Dairy is called nutrition!

పౌష్టికాహారం పేరిట పాల దందా!

-ప్రభుత్వాన్ని దోచుకుంటున్న వైనం

-చేయూత పేరిట పట్టించుకోని సీఎం

-విజయ డెయిరీ పేరిట దళారీల దోపిడీ

Date: 06/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

అంగన్‌వాడీ కేంద్రాలకు గర్భిణులు, బాలింతలకు పాల సరఫరాలో అవినీతి వరద ఏరులై పారుతోంది. ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే రూ.కోట్ల విలువైన వ్యాపారాన్ని అడ్డగోలుగా విజయ డెయిరీకి అప్పగించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. విజయ డెయిరీ పేరుతో దళారులు రంగ ప్రవేశం చేసి అడ్డగోలుగా పాల వ్యాపారం సాగిస్తూ దండుకుంటున్నారు. ఆరోగ్యలక్ష్మీ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా రోజూ 200ఎంఎల్‌ చొప్పున పాలను పంపిణీ చేయాల్సి ఉంది. 25 పనిదినాలతో పాటు మిగిలిన 5 రోజులకు ఆ పాలకు సరిపడా పెరుగు అందించాలి. ప్రతి ఒక్కరికి నెలకు 6 లీటర్ల చొప్పున కేటాయించారు. ఈ పాలను సక్రమంగా సరఫరా చేయడం వల్ల బాలింతలు, గర్భిణులకు అవసరమయ్యే కాలరీలు, ప్రోటీన్లు, క్యాల్షియం సరైన మోతాదులో అందుతుంది. ప్రస్తుత ఆదిలాబాద్‌ జిల్లాలో 12వేల మంది గర్భిణులు, బాలింతలు ఉండగా నిర్మల్‌ జిల్లాలో 11269మంది, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 10వేలు, మంచిర్యాల జిల్లాలో 9672మంది లబ్ధిదారులు ఉన్నారు. వీళ్లు కాకుండానే ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలకు కూడా రోజుకు 100 ఎంఎల్‌ చొప్పున పాలు పంపిణీ చేయాల్సి ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలకు పాలసరఫరా అస్తవ్యస్తంగా మారింది. గతంలో టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లను ఎంపిక చేయగా ప్రస్తుతం టెండర్లు లేకుండా పాల సరఫరాను హైదరాబాద్‌కు చెందిన విజయ డెయిరీకి అప్పగించారు. స్థానికంగా దొరికే పాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఈ పాలు తాగడం అంతగా మంచిది కాకపోవడం వల్ల విజయ డెయిరీ ద్వారా పాల సరఫరా అవుతాయని ఉన్నతాధికారులు లేఖ పంపారు. దీనిని ఆధారంగా చేసుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయ డెయిరీ నిర్ణయించిన ధరలకు పాల సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో భారీగా చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఆన్‌లైన్‌లో టెండర్‌ నిర్వహించినప్పుడు లీటర్‌ పాల ధర రూ.38లకే సరఫరా చేశారు. ఉన్నతాధికారులు మాత్రం విజయ డైరీ నుంచి పాలు సరఫరా చేస్తామని చెప్పారే తప్ప ధర నిర్ణయించలేదు. విజయ డెయిరీ సంగారెడ్డిలో లీటర్‌కు రూ.42 చొప్పున సరఫరా చేస్తుంది. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో కూడా లీటర్‌ పాల ధర రూ.42చొప్పున నిర్ణయించి సరఫరా చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇదే విజయ డెయిరీ లీటర్‌ పాలను రూ.44 చొప్పున సరఫరా చేస్తామని తెలుపగా అంత ధర తాము ఇవ్వలేమని అక్కడి ఐసీడీఎస్‌ అధికారులు స్పష్టం చేశారు. దీంతో విజయ డెయిరీ దిగొచ్చి లీటర్‌ రూ.42లకే సరఫరా చేయడానికి ఒప్పుకుంది. కానీ ఆ ధర కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేమని స్థానిక అధికారులు కమిషనర్‌కు తెలిపారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మాత్రం ఎలాంటి నెగోషియేషన్‌ చేయకుండా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దూరాన్ని బట్టి లీటరు రూ.44 నుంచి రూ.49 వరకు చెల్లిస్తున్నారు. ఇది సాధారణ ధర కంటే చాలా ఎక్కువ. నిజానికి విజయ డెయిరీ నేరుగా అంగన్‌వాడీలకు పాల సరఫరా చేయకుండా మధ్యలో కాంట్రాక్టర్లకు సరఫరా చేస్తుండటంతో ధరను అమాంతం పెంచేశారు. విజయ డెయిరీ నుంచి సూపర్‌ స్టాకిస్టుకు 200ఎంఎల్‌ కలిగిన 30 (6లీటర్లు) పాల ప్యాకెట్‌ల ధర రూ.211.31 ఉండగా ఇక్కడి నుంచి స్టాకిస్టుకు అవే పాల ధర రూ.239.42కు సరఫరా చేస్తున్నారు. ఐసీడీఎస్‌ అధికారులు మాత్రం ఎలాంటి బేరసారాలు చేయకుండా లీటర్‌కు రూ.49 చొప్పున 200ఎంఎల్‌ కలిగిన 30 ప్యాకెట్‌లకు రూ.295.50 లెక్కన చెల్లిస్తున్నారు. రిటైల్‌ ధరతో పోల్చినా ప్రతి లీటర్‌ పాలకు రూ.7.50 అధికంగా చెల్లిస్తున్నారు. విజయ డైరీ పేరుతో రంగప్రవేశం చేసిన దళారులే అధిక లాభాలు పొందుతున్నారు. ప్రస్తుత ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 12వేల మంది లబ్ధిదారులుండగా వారికి ప్రతి నెలా సుమారుగా 72వేల లీటర్ల వరకు అవసర పడుతున్నాయి. ఇక్కడ లీటర్‌కు తక్కువలో తక్కువ రూ.8 అదనంగా లెక్కవేసుకున్నా ప్రతి నెలా అధికారులు, దళారులు కలిసి రూ.5.76 లక్షలు అదనంగా ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నట్టే. ఇదంతా సజావుగా సాగుతుందా అంటే అదీలేదు. ఆదిలాబాద్‌ రూరల్, అర్బన్, ఉట్నూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి, జైనథ్‌, బేలా, తాంసి, తలమడుగు, గుడిహత్నూర్‌, బజార్‌హత్నూర్‌, బోథ్‌ ప్రాంతాల్లో సగానికి సగం మందికి కూడా పాల సరఫరా జరగడం లేదు. ఈ లెక్కన దోచుకునేదానికి లెక్కలే లేవు.

Tags: Dairy is called nutrition!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *