Delhi Airport with cramped passengers

ప్రయాణీకులతో కిక్కిరిసిన ఢిల్లీ ఎయిర్‌పోర్టు

-పొగమంచు కారణంగా నిలిచిపోయిన విమానాలు

న్యూఢిల్లీ ముచ్చట్లు:

న్యూఢిల్లీ, జనవరి 1: కొత్త సంవత్సరం రోజునా ఢిల్లీ విమానాశ్రయానికి పొగమంచు కష్టాలు తప్పలేదు. ఏడాది తొలిరోజున ఢిల్లీవాసులు పొగమంచుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు, రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పదుల సంఖ్యలో విమానాల రాకపోకలు స్తంభించడంతో భారీగా ప్రయాణికులు నిలిచిపోయారు. పొగమంచులో రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో సోమవారం ఉదయం నుంచి ఇక్కడి నుంచి బయలుదేరే దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులన్నిటినీ అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన విమానాలపైనా ఈ ప్రభావం పడింది. కొన్ని విమానాలు మాత్రమే ఇక్కడ ల్యాండ్‌ కాగలిగాయి. దీంతో ప్రయాణికులతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. అయితే సోమవారం విమానాలేవీ రద్దు కాలేదని అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రత అత్యల్పంగా 5.7 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పడిపోయింది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. డిసెంబరు 24న కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు, రైళ్ల రాకపోకలపైనా పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఢిల్లీకి వెళ్ళాల్సిన 56 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 20 రైళ్ల సమయాన్ని అధికారులు మార్చారు. 15 రైళ్లు రద్దయినట్లు ఉత్తర రైల్వే అధికారులు వెల్లడించారు. ఆదివారం కూడా పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం విధితమే. దాదాపు 270 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 40 విమానాలను వేరే విమానాశ్రయాలకు మళ్లించారు. మరికొన్ని రద్దయ్యాయి. సోమవారం ఉదయం ప్రయాణాల కోసం త్వరగా విమానాశ్రయాలకు చేరుకున్న వారితో రద్దీ బాగా పెరిగిపోయింది. దీంతో అక్కడ పడిగాపులు గాస్తున్న ప్రయాణికులు తమ పరిస్థితిని ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Tags : Delhi Airport with cramped passengers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *