వైద్యులు లేక..విలవిల..

Date:13/03/2018
మెదక్ ముచ్చట్లు:
ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. పేదలకు సకాలంలో సమర్ధవంతమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా పలు ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది లేమి సమస్యగా మారింది. ప్రధానంగా మెదక్ జిల్లాలో ఈ ఇబ్బంది కొంత అధికంగానే ఉంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది తక్కువగా ఉండడంతో రోగులకు పాట్లు తప్పడంలేదు. జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెదక్‌, నర్సాపూర్‌లో ప్రాంతీయ, రామాయంపేట, తూప్రాన్‌లో సామాజిక ఆసుపత్రులు ఉన్నాయి. కేసీఆర్‌ కిట్‌, 102 సేవలు, ఆధునిక వసతులను కల్పించడంతో ప్రస్తుతం సర్కారీ దవాఖానాలకు వస్తున్న వారి సంఖ్య పెరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రికి నిత్యం 800 పైగానే రోగులు వస్తుంటారు. మొత్తంగా జిల్లాలో వైద్యసేవలు కావాల్సిన వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే అవసరాలకు తగ్గట్టుగా వైద్య సిబ్బంది లేకపోవడం సమస్యాత్మకంగా ఉందని ప్రజలు అంటున్నారు. పలుచోట్ల సమర్ధవంతమైన సేవలు అందని పరిస్థితి ఉందని చెప్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆవశ్యకత అధికంగానే ఉంది. 18 వైద్యుల పోస్టులకు ఐదు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఉన్న డాక్టర్లలో పదిమంది రెగ్యులర్‌ కాగా మరో ముగ్గురు కాంట్రాక్ట్ పై పనిచేస్తున్నారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు మూడు, సివిల్‌ సర్జన్ల పోస్టులు రెండు చొప్పున ఖాళీగా ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా చిన్నపిల్లల వైద్యుడు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చాలాకాలంగా చెప్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరతపై ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇటీవలే స్పందించారు. మెదక్ పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడు నెలల్లో టీఎస్‌పీఎస్‌సీ, ఆరోగ్యశాఖల ద్వారా 10 వేల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. మంత్రి ప్రకటించినట్లే వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమిస్తే ప్రజలకు సమర్ధవంతమైన వైద్య సేవలు లభిస్తాయి.
Tags: Doctors or ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *