డెడ్‌ హ్యాండ్‌’ రష్యా ఆఖరి బ్రహ్మాస్త్రం

రష్యా ముచ్చట్లు:
 
రష్యా లేకపోతే, ప్రపంచమూ ఉండదు.. గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు. ఇవి ఏదో బెదిరించేందుకు చేసిన వ్యాఖ్యలు కాదు. నిజంగానే రష్యా లేకపోతే ప్రపంచం ఉండకపోవచ్చు! దీనికి కారణం ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా నుంచి కాపాడుకొనేందుకు ఆ దేశం తయారు చేసిన ‘డెడ్‌ హ్యాండ్‌’  వ్యవస్థే. తాజాగా ఉక్రెయిన్‌ అణుకేంద్రాలపై దాడుల నేపథ్యంలో మళ్లీ ఒక్కసారిగా ఈ ‘డెడ్‌హ్యాండ్‌’ చర్చలోకి వచ్చింది.
ఏమిటీ మరణహస్తం?
సాధారణంగా అణుదాడి చేస్తే తిరిగి ఎదురుదాడి చేసే అవకాశం ప్రత్యర్థికి ఉండదు. ఈ భయంతోనే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యవస్థను రష్యా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఒక వేళ అణుదాడితో రష్యాను అమెరికా నామరూపాలు లేకుండా చేసినా, అగ్రరాజ్యంతో పాటు దాని మిత్ర దేశాలనూ సర్వనాశనం చేసే శక్తి ఈ మరణ హస్తానికి ఉండటం విశేషం. రష్యా అత్యున్నత నాయకత్వం, నూక్లియర్‌ కమాండ్‌ తుడిచిపెట్టుకుపోయినా.. ఇది పనిచేస్తుంది. రష్యన్లు దీన్ని పెరీమీటర్‌ అని పిలుస్తారు. ఇందులో అణ్వాయుధాలు ప్రయోగించే 700 వాహకాలు ఉన్నాయి. వీటిల్లో స్టాట్రజిక్‌ బాంబర్లు, న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లు, భూగర్భ బొరియల్లో దాచిన ఖండాంతర క్షిపణులు ఉన్నాయి.  .
ఎలా పనిచేస్తుంది..?
అత్యంత శక్తిమంతమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థ సాయంతో ఇది పని చేస్తుంది. దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లోని భూగర్భ బొరియలు (సిలోస్‌), ఇతర చోట్ల భద్రపర్చిన అణు క్షిపణులను ఈ వ్యవస్థ యాక్టివేట్‌ చేయగలదు. ఇందుకోసం రాడార్లు, శాటిలైట్లతోనూ సమన్వయం చేసుకోగలదు. అణుదాడి జరిగి మాస్కో, ఇతర నగరాలు నాశనమైనా.. ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకొనేలా దీన్ని రష్యా శాస్త్రవేత్తలు రూపొందించారు. అణుదాడి జరగగానే, దేశంలో వివిధ భాగాల్లో అమర్చిన సెన్సర్ల ద్వారా రేడియేషన్‌.. ఇతర ప్రభావాలను ‘డెడ్‌హ్యాండ్‌’ అంచనా వేస్తుంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే కేంద్ర సైనిక కమాండ్‌కు సంకేతాలు పంపుతుంది. అక్కడి నుంచి తిరిగి సంకేతాలు వస్తే సరి.. లేకపోతే కొంత సమయం వేచి చూస్తుంది. ఆ తర్వాత పెరిమీటరే తనంతట తానే అణుదాడికి ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందుకోసం ఎస్‌ఎస్‌-19 బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగిస్తుంది. దీని వార్‌హెడ్‌లో అత్యంత శక్తిమంతమైన రేడియో ట్రాన్స్‌మిటింగ్‌ వ్యవస్థ ఉంటుంది. ఇది భూమికి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 4,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్న అణు క్షిపణులకు ఆదేశాలు జారీ చేస్తుంది. వెంటనే భూగర్భ బొరియల నుంచి ఖండాంతర అణు క్షిపణులు గాల్లోకి లేచి శత్రుదేశంపై విరుచుకుపడతాయి. 1970లో దీని నిర్మాణం ప్రారంభించిన సోవియట్‌ యూనియన్‌.. 1984లో బైలోరష్యన్‌ నుంచి పరీక్షించింది. ఇక్కడి నుంచి గాల్లోకి లేచిన క్షిపణి.. కజకిస్థాన్‌లోని బైకనూర్‌ వద్ద భూగర్భ బొరియలోని క్షిపణికి ఆదేశాలు జారీ చేసింది. ఆ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. 1985 నుంచి ఈ వ్యవస్థను వినియోగంలోకి తెచ్చింది.
 
Tags: Dead Hand ‘Russia’s Last Brahmastra

Natyam ad