నిరంతర విద్యుత్‌తో రైతులకు తప్పిన కష్టాలు

Date:13/02/2018
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
వ్యవసాయ క్షేత్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా తెలంగాణ రైతులకు ఉపయుక్తంగా ఉంది. 24 గంటలు విద్యుత్ ఉంటుండడంతో వినియోగం పెరగింది. అన్నదాతలు వ్యవసాయ భూములకు పుష్కలంగా నీరు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పంటలు ఎండిపోతాయన్న భయం వారిలో కొంత తగ్గింది. అయితే నీటి వనరులు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే పంటలు బాగా ఉన్నాయని, నీరు తక్కువగా ఉన్న ప్రాంతంలో పరిస్థితి ఆశాజనకంగా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా నిరంతర విద్యుత్ వల్ల రాజన్న సిరిసిల్లా జిల్లా రైతాంగానికి మేలే జరుగుతోందని అంతా అంటున్నారు. గతంలో 9 గంటల విద్యుత్తు సరఫరాను రెండు దఫాలుగా ఇచ్చేవారు. నీరు పారిన చోటే మళ్లీ పారేది. చివరి మడికి నీరందేది కాదు. దీంతో పొలంలో కొంతమేర పంట ఎండిపోయేది. ప్రస్తుతం పగటి పూట విద్యుత్తు సరఫరాతో అరుతడి పంటలైన మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలకు నీరు కట్టేందుకు అనువుగా ఉంటున్నట్లు రైతులు చెప్తున్నారు. ఆయకట్టు ప్రాంతాల్లోని రైతులకు పగటిపూట విద్యుత్ విధానం సౌకర్యవంతంగా ఉంది. అయితే ఇతర ప్రాంతాల్లో నిరంతరాయ విద్యుత్తు సరఫరాతో భూగర్భ జలాలు అడుగుంటుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పంట పొట్ట దశకు చేరేనాటికి నీటి చుక్క కరువయ్యే ప్రమాదముందనీ కొందరు అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయానికి సెస్‌ అధికారులు 12 గంటలే విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా మెట్టప్రాంతం కావడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని స్థానిక రైతులు వివరిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్తు వద్దంటూ పలు గ్రామాల్లో తీర్మానాలు చేశారు. దీంతో సెస్‌ యాజమాన్యం 24 గంటల విద్యుత్తు సరఫరాను 12 గంటలకు కుదించారని అంటున్నారు. నిరంతరాయ విద్యుత్ వల్ల రైతులు పగటి పూటే వ్యవసాయ పనులు ముగించుకుంటున్నారు. అర్ధరాత్రుళ్లు పొలాల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి తప్పిపోయిందని వారంతా చెప్తున్నారు. ఇదిలా ఉంటే విద్యుత్ అందించిన ప్రభుత్వం సాగు నీరు కూడా పుష్కలంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతాంగం విజ్ఞప్తి చేస్తోంది. అప్పుడే రైతులకు మద్దతుగా ఉండాలనే సర్కార్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
Tags: Difficulties to the farmers with persistent electricity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *