బాబు స్పీడు తగ్గిందా…

విజయవాడ ముచ్చట్లు:
 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో ఉన్న స్పీడ్ తగ్గింది. ఇటీవల ఆయన కేవలం పార్టీ కార్యాలయానికే పరిమితమవుతున్నారు. ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఆయన తీరు పార్టీ నేతలకే అర్థం కాకుండా ఉంది. సాధారణంగా చంద్రబాబు రాజకీయాల్లో వేగంగా ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ఆయన పర్యటనలు ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకూ ఆయన పర్యటించినా అలసిపోయినట్లు చూసింది లేదని సీనియర్ నేతలే చెబుతారు.  అలాంటి చంద్రబాబు గత కొద్ది రోజులుగా యాక్టివ్ గా లేరనిపిస్తుంది. పార్టీ కార్యాలయంలోనే సమీక్షలు చేస్తూ కాలం నెట్టుకొస్తున్నట్లే కనిపిస్తుంది. నెల రోజుల క్రితం కుప్పం పర్యటనకు వెళ్లి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత కేంద్ర కార్యాలయానికి లేకుంటే ఉండవల్లిలోని తన నివాసానికి పరిమితమయి పోయారు. కోవిడ్ అనుకోవడానికి కూడా లేదు. కరోనా పరిస్థితులు బాగా తగ్గుముఖం పట్టాయి. అన్ని కార్యక్రమాలు యధాతధంగానే జరుగుతున్నాయి. నిజానికి చంద్రబాబు ఎన్నికలు ఫలితాలు వచ్చిన వెంటనే జిల్లాల పర్యటనలకు సమీక్షల పేరిట చుట్టిరావాలని భావించారు. ఇక చంద్రబాబు నిర్ణయాలు కూడా ఇటీవల కాలంలో తప్పుదారి పడుతున్నాయి. ఆయన అంచనాలు ఫెయిలవుతున్నాయి. రాజవొమ్మింగిలో ఐదుగురు గిరిజనులు కల్తీకల్లు తాగి మరణించారని హడావిడిగా నిజనిర్ధారణ కమిటీ వేశారు.
 
 
ప్రభుత్వం మద్యం పాలసీ వల్లనే ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. చివరకు వచ్చేసరికి అది విషప్రయోగంగా నిర్థారణ అయింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు కొంత వయసు మీరడంతో నిర్ణయాలను కూడా సరిగా తీసుకోలేక పోతున్నారన్న కామెంట్స్ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు దగ్గర నుంచి ఉద్యోగుల సమ్మె విరమణ వరకూ చంద్రబాబు కొంత సంయమనం పాటిస్తూ వస్తున్నారు. గతంలో ఉన్నట్లుగా ఫెరోషియస్ గా వెళ్లడం లేదు. పార్టీ నేతలను తొలుత యాక్టివ్ చేసేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కొందరు సీనియర్ నేతలు చెబుతున్నప్పటికీ, చంద్రబాబు మునుపటిలా యాక్టివ్ గా లేకపోవడానికి కారణాలున్నాయంటున్నారు. రెండేళ్ల ముందునుంచే ఎనర్జీ, నిధులను వేస్ట్ చేసుకోవడం ఎందుకన్న ధోరణిలో ఆయన ఉన్నారు. ఇప్పుడు లేవనెత్తిన సమస్యలు కూడా ఎన్నికల సమయానికి మరుగున పడతాయని అందుకే పర్యటనలు చేయడం వృధా అని చంద్రబాబు భావించి పర్యటనలకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు.
\
Tags; Did Babu slow down …

Natyam ad