ప్రారంభమైన డెల్టా ఆధునీకరణ పనులు

Date:17/04/2018
రాజమండ్రి ముచ్చట్లు:
డెల్టా ఆధునీకరణ పనుల కోసం.. మే 30 వరకు 45 రోజుల పాటు కాల్వలను మూసివేయనున్నారు. గత ఏడాదిలాగే ఈ సారి జూన్‌ 1న కాలువలకు నీరు విడుదల చేయనున్నారు.రబీ ఆరంభానికి ముందు గత ఏడాది నవంబర్‌లో కాకినాడలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో డిసెంబర్‌ 31 నాటికి నాట్లు పూర్తి చే యాలని నిర్ణయించారు. మార్చి 31న కాలువలు మూసి వేసి మే 30 వరకు 60 రోజులపాటు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. రైతుల విజ్ఞప్తి మేరకు అదనంగా 15 రోజులు నీరు విడుదల చేయడంతో డెల్టా ఆధునికీకరణ పనులకు 45 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది రూ. 308 కోట్లతో 2,020 పనులు చేసేందుకు జలవనరులశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డెల్టా ఆధునికీకరణ కింద రూ. 173 కోట్లతో 370 పనులు చేయనున్నారు.రబీ పంటకు నీటి విడుదల గడువు ఆదివారంతో ముగిసింది ముందుగా నిర్ణయించిన మేరకు మార్చి 31తో నీటిని నిలిపివేయాల్సి ఉన్నా పలు ప్రాంతాల్లో పంట పొట్టదశలో ఉండడంతో రైతుల విజ్ఞప్తి మేరకు ముందు పది రోజులు, ఆ తర్వాత మరో ఐదు రోజులు వెరసి ఏప్రిల్‌ 15 వరకు గడువు పొడిగించారు. ప్రస్తుతం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జూన్‌ ఒకటిన అధికారులు కాలువలకు నీరు విడుదల చేసినా ఆధునికీకరణ పనులు మధ్యలో ఉండడంతో ఫలితం లేకపోయింది. కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ కాలువలకు అడ్డుకట్టలు వేసి పనులు చేయడంతో కాలువలకు పూర్తి స్థాయిలో నీరు 15 రోజులు ఆలస్యంగా అందింది. గత ఏడాది అదృష్టవశాత్తూ అక్టోబర్‌లో తుపాన్లు రాకపోవడం వల్ల పంట కోత ఆలస్యమైనా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఏడాదైనా డెల్టా ఆధునికీకరణ పనులు సకాలంలో మొదలు పెట్టి నిర్ణీత గడువు మే 30 నాటికి పూర్తి చేసి జూన్‌ ఒకటిన నిరు విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.నీరు– చెట్టు పథకంలో రూ.135 కోట్లతో 1650 పనులు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పునరావృతం కాకూడదంటున్న రైతులు గత ఏడాది డెల్టా ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. ఆధునికీకరణలో భాగంగానే రూ. 60 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ప్రధాన కాలువలు, చానల్స్, పంట బోదెలు, డ్రైన్లలో పూడిక తీత, రిటైనింగ్‌ వాల్స్, హెడ్‌ స్లూయిజ్, స్లూయిజ్‌ పనులు చేపట్టారు. నెల రోజులు ఆలస్యంగా మే నుంచి పనులు చేయడం ప్రారంభించారు. మరికొన్ని పనులు హడావుడిగా మే నెలాఖరున ప్రారంభించారు. జూన్‌ 1నే నీరు విడుదల చేయాలన్న రైతుల పోరాటం ఫలించినా పనులు పూర్తి కాకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.
Tags: Delta modernization works started

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *