ఆస్పత్రిలో ఆధిపత్యపోరు 

Date:13/02/2018
మహబూబాబాద్ ముచ్చట్లు:
జిల్లా ఆస్పత్రిలో ఆధిపత్య జబ్బు ముదిరి పాకాన పడినట్లు కనిపిస్తోంది. వైద్యులు వర్గాలుగా ఏర్పడటంతో.. వైరుధ్యాలు రాజ్యమేలుతున్నాయి. పరస్పర ఆరోపణలకు, కక్షసాధింపులకు వైద్యశాల వేదికగా మారుతోంది. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ తమను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని, రోగుల బంధువులను తమకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తూ వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌కు గతంలో ఆరుగురు గైనకాలజిస్టులు ఫిర్యాదు చేశారు. ఇక అప్పటి నుంచి ప్రచ్ఛన్నయుద్ధం మొదలైనట్లు సమాచారం. ఇటీవల వరుసగా ముగ్గురు సర్జన్లు విధులకు గైర్హాజరయ్యారని మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఉన్నతాధికారులకు నివేదికలు పంపడంతో పోరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఓ వైద్యుడు నేరుగానే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు చేసేందుకు మళ్లీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వైద్యుల ఆధిపత్య పోరులో రోగులకు నాణ్యమైన సేవలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.ఇటీవల సంక్రాంతి సెలవుల్లో పలువురు వైద్యుల గైర్హాజరుపై మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఉన్నతాధికారులకు ఇచ్చి న నివేదికతో ఈ ఆస్పత్రిలో సుధీర్ఘకాలంగా కొనసాగుతున్న వైద్యులు-సూపరింటెండెంట్‌ మధ్య అంతర్గత వైరుధ్యాలు బహిర్గతమయ్యాయి. జిల్లా ఏర్పాటుకు ముందు వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రిగా ఉన్నకాలం నుంచే సూపరింటెండెంట్‌ పోస్టు దక్కించుకునేందుకు ఆధిపత్య పోరు ఆరంభమైంది. ఇందులో ఒక్కరు స్వచ్చంధంగా తప్పుకున్న నాటి నుంచే కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్‌-సీనియర్‌ వైద్యుల మధ్య ఈ పోరు నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. జిల్లా ఆస్పత్రిగా మారిన తర్వాత కూడా మార్పేమి లేదు. 2009కు పూర్వం ఇక్కడ పని చేసిన సూపరింటెండెంట్‌పై కొందరు వైద్యులు అసమ్మతి కూటమిగా మారారు. ఒక దశలో ఇక్కడ రాజకీయాలు ఎందుకనుకున్న అప్పటి వైద్యుడు ఆ పోస్టు నుంచి స్వచ్ఛందంగా తొలగిపోయారు. ఆపై సదరు స్థానం సీనియర్‌ వైద్యుడితో భర్తీ అవుతుందనుకుంటే ఎందుకో ఆయన తప్పకుని ఇంకొకరికి అవకాశమిచ్చారు.కొంతకాలం పాటు అంతా సవ్యంగానే కొనసాగింది. సూపరింటెండెంట్‌ ఆధిపత్య పాలనపై రెండేళ్లు గడిచాక వైద్యుల్లో కొందరు ఆయనపై అసంతృప్తిని వెల్లగక్కా రు. ఎమ్మెల్యే, ఎంపీలు అండగా ఉండడంతో స్థానచలనం సాధ్యపడలేదు. ఆపై ఈ పోస్టు కోసం ఇందులో పనిచేసే వైద్యుల్లో ఒకరిద్దరు పావులు కదిపారు. అయినా ఆ పోస్టులో ఉన్న వైద్యులు ప్రత్యామ్నాయ ప్రయత్నాలతో నిలదొక్కుకుంటూ వచ్చారు. తర్వాత సదరు సూపరింటెండెంట్‌ అనారోగ్యానికి గురైన సందర్భంలో సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ అప్‌స్ట్రిక్స్‌ గైనకాలజీ (వోబీజీ) ఆ పోస్టులో చేరారు. పూర్వ సూపరింటెండెంట్‌ ఆరోగ్యం కుదుటపడగానే తిరిగి పోస్టు తనకే కావాలని చేసిన ప్రయత్నాలు వివాదానికి తెరలేపాయి. ఎట్టకేలకు సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ నుంచి తిరిగి పాత సూపరింటెండెంట్‌కే ఆ పగ్గాలు చిక్కాయి. యఽథా మళ్లీ సూపరిండెంట్‌-వైద్యుల మధ్యచిచ్చు రేగింది. వరుస పరిణామాల్లో మెడికల్‌ సూపరింటెండెంట్‌ విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని ఆరోపణలు చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ 2014అక్టోబర్‌లో 15మంది వైద్యులు మూకుమ్మడిగా సంతకాలు చేసి తెలంగాణ వైద్యవిధానపరిషత్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఆధిపత్య పోరు మరింత ముదిరిపాకానపడింది.వైద్యుల ఫిర్యాదుకు మెడికల్‌ సూపరింటెండెంట్‌ సమాధానం ఇచ్చుకుంటూనే తన పోస్టును కాపాడుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచే ఆస్పత్రిలో వైద్యుల తరుపున ఏ చిన్న పొరపాటు జరిగినట్టు అనిపించినా, రోగుల నుంచి విధులపై నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చినా సూపరింటెండెంట్‌ తీవ్రంగా పరిగణిస్తూ రోగులకు పరోక్షంగా మద్దతిస్తూ విచారణలు చేపడు తూ కక్షసాధింపుకు దిగారని పలువురు వైద్యుల ఆరోపణలు మొదలయ్యాయి. క్రమం గా ప్రాంతీయ ఆస్పత్రి జిల్లా పెద్దాస్పత్రిగా మారింది. ఆయన పోస్టు యథాతథంగా కొనసాగుతూ వచ్చింది. కేసీఆర్‌ కిట్టు, ఇతరత్రా ప్రభుత్వ పథకాల అమలు ద్వారా ఈ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగిపోయింది. దీనికి తోడు వైద్యులపై పనిభారం పెరిగిపోయింది. కలెక్టర్‌ స్థానికంగానే అందుబాటులో ఉండ టం తరుచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చి విధుల సమయంలో డుమ్మా డాక్టర్లకు మెమోలు జారీ చేయడం ఇది పీహెచ్‌సీల వరకు కొనసాగింది.పెద్దాస్పత్రిలో శిశువుల మరణాలు జరిగినప్పుడు మెడికల్‌సూపరింటెండెంట్‌ వారి బంధువులను పరోక్షంగా రెచ్చకొట్టారని సూపరింటెండెంట్‌పై ఒక సీనియర్‌ సివిల్‌ సర్జన్‌ ఆరోపణ. విధులు సక్రమంగా నిర్వహించమంటే తనపైనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని సూపరింటెండెంట్‌ ప్రత్యారోపణల పర్వం ఎమ్మెల్యే, ఎంపీల వరకు వెళ్లింది. వాస్తవానికి పూర్వంలోనే ఇక్కడి సూపరింటెండెంట్‌ పోస్టుకు మరొకరు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కోర్టు నుంచి స్టే తెచ్చి తానే ఆ పోస్టులో కొనసాగుతూ వస్తున్నారని చెబుతున్న వైద్యులు బేసిక్‌పే ద్వారా సీనియర్‌గా ఉన్న సివిల్‌సర్జన్‌ స్పెషలిస్టు ఓబీజీ వైద్యుడికి అంతకు తక్కువ బేసిక్‌ పేతో జూనియర్‌గా ఉన్న సూపరింటెండెంట్‌కు విధులు కేటాయించడంపై అభ్యంతరాలు తెలుపుతున్నారు.2017 జూన్‌లో ఆరుగురు గైనకాలజిస్టులు ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ తమను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని, రోగుల బంధువులను తమకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తూ వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో మెడికల్‌ సూపరింటెండెంట్‌ వర్సెస్‌ వైద్యుల మధ్య వైరుధ్యం తారాస్థాయికి చేరుకుంది. పర్యావసనమో… లేదా… ఆయన మాటను బేఖాతార్‌ చేయాలనో… ఏమైతేనేం ఇటీవల సంక్రాంతి సమయంలో రెగ్యూలర్‌ గైనకాలజిస్టులు ముగ్గురు, డిప్యూటేషన్‌పై మరో ఇద్దరు ఉన్నప్పటికి జనవరి 1 నుంచి ఒకరు, 13 నుంచి మరొకరు, 14 నుంచి ఇంకొకరు విధులకు హాజరుకావడం లేదని మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఉన్నతాధికారులకు నివేదికలు పంపడం ద్వారా పోరు తెరపైకి వచ్చింది. ఇంకేముంది ప్రస్తుతం ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు నేరుగానే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి వాస్తవాలు ఏకరువు పెట్టేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
Tags: Do not dominate the hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *