయ బావులు ఎండిపోయిన పరిస్థితి. ఈ సమస్యను అధిగమించి పంటలు రక్షించుకోవాలంటే సేద్యపు కుంటలే శరణ్యమని పలువురు రైతులు చెప్తున్నారు. సేద్యపు కుంటలతో సాగునీటి కష్టాలను కొంతమేరైనా అధిగమించవచ్చని స్పష్టంచేస్తున్నారు.
Tags: Crops are safe with farming crops!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *