గులాబీకి తలనొప్పిగా మారిన డబుల్ ట్రబుల్

Date:15/02/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ‌లో డ‌బుల్‌బెడ్‌రూం ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకునేలా ఉంది. ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్న వేళ ప్ర‌జ‌ల్లోకి వెళితే డ‌బుల్‌బెడ్‌రూంల గురించి అడిగితే ఎలా స్పందించాలో అర్ధంకాక ప్ర‌జాప్ర‌తినిధులు త‌ల‌లు బాదుకుంటున్నారు. ఇక మంత్రుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి సొంత జిల్లా అయిన నిర్మల్లో కూడా డబుల్‌ బెడ్‌రూం పథకంలో ఆశించిన ప్రగ‌తి క‌నిపించడ‌ం లేదు. మంత్రి జిల్లాలోనే ఒక ఇంటిని కూడా నిర్మించ‌లేకపోయారు అంటూ తీవ్ర విమ‌ర్శలు వచ్చాయి. దీంతో ఈ అంశాన్ని ఇంద్రకరణ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన స్వగ్రామమైన నిర్మల్ మండ‌లంలోని ఎల్లపెల్లిలో గ‌త ఏడాది డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. స‌ర్కారు ఇచ్చే నిధులు స‌రిపోకున్నా.. ఏవో తంటాలు ప‌డి గ్రామంలో 45 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ప్రస్తుతం ఇవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. ఎన్నిసార్లు టెండ‌ర్లు పిలిచినా కాంట్రాక్టర్లు స్పందించ‌డం లేదు. దీంతో ఈ వ్యవ‌హారం మంత్రి ప్రతిష్టకు స‌వాల్‌గా మారింది. వాస్తవానికి నిర్మల్‌ జిల్లాలో దాదాపు 3,360 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,240 ఇళ్లు, అర్బన్ ప్రాంతాలైన నిర్మల్, భైంసా మునిసిపాలిటీల్లో 1,120 ఇళ్ల నిర్మాణం చేప‌ట్టాలనుకున్నారు. అయితే ఇప్పటివ‌ర‌కు గ్రామీణప్రాంతాల్లో 1,820 ఇళ్లు, ప‌ట్టణ ప్రాంతాల్లో 806 ఇళ్లు మంజూరుయ్యాయి. ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ పూర్తయింది. ల‌బ్ధిదారుల ఎంపిక జ‌ర‌గాల్సి ఉంది. ఈ క్రమంలో ఇంకా కాంట్రాక్టర్లు, టెండ‌ర్లు అని చూస్తూ కూర్చుంటే మ‌రిన్ని విమ‌ర్శలు తప్పవని మంత్రి భావిస్తున్నారు. పథకాన్ని సాకారం చేసేందుకు త‌నదైన శైలిలో చ‌క్రం తిప్పుతున్నారు. కొద్ది రోజుల కింద‌ట జిల్లాలో డ‌బుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై అధికారుల‌తో సుదీర్ఘ స‌మీక్ష జ‌రిపారు. అధికారుల అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధుల‌తో ఇళ్ల నిర్మాణం జ‌ర‌గ‌ని ప‌ని అనీ, ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావ‌డం లేద‌నీ కొంద‌రు అధికారులు మంత్రికి నివేదించారు. అయితే ఈ ప‌థ‌కం అమ‌లుకు ఎలాంటి చ‌ర్యలు తీసుకోవాలో చెప్పండి అంటూ అధికారులను మంత్రి అడిగారట. చివ‌రికి బ‌డా కాంట్రాక్టర్లను ఏదో విధంగా ఒప్పిస్తే కొన్ని ఇళ్లు అయినా నిర్మించ‌వ‌చ్చని సమష్టిగా ఒక అవగాహనకి వచ్చారట. ఆలోచ‌న వ‌చ్చిందే త‌డ‌వుగా జిల్లాలో భారీ కాంట్రాక్టులు చేప‌డుతున్న కాంట్రాక్టర్ల చిట్టా తీశారు. ఆయా కాంట్రాక్టు సంస్థల స్థాయికి త‌గ్గట్టుగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ బాధ్యత‌లు అప్పగించాల‌ని నిర్ణయించారు. ఇప్పటికే ఎంపికచేసిన గ్రామాల్లో కార్పొరేట్ ప్రమాణాలు కలిగిన కాంట్రాక్టర్లచే ఇళ్లనిర్మాణం చేప‌ట్టడంతో పాటు వారికి అవ‌స‌ర‌మైన స్టీలు, ఇసుక, సిమెంటు త‌దిత‌ర ముడిస‌రుకులను రాయితీపై అందించాల‌ని నిర్ణయించారట‌. ఈ ప్రకారం జిల్లాలో ప్రాణ‌హిత‌- చేవెళ్ల హైలెవ‌ల్ కెనాల్‌ను నిర్మిస్తున్న సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి నిర్మల్, సారంగాపూర్ మండ‌లాల్లో డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ బాధ్యతల‌ను అప్పగిస్తున్నార‌ట‌. మామ‌డ, నిర్మల్ ప‌ట్టణంలోని బంగాల్‌ పేట్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యత‌ల‌ను స‌ద‌ర్‌మాట్ ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్టిన సిరి ఇన్‌ఫ్రా కంపెనీకి క‌ట్టబెట్టార‌ట‌. కుభీర్ మండ‌లంలోని ఇళ్ల నిర్మాణ బాధ్యత‌లను భ‌వాని క‌న్‌స్ట్రక్షన్ కంపెనీకి, నిర్మల్‌లోని సిద్ధాపూర్‌లో ఇళ్ల నిర్మాణ‌ బాధ్యత‌ను స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించనున్నార‌ట‌. అలాగే మిగ‌తా మండ‌లాలు, ప‌ట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణ బాధ్యత‌ను మ‌రికొన్ని సంస్థల‌కు ఇవ్వాల‌ని యోచిస్తున్నార‌ట‌. ఇళ్ల నిర్మాణానికి ముందుకు వ‌చ్చేవారికి క‌లిగే న‌ష్టాన్ని ఇత‌ర కాంట్రాక్టుల‌ను అప్పగించ‌డం ద్వారా పూడ్చేలా ప్రణాళిక‌ను సిద్ధంచేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదే ప‌నిగా టెండర్లు పిల‌వ‌డం.. కాంట్రాక్టర్లు ముందుకు రాక‌పోవ‌డంతో ప‌రువుపోతోంద‌నీ.. ఇకనుంచి ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు వ‌స్తేనే టెండ‌ర్లు పిల‌వాల‌నీ నిర్ణయించారట‌.
Tags: Double Trouble turned into a headache

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *