ఇల్లరికం చేయండి.

భోపాల్ ముచ్చట్లు:
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. రెండు మనసులే కాకుండా రెండు కుటుంబాలు కలిసే అరుదైన ఘట్టం పెళ్లి. ఎన్నో కలలతో నూతన నవ దంపతులు నూతన జీవితంలోకి అడుగుపెడతారు. ఒకరి ఇష్టాయిష్టాలను గౌరవించుకుంటూ అన్యోన్యంగా కలిసిపోతారు. కొన్ని కొన్ని సార్లు దాంపత్య జీవితంలో తలెత్తే చిన్న చిన్న కారణాలు వారి జీవితంలో పెను మార్పులను తీసుకొస్తాయి. ఫలితంగా ఇరువురి మధ్య గొడవలు రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తాజాగా మనస్పర్థల కారణంగా విడిపోయిన జంటను తిరిగి కలిపేందుకు గ్వాలియర్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. భర్త నుంచి వేరుగా ఉంటున్న భార్య పిటిషన్ పై విచారణ చేపట్టి సంచలన తీర్పు ఇచ్చింది. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు భర్త నెలరోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలని ఆదేశించింది. అయినప్పటికీ తీరు మారకపోతే తర్వాత ఆలోచిస్తామని వెల్లడించింది. ఈ తీర్పు ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది.మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని సేవానగర్ కు చెందిన గీతా రజక్, మొరాదా కు చెందిన గణేశ్ కు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు సంతానం. కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి దాంపత్యంలో ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వీరిద్దరి ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. ఈ క్రమంలో గీత తన భర్తను వదిలి వెళ్లిపోయింది. అయితే తమ బిడ్డను ఇచ్చేందుకు గణేశ్ నిరాకరించాడు. కుమారుడు తన వద్దే పెరుగుతాడని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన గీత గ్వాలియర్ హైకోర్టును ఆశ్రయించింది. తన బిడ్డను తన దగ్గరకు చేర్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.తనను మానసికంగా హింసించి, ఇంటి నుంచి వెళ్లగొట్టారని గీతా కోర్టుకు తెలిపింది. తనను అత్తింటి వారు మానసికంగా వేధించారని, వారి వేధింపులు తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని గణేశ్ పేర్కొన్నాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ఒక విచిత్రమైన తీర్పు వెల్లడించింది. గణేశ్ ఒక నెల రోజుల పాటు భార్య ఇంటికి ఇల్లరికం వెళ్లాలని తీర్పునిచ్చింది. అదే విధంగా అల్లుడిని బాగా చూసుకోవాలని గీతా కుటుంబసభ్యులకు సూచించింది. ఫలితంగా దంపతుల మధ్య నెలకొన్న మనస్పర్థలు తొలగిపోతాయని ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది. నెల రోజుల తర్వాత కూడా ఇదే విధంగా ఉంటే తర్వాత ఆలోచిద్దామంటూ హైకోర్టు వివరించింది.
 
Tags:Do the homework

Natyam ad