మేలుకోకుంటే మంటే.. 

Date:25/05/2018
నిజామబాద్ ముచ్చట్లు:
శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో ప్రస్తుతమున్న అరకొర నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. యాసంగిలో సాగునీటి   అవసరాలను తీర్చేందుకు వీలుగా పకడ్బందీగా వారబందీ ప్రకారం నీటిని విడుదల చేశారు. మిషన్‌  భగీరథ నీటి సరఫరా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన  అవసరం ఉంది. ప్రధాన పైపులైన్లు సజావుగా వేయకపోవడంతో ఒత్తిడి అధికమై భారీగా నీరు వృథా అవుతోంది. లీకేజీలను ఆపేందుకు సత్వరం మరమ్మతులు చేయకపోవడంతో వృథా అధికంగా ఉంటోంది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత పైపులైను వ్యవస్థ, కుళాయిల బిగింపు సాదాసీదాగా చేయడంతో అడపాదడపా నీరు వృథా అవుతోంది. వీటిని చక్కదిద్దాల్సి ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.ఎండలు బాగా పెరగడంతో జలాశయాల్లో ఆవిరి   రూపేణా పెద్దఎత్తున నీరు వృథా అవుతోంది. నిత్యం ఎస్సారెస్పీలో 181 క్యూసెక్కులు, నిజాంసాగర్‌లో 60 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. ఆగస్టు వరకు సర్దుకోవాల్సిందే శ్రీరాంసాగర్‌ నుంచి ఆగస్టు వరకు మిషను భగీరథ అవసరాలకు 1.7 టీఎంసీలు నీరు కావాల్సి ఉంది. ఈ జలాశయం డెడ్‌స్టోరేజి 5 టీఎంసీలు. అంటే ఆగస్టు వరకూ మిషను భగీరథకు సరిపడా నీరు అందుబాటులో ఉంటుంది. డెడ్‌స్టోరేజికి పడిపోతే మిషను భగీరథ పంపుహౌసులకు నీరు అందే పరిస్థితి ఉండదు. నీటి లభ్యత ఉన్న ప్రాంతం నుంచి పంపుహౌసుల వరకు కాల్వలు తవ్వి నీటిని తరలించాల్సి వస్తుంది. ఇలా చేసినా 15 రోజుల పాటు మాత్రమే నీటిని అందించే పరిస్థితి ఉంటుంది. జలాశయంలో డెడ్‌స్టోరేజీకి నీరు పడిపోయినా కాకతీయ కాల్వల ద్వారా తాగునీటిని జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాకు నీటిని విడుదల చేసే వెసులుబాటు ఉంది. అయితే ఈ నీరు మిషను భగీరథకు కాకుండా ఇతర తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతుంది. నీటి నిల్వ డెడ్‌స్టోరేజీ లోపునకు పడిపోతే నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు సరఫరా చేసే ఆస్కారం ఉండదు. ఈ నాలుగు జిల్లాల ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో వరణుడిపై మాత్రం భారం వేయాల్సి ఉంటుంది.  సాధారణంగా ఎస్సారెస్పీకి గణాంకాలను పరిశీలిస్తే ఆగస్టు చివరి వారం తరువాతనే వరదనీరు వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో సెప్టెంబరు తరువాత వరద నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో ఇదే సమయానికి 9.22 టీఎంసీల నీరు ఉండేది. ప్రస్తుతం అరకొర నీరు ఉన్న నేపథ్యంలో ఆగస్టులో వరదనీరు ఎస్సారెస్పీలోకి చేరుకోకుంటే తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆరు నెలల వరకు ఆగాల్సిందే
నిజాంసాగర్‌లో డెడ్‌ స్టోరేజీ పరిమితి లేదు. నీటి నిల్వ పూర్తిగా అడుగంటే వరకూ వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం జలాశయంలో నీరు 2.54 టీఎంసీలు ఉంది. ఆవిరి వృథా పోనూ ఇదే నీరు నిజామాబాద్‌, బోధన్‌ తాగునీటి అవసరాలకు ఆరు నెలలకు పైబడి వరకు సరిపోతోంది. నిజాంసాగర్‌కు నమోదైన వరద గణాంకాలను పరిశీలిస్తే అక్టోబరు చివర్లో, నవంబరు మొదటి వారంలో నీరు వచ్చి చేరింది.  ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీరు నవంబరు వరకు సరిపోతోంది. ఈ సమయంలో వరదలు వస్తే తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండదు. వర్షాలు కురవకపోతే మాత్రం తాగునీటి ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Tags: Do not wait

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *