Do not care about Chandragiri

చంద్రగిరిని పట్టించుకోడు.. సింగపూర్‌ కడతాడట!

సాక్షి

Date :07/01/2018

-చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ధ్వజం

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా దామలచెరువులో రచ్చబండ కార్యక్రమం

సాక్షి, దామలచెరువు : జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రమంతటా మాఫియా ముఠాలను ఏర్పాటుచేసి ప్రజాధనాన్ని దోచుకుంటోన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జన్మభూమి అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గతంలో తొమ్మిదేళ్లు, ఇప్పుడు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా సొంత నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, చంద్రగిరిని పట్టించుకోని ఆయనే.. ఇప్పుడు సింగపూర్‌ కడతానని ప్రజల్ని మభ్యపెడుతుండటం దారుణమన్నారు. 55వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం చంద్రగిరి నియోజకవర్గంలోని దామలచెరువులో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏర్పాటుచేసిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో జగన్‌ పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్‌.. జనం సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

జన్మభూమికి ఏం చేశారాయన? : ‘‘సొంత ఊరిని మనందరం కన్నతల్లిలా భావిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లె, ఆయన చదువుకున్న శేషాపురం.. చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉన్నాయి. బాబుగారు చదువుకున్న స్కూలు ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. గతంలో 9ఏళ్లు, ఇప్పుడు నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన.. చదువుకున్న బడినే పట్టించుకోలేదు.. ఇక రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితి ఎలా ఉంటుదో ఊహిచవచ్చు. 70 శాతం పల్లెలకు సాగునీరేకాదు.. తాగునీరు కూడా అందని పరిస్థితి. దామలచెరువు మార్కెట్‌ ద్వారా ఏటా రూ.100 కోట్ల లావాదేవీలు జరుగుతాయి కానీ మార్కెట్‌కు వెళ్లేందుకు సరైన రహదారి ఉండదు. చంద్రగిరిలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం మహానేత వైఎస్సార్‌ ఇచ్చిన జీవోను చంద్రబాబు పక్కనపెట్టేశారు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు ఏ దేశానికి పోతే ఆ దేశంలా ఏపీని  మార్చేస్తానని ప్రకటిస్తారు. ఇంకానయం.. చిత్తూరుకు సముద్రం తెస్తానని ప్రకటించలేదు!!’  అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

కన్నతల్లిలాంటి ఊరికి.. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు : ‘ ఇదే చంద్రబాబు 1979లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ తరఫున 2500 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాతికాలంలో వైఎస్సార్‌ పుణ్యాన మంత్రి కూడా అయ్యారు. చంద్రగిరికి ఆయన చేసిన ఘనకార్యాలకు ప్రతిగా1983లో ప్రజలను ఆయనను 17,429 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి తన మామ ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశంలో చేరారు. ఓడిపోయి చచ్చినపాములా ఉన్న బాబును ఎన్టీఆర్‌ ఆదరించి, పదవి ఇచ్చారు. కానీ బాబు.. చివరికి ఎన్టీఆర్‌కే ద్రోహం తలపెట్టాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఎవరినైనాసరే వెన్నుపోటుపొడవటం చంద్రబాబు నైజం. కన్నతల్లిలాంటి ఊరిని, పిల్లనిచ్చిన మామను, సొంత తమ్ముడిని, ఓట్లు వేసిన తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది’’ అని జగన్‌ గుర్తుచేశారు.

వ్యవస్థలో మార్పు ఒక్క జగన్‌తోనే సాధ్యంకాదు : రైతులు, పొదుపు సంఘాల మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, పిల్లలు.. వారువీరనే తేడా లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోన్న చంద్రబాబు నాయుడు.. అన్ని వ్యవస్థలను అవినీతిమయం చేశారని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘రుణమాఫీ చేస్తామని రైతులను, పొదుపు సంఘాల మహిళలను వంచన చేశారు. రుణాలు మాఫీ చేయకపోగా, ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ డబ్బు చెల్లించకపోవడంతో ఆ భారం జనం మోయాల్సివస్తోంది. ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగభృతి ఇస్తామని యువతను మోసం చేశారు. రాష్ట్రంలో మట్టితవ్వకాలు మొదలు ఇసుక, కరెంటు కొనుగోళ్లు, బొగ్గు, మద్యం, కాంట్రాక్టులు, రాజధాని భూములు, గుడి భూములు.. అన్ని చోట్లా అవినీతి రాజ్యమేలుతోంది. ఈ దుర్మార్గ వ్యవస్థ మారాలి. మాట తప్పిన నాయకుడు రాజీనామాచేసే పరిస్థితి రావాలి. మార్పు ఒక్క జగన్‌తోనే సాధ్యంకాదు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయని చంద్రబాబు తన కార్యకర్తలకు చెబుతున్నారు. మున్ముందు రాష్ట్రాన్ని నడిపించాల్సిన నాయకుడు ఎలాంటివాడైతే బాగుంటుందో మీరే ఆలోచించండి. మోసాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు ముఖ్యమంత్రి కాకూడదు. ప్రజల కోసం పనిచేసేవారికే పట్టం కట్టండి..’’ అని జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Tags : Do not care about Chandragiri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *