Dark light shadows ...

చీకటి వెలుగుల రంగేళి…

Date: 04/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

మనిషి కనీస అవసరాలు తీర్చలేని ఆర్థిక స్థితే పేదరికం. దేశాభివృద్ధికి ఇది శాపం. ‘నువ్వు పేదవాడిగా పుడితే అది నీ తప్పు కాదు. కానీ నువ్వు పేదవాడిగా మరణిస్తే అది నీ తప్పే’ అన్న అపర కుబేరుడు బిల్‌గేట్స్‌ మాటలు అక్షర సత్యం. పేదవాని జ్ఞానం తృణీకరింపబడుతుందన్న సాల్మన్‌ మాటలను మరచిపోయినా గేట్స్‌ వ్యాఖ్యల్ని మాత్రం నేటికీ గుర్తుంచుకుంటున్నారంటే అది పేదరికంపై విజయంగానే చెప్పలి. పేదరికం అగౌరవమేమీ కాదు కానీ, సోమరితనం, దుబారా, అవివేకం, విచ్చలవిడితనం వల్ల కలిగేది మాత్రం అలాంటిదే అన్న ఫ్లూటర్స్‌ మాటల్ని ఒకసారి మననం చేసుకుంటే నేటి తాజా పరిస్థితులను అంచనా వేయవచ్చు. పేదరికం ఒక సామాజిక, ఆర్థిక సమస్య.గా మారడానికి మూల కారణం మనలోని సోమరితనమే అన్నది విశ్వవ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిపిన వివిధ సర్వేలు స్పష్టంచేశాయి. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది. సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన ఆహారం, గృహవసతి, దుస్తులు పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. పేదరికంతో బాధపడుతున్న వారిని పేదలు అంటారు. పేదరికమే అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ చెప్పారు. వివిధ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు చేరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు కూడా. ఓ వ్యక్తి తీసుకునే పౌష్టికాహారం (కేలొరీలు) ఆధారంగా గతంలో దారిద్య్రానికి నిర్వచనం ఇచ్చేవారు. దాని ప్రకారం పదేళ్ల కిందటి లెక్కల్ని పరిశీలిస్తే నాటికి దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న వారు 27.5 శాతం. బీపీఎల్‌ కుటుంబాలు 6.5 కోట్లు. టెండూల్కర్‌ నివేదిక ప్రకారమైతే, ఆహారంతో పాటు విద్య, ఆరోగ్యంపై చేసే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దేశ మొత్తం జనాభాలో 37.2 శాతం మంది నిరుపేదలు. బీపీఎల్‌ కుటుంబాలు 8.1 కోట్లు. ఆహార భద్రతా చట్టం ప్రకారం బీపీఎల్‌ కుటుంబానికి ప్రతినెలా కేజీ రూ.3 వంతున 25 కేజీల ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు. నెలకు రూ.10వేల కన్నా తక్కువ ఆదాయం ఉండి, పెద్దగా భూమికాని, సొంతానికి వాహనం కాని లేని గ్రామీణులు, బీపీఎల్‌ జాబితాలోకి రానివారు, ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగం ద్వారా నెలకు రూ.10వేలు సంపాదిస్తూ, ఎక్కువ భమి, పండ్లతోటలున్నవారు, పాల పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, చేపలసాగు వంటివి చేపట్టిన వారు (పరిశ్రమస్థాయి, ఆదాయాన్ని బట్టి), ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు (వాటిమీద బతుకుతెరువు ఆధారపడి ఉండకపోతే), ట్రాక్టర్లు, నాటు యంత్రాల వంటి వ్యవసాయ యంత్రాలున్నవారు, చేపల పడవలున్నవారు, విద్యుత్‌, మంచినీటి కనెక్షన్‌ ఉన్నవారు, బీమా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉన్నవారిని కూడా మనం అధికారిక లెక్కల నుంచి మినహాయించలేం. స్వభావాన్ని బట్టి పేదరికాన్ని సాపేక్ష, నిరపేక్ష పేదరికం అని విభజించవచ్చు. జనాభాను వివిధ ఆదాయ వర్గాలుగా విభజించి అత్యధిక ఆదాయం పొందే 5% నుంచి 10% ప్రజల జీవనస్థాయితో అతి తక్కువ ఆదాయం పొందే అట్టడుగు 5% నుంచి 10% ప్రజల స్థాయిని పోల్చి పేదరికాన్ని నిర్ణయిస్తారు. సాపేక్ష పేదరికం ద్వారా ఆర్థిక అసమానతలను లెక్కించవచ్చు. ప్రజలకు కావలసిన కనీస అవసర వస్తువుల పరిమాణాన్ని నిర్ణయించి, దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగం నిర్ణయిస్తారు. ఈ తలసరి కనీస ద్రవ్య రూప వినియోగ స్థాయి కంటే తక్కువ ఉన్న జనాభాను నిరపేక్ష పేదవారు అంటారు. తక్కువ తలసరి ఆదాయం, అల్పోద్యోగిత, నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, అధిక జనాభా, వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, వనరుల అల్ప వినియోగం, అల్ప వేతనాలు, శ్రామిక వర్గానికి వనరులపై యాజమాన్యం లేకపోవడం. 1950 నుంచి 1970 వరకు భారత ప్రభుత్వం పేదరికాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రత్యక్ష చర్యలు చేపట్టలేదు. ఆర్థికాభివృద్ధిని సాధిస్తే పేదరికం దానంతట అదే తగ్గుతుందనే సిద్ధాంతాన్ని నమ్మింది. పంచ వర్ష ప్రణాళికలో భాగంగా పేదరికాన్ని తగ్గించడానికి ప్రత్యక్ష చర్యలు మొదలయ్యాయి. పేదరికం తీవ్రతను అంచనా వేసి గరీబీ హఠావో అనే నినాదాన్ని ప్రభుత్వం చేపట్టింది. 1973 నుంచీ అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టింది. 1972-73లో మహరాష్ట్రలో ఉపాధి హామీ పథకం, 1973లో క్షామపీడిత అభివృద్ధి కార్యక్రమం, 1974-75లో చిన్నకారు రైతుల అభివృద్ధి ఏజన్సీ, ఆయకట్టు అభివృద్ధి పథకం. 1975లో ప్రధాని 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది. 1977-78లో ఎడారుల అభివృద్ధి పథకం, పనికి ఆహార పథకం, అంత్యోదయ పథకాలను ప్రవేశపెట్టారు. 1979లో గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి చర్యలు పెట్టారు. 2015 చివరి నాటికి 78 కోట్లకు పైగా(782 మిలియన్లు) భారతీయులు రోజుకు రెండు డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తున్నారని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సంయుక్త నివేదిక వెల్లడించింది. చైనా తన పేదిరిక రేటును 60% నుంచి 16% తగ్గించిందని నివేదిక ప్రశంసించింది. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అసంతులన వల్ల ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు వస్తాయి. అందులో తీవ్రమైన ఆర్థిక సమస్య పేదరికం. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో పేదరికం కనిపిస్తుంది. ఒక దేశం తక్కువ తలసరి ఆదాయంతోనూ, ఎక్కువ ఆదాయ అసనమానతలో ఉంటే ఆ దేశంలో పేదరికం ఉన్నట్లుగా భావించాలి. పేదరికం అనేది ఒక సామాజిక ఆర్థిక దృగ్విషయం. సాధారణంగా ఆహారం, ఇల్లు, బట్టలు వంటి కనీస మౌలిక అవసరాలను సైతం తీర్చుకోలేని వారిని పేదలు అంటారు. ఈ స్థితిని పేదరికం అంటారు. 1997లో దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు సౌకర్యాలు కొరవడడం, కనీస జీవన ప్రమాణాలు, స్వేచ్ఛా, స్వాభిమానం, ఇతరుల నుంచి గౌరవం కొరవడడాన్ని పేదరికంగా నిర్వహించింది. పేదరికం, నిరుద్యోగం గురించి సర్వే చేసే సంస్థ ఎన్‌ఎన్‌ఎస్‌ఓ. ఇది 1950లో ఏర్పాటైంది. ముఖ్యంగా భారతదేశ పేదరికానికి గల కారణాలను ఇది వరకే విశ్లేషించారు. జనాభా పెరుగుదల, అధిక జనాభా ఒత్తిడి, వ్యవసాయంపై అధిక భారం, అల్ప ఉత్పాదకత, నిరుద్యోగం-నిరుద్యోగిత, అల్పవేతనాలు, ధరల పెరుగుదల, సహజ వనరుల అల్ప వినియోగం, అభివృద్ధి వ్యూహం కొరవడడం, రాజకీయ, సాంఘిక పరిస్థితులు, ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, ఆర్థిక శక్తి కేంద్రీకరణ, ద్రవ్యోల్బణం, ప్రామాణికత లేని విద్య, నిత్యావసరాల లభ్యత తక్కువగా ఉండటం, తక్కువ సాంకేతికత, ఎల్‌పీజీ అభివృద్ధి నమూనా, పంచవర్ష ప్రణాళికలు విఫలం చెందడం, మూలధన కొరత, ఆర్థిక సమ్మిళితి లేకపోవడం, సైప్లె కొరత తదితరాలను దేశీయ పేదరికానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఒకవైపు దేశంలో పేదరికం విస్తరిస్తున్న క్రమంలోనే మరోవైపు సంపన్నుల శాతం కూడా పెరుగుతుండడం గమనార్హం. దేశంలో కుబేరులు పెరుగుతున్నారు. వందలు వేల కోట్లుగా సంపద పోగుపడుతోంది. మరో పక్క దాతలు పెరుగుతున్నారు. వేల కోట్లు అలవోకగా సమాజం కోసం ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో నిరుపేదలూ పెరుగుతున్నారు. మూడు పూటలా తిండికి నోచుకోని వారి సంఖ్యా పెరుగుతోంది. ఇది మన దేశంలో కనిపిస్తున్న దృశ్యం. ఓ పక్క సంపద పెరుగుతోందని లేటెస్ట్‌ ఫోర్బ్స్‌ జాబితా చెప్తుంటే దేశంలో సామాన్యుడి బతుకు అంతకంతకు దిగజారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. కుబేరుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఫోర్బ్స్‌ తాజా లెక్కల జాబితా ప్రకారం 7 కోట్లు ఆపైన సంపద ఉన్నవారు దాదాపు రెండున్నర లక్షల మంది మన దేశంలో ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగనుందని ఈ నివేదిక చెప్తోంది. ఓ పక్క కుబేరుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు దాతల సంఖ్య కూడా పెరుగుతోంది. దానగుణంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ కొందరు ధనవంతులు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. తమ సంపదలో సింహభాగం సమాజం కోసం వెచ్చిస్తూ, వితరణ చాటుకుంటున్నారు. సంపద పెరగటం మంచి విషయమే. సంపద సృష్టితో దేశం వెలిగిపోతే సంతోషించాల్సిందే. కానీ, చీకటి, వెలుగు పక్కపక్కనే ఉన్నట్టు కొందరి ఖజానా అమాంతం పెరుగుతుంటే, మరికొందరు బతుకుబండి లాగటానికే నానా కష్టాలు పడాల్సిన పరిస్థితిలో పడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? కోటీశ్వరులు పెరిగారు సంతోషమే. కానీ, దేశంలో ఎన్ని కోట్లమంది పేదరికంలో కూరుకుని ఉన్నారో తెలుసా? ఓపక్క మిలియనీర్లు వెలిగిపోతూనే ఉన్నారు. కోట్లు కోట్లుగా సంపద పోగుబడుతోంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కరెన్సీ గుట్టలు గుట్టలుగా పోటీపడుతోంది. మరోపక్క మూడు పూటలా తిండిలేని జనాలు ఆకలితో మాడిపోతున్నారు. పేదరికం భారత ముఖచిత్రంగా మారుతోంది. దేశంలో లక్షలాది మల్టీ మిలియనీర్లు తయారయ్యారు. సంతోషం! కానీ ఇదే దేశంలో, ఇంతటి సంపన్న దేశంలోనే, అందరికీ తిండిపెట్టే రైతన్న రాలిపోతున్నాడు. ఉరికొయ్యకు, పురుగుమందుకు బలవుతున్నాడు.. వ్యవసాయ జూదంలో నిట్టనిలువునా మోసపోయి బతుకునుండి సెలవు తీసుకుంటున్నాడని తెలుసా? ప్రపంచంలో భారత్‌ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పటికీ దాని సంపద మాత్రం జనాభా అంతటికీ సరిగ్గా పంపిణీ జరగలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలోనే పేదరికం పెరిగిందన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారి విధానాల వల్ల ధనికులు బిలియనీర్లుగా అవతారం ఎత్తుతుంటే పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు. పాలక పక్షాలు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు, నోట్ల కోసం బహుళజాతి కంపెనీల అనుకూల విధానాలు అవలంబించినంత కాలం ఈ అంతరాల్లో ఎలాంటి మార్పుండదు.

Tags: Dark light shadows …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *