నత్తనడకన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి పథకం 

Date:13/02/2018
ఖమ్మం ముచ్చట్లు:
పేదల గృహాలకూ విద్యుత్ సొకర్యం కల్పించి వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి పథకం ప్రవేశపెట్టింది. బృహత్తర ఆశయంతో ప్రారంభించిన ఈ స్కీమ్ ఖమ్మం జిల్లాలో నత్తనడకన సాగుతోందని స్థానికులు అంటున్నారు. నిధులు మంజూరై 10 నెలలు దాటిపోతున్నా ఇప్పటికీ విద్యుత్తు మీటర్ల ఏర్పాటు, నియంత్రికలు, మధ్య స్తంభాలు ఏర్పాటు మందకొడిగా సాగుతోందని చెప్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పనుల్లో ఆలస్యం జరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు విద్యుత్తు మీటర్లు కోసం లబ్ధిదారులు కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మీటర్లు రాకపోవడంతో వారిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి(డీడీయూజీజే) పథకం కింద అవిభాజ్య ఖమ్మం జిల్లాకు రూ.11.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో 3 విద్యుత్తు ఉపకేంద్రాలు, 357 సింగిల్‌ ఫేజ్‌ డీపీఆర్‌లు, 800 మిడ్‌పోల్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎల్టీ లైన్‌ 86 కిలోమీటర్లు లాగాల్సి ఉంది. కేంద్రం మంజూరు చేసిన నిధులతో విద్యుత్‌ మీటర్లు 12,699 విద్యుత్తు మీటర్లు ఇచ్చి ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 1,061 మీటర్లే అందించారు. దీంతో రూ.125కే విద్యుత్తు మీటరు కోసం పేదలు నిరీక్షించాల్సి వస్తోంది.   రూ.125  కడితే మీటర్‌తోపాటు ఇతర సామగ్రి సర్వీసు వైరు, ఫీజులు, బోర్డులు ఏర్పాటు చేస్తారు. గతంలో ఒక మీటర్‌ ఏర్పాటు చేయాడానికి రూ.2వేలు ఖర్చు అవుతుండడంతో రూ.125కే మీటర్‌, సామగ్రి వస్తుండడంతో లబ్ధిదారులు ఈ పథకంపై ఆసక్తి చూపారు. కానీ మీటర్లు అందించడంలో జాప్యం జరుగుతుండడంతో వారిలో అసహనం వెల్లువెత్తుతోంది. ఈ పథకం కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 12,699 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించగా 13,821 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు మీటర్లు ఇచ్చింది మాత్రం 1,061 మాత్రమే. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చేతికందే ఎత్తులోనే విద్యుత్తు తీగలు వేలాడుతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదం తప్పదని స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదాల్ని నివారించడానికి మిడ్‌పోల్స్‌ మంజూరయ్యాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి విద్యుత్‌ పరంగా లక్ష్యాలు పూర్తి చేయాలని అంతా కోరుతున్నారు.
Tags: Dandayal Upadhyaya Rural Jyothi Scheme is a slogan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *