పరువు హత్యలదే ప్రథమ స్థానం…

హైదరాబాద్‌ ముచ్చట్లు:

పరువు హత్యలలో మన దేశానిదే అగ్రతాంబూలం. మనమంతా ఆధునిక ప్రపంచానికి ప్రతినిధులుగా ఉన్నా మహిళలను వేధించడంలో మాత్రం తగ్గలేకపోతున్నాం. విశ్వమంతా విహరిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. కానీ, నేటికీ, కులం, మతం, ఆర్థిక అంతరాలు, ఆడపిల్లలకు ఆంక్షలు విధించే సామాజిక స్థితిలోనే మనమున్నాం. పరువు కోసం కన్న బిడ్డలను హత్య చేస్తున్న ఆటవిక సంస్కృతినే కొనసాగిస్తున్నాం. ఈ సంస్కృతి ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితమై లేదు. ప్రపంచంలోని చాలా దేశాల్లో వీటి విషబీజాలు బలంగా వేళ్లూనుకుని పోయాయి. ఏటా వేల సంఖ్యలో జరుగుతున్న పరువు హత్యలపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరువు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను, తోబుట్టువులు తమ రక్తం పంచుకుపుట్టిన వారి ఉసురు తీస్తున్నారు. ఇలా ఏటా వేల సంఖ్యలో జరుగుతున్న పరువు హత్యల్లో కన్నవారు, తోబుట్టువులు కాలయముళ్లుగా మారుతున్నారు. ఈ క్రమంలో జరిగిందే అరుషి హత్య. ఆరుషి బతికుంటే ఇప్పటికి 19ఏళ్ల యువతిగా నవ్వుతూ తుళ్లుతూ తిరిగేది. కాలేజీ చదువులతో, కెరీర్‌ పునాదుల్లో బిజీగా ఉండేది. కానీ, ఒకానొక రాత్రి ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ మృతిపై కోర్టులో విచారణ సుదీర్ఘ కాలం సాగింది. చంపింది తల్లిదండ్రులే అని సిబిఐ కోర్టు తేల్చింది. కానీ, నేలమీద నడిస్తే పాదాలు కందిపోతాయనుకుంటూ, అల్లారుముద్దుగా పెంచుకునే తల్లిదండ్రులు తమ కూతుర్ని చంపగలరా? కన్న ప్రేమను దాటి కూతుర్ని చంపుకునే బలమైన కారణాలుంటాయా? అని అనిపించక మానదు. కానీ అటువంటి కారణాలు ఉన్నాయని అనేక ఘటనలు కళ్లముందు కనిపిస్తుంటే ఒప్పుకోవాల్సిన స్థితి. అది ప్రేమ వ్యవహారం కావచ్చు. మరో వ్యక్తితో సంబంధం కావచ్చు. అది ఎలాంటిదైనా, నిజంగా ఆ వ్యక్తి జీవితానికి నష్టం కలిగించేది అయినా, చంపేంత కారణం మాత్రం కాదు కదా! ఢిల్లీలో జర్నలిస్ట్‌ నిరుపమ. తూర్పుగోదావరి జిల్లాలో నందిని శిరీష. బాలానగర్లో మాధవి. అమ్రాబాద్లో రాజేశ్వరి. 2012 మే 19న కడప జిల్లాలో ఎఈవో లలిత. 2013 మార్చి 7న వరంగల్‌ జిల్లాలో పద్మ. ఇక ఉత్తరభారతంలో ఎందరో లెక్కేలేదు. వీళ్లంతా ప్రేమకోసం కుల హద్దులను చెరిపేసినవారు. మత కట్టుబాట్లను తెంచుకున్నవారు. ఇందుకు ఫలితం. వీరంతా అత్యంత దారుణంగా కన్నవారి చేతుల్లో, తోబుట్టువుల చేతుల్లో పరువు కోసం హత్యలకు గురయ్యారు. అయితే, ఆరుషి ఘటనకు వీటికి చూడ్డానికి చాలా భేదం ఉంది. కానీ, అంతర్లీనంగా కనిపించే సామ్యం ఒకటే. కూతురి బిహేవియర్‌ తమకు నచ్చకపోవటం, లేదా అది బైటికి తెలిస్తే సమాజం ముందు తలెత్తుకోవటం ఎలా అనే భావం కావచ్చు. ఇదే పరువు హత్యలకు ముఖ్య భూమికలుగా మారుతున్నాయి. 2008 మే 15 రాత్రి పది గంటలకు డ్రైవర్‌ ఉమేష్‌ ఆరుషిని ఆమె తల్లిదండ్రులతో చివరిసారి చూశాడు. రాత్రి 10 గంటలకు డిన్నర్‌ పూర్తి చేసుకున్న తర్వాత తల్వార్‌ దంపతులు ఆరుషి బెడ్‌ రూం లోకి వెళ్లి కెమెరాను గిఫ్ట్‌ గా ఇచ్చారు. ఆ రోజు ఆరుషి తన తల్లిదండ్రులిచ్చిన గిఫ్టెడ్‌ కెమెరాతో చాలా ఫోటోలు తీసుకుంది. అనంతరం ఆమె రూమ్‌ కు వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు కూడా తమ బెడ్‌ రూంకు వెళ్లిపోయారు. 2008 మే 15 రాత్రి ఆరుషి హత్యకు గురయింది. 2008 మే 16న ఆరుషి మంచంపై శవమై పడి ఉంది. రాజేష్‌, నుపూర్‌ లు ఏడుస్తున్నారు. పనిమనిషి ఆరుషి గొంతు కోసి ఉన్నట్లు గుర్తించింది. ఆరుషి హత్యకు హేమ్‌ రాజే కారణమై ఉంటాడని డాక్టర్‌ దంపతులు పోలీసులకు చెప్పారు. ఈ కోణంలో దర్యాప్తు మొదలైంది. తెల్లవారే సరికి ఈ జంట హత్యల చుట్టూ రకరకాల కథలు అల్లుకున్నాయి. మొదట్లో ఈ కేసును ఉత్తరప్రదేశ్‌ పోలీసులు చేపట్టగా, ఆ తర్వాత సిబిఐకి అప్పగించారు. 2013 నవంబర్‌ 25న ఈ జంట హత్యలపై 15 నెలల పాటు సిబిఐ విచారణ జరిపింది. 84 మంది సాక్షులను విచారించింది. హేమరాజ్‌ ను, ఆరుషిని తల్వార్‌ దంపతులు హత్య చేశారని, సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం కూడా చేశారని సిబిఐ ఆరోపించింది. బలమైన సాక్ష్యాధారాలను సేకరించడంలో విఫలమయ్యామని కూడా చెప్పింది. సిబిఐ కోర్టు తల్వార్‌ దంపతులు దోషులేనని నిర్థారించింది. 2013 నవంబర్‌ 26న జంట హత్య కేసులో రాజేష్‌ తల్వార్‌, నూపూర్‌ దంపతులను దోషులుగా నిర్ధారించిన సిబిఐ కోర్టు జీవితఖైదు శిక్షను ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సీబీఐ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను అలహాబాద్‌ హైకోర్టులో సవాలు చేస్తామని తల్వార్‌ దంపతుల తరఫు న్యాయవాదులు అంటున్నారు. రాజేశ్‌ దంపతులను కావాలని ఇందులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. విచారణ మొదలైన కొన్ని గంటల్లోనే మరో మర్డర్‌ వెలుగు చూసింది. ఆరుషిని హత్య చేసి ఉంటాడని అనుమానించిన హేమ్‌ రాజ్‌ కూడా నిర్జీవంగా కనపడ్డాడు. బిల్డింగ్‌ టెర్రస్‌ పై అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీంతో జంటహత్యలపై దర్యాప్తు చేసిన పోలీసులకు మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఆరుషి, హేమ్‌ రాజ్‌ ఒకే సమయానికి ఒకే ఆయుధంతో హత్య చేయబడినట్లు ఫోరెన్సిక్‌ రిపోర్టులో వెల్లడైంది. నోయిడా పోలీసులు ఆరుషి తండ్రి రాజేష్‌ ను అరెస్ట్‌ చేశారు. అనంతరం సరైన ఆధారాలు లేవంటూ ఈ కేసును సిబిఐకి అప్పగించారు. పోస్ట్‌ మార్టం నివేదిక ప్రకారం ఆరుషి, హేమ్‌ రాజ్‌ హత్యలు అర్థరాత్రి పన్నెండు, ఒంటి గంట మధ్య జరిగాయి. ఇద్దరూ ‘వి’ ఆకాలంలో ఉన్న ఆయుధంతోనే దాడికి గురయ్యారు. అయితే ఆ ఆయుధాన్ని పోలీసులు కనుక్కోలేకపోయారు. ఆరుషి హత్యకు గురైన బెడ్‌ రూంలో పడకపైన, ఫ్లోర్‌ పైన రక్తపు మరకలు ఉన్నాయి. పిల్లోపైన, బెడ్‌ రూం డోర్‌ పైన కూడా రక్తపు మరకలు కనిపించాయి. దీన్ని బట్టి సిబిఐ టీం ఇంకో నిర్థారణకు వచ్చింది. హత్య చేసిన తర్వాత ఆమెను బెడ్‌ పైన పడేశారని భావించింది. బెడ్‌ పైన బాధితురాలు పెనుగులాడినట్లు ఎలాంటి ఆనవాళ్లూ కనిపించలేదు. ఈ ఆధారాలను బట్టి వేరొక చోట హత్య చేసి బెడ్‌ రూంలో హత్య జరిగినట్లు క్రియేట్‌ చేశారని సిబిఐ అధికారులు కనిపెట్టారు. హేమరాజ్‌ మృతదేహాన్ని టెర్రస్‌ పై 20 అడుగుల దూరం లాక్కెళ్లారు. ఎసి యూనిట్‌ వద్ద హత్య జరిగితే అక్కడి నుండి టెర్రస్‌ పైకి లాక్కెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు రాజేష్‌ మాటలతో మధ్యలో విష్ణుశర్మను అనుమానించినా, ఆధారాలు కనిపించలేదు. దీంతో రాజేశ్‌ కంప్యూటర్‌ ని, ఆరుషి లాప్‌ టాప్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వివరాలను పరిశీలించారు. తర్వాత ఆరుషికి, ఆమె తండ్రి రాజేష్‌ కు మధ్య విబేధాలున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు తల్వార్‌ దంపతులపైనే అనుమానం వచ్చింది. అంతేకాదు, రాజేష్‌ క్లినిక్‌ లో అసిస్టెంట్‌ గా పనిచేసే కృష్ణపై కూడా అనుమానం వ్యక్తం అయింది. కృష్ణతో పాటు అతడి ఇద్దరు స్నేహితులను విచారించిన పోలీసులు హత్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు వారివద్ద దొరకలేదని తేల్చారు. రాజేష్‌ కు మరో డాక్టర్‌ తో సంబంధం ఉందని కృష్ణ పోలీసు విచారణలో చెప్పాడు. ఈ విషయం ఆరుషికి తెలియడంతోనే వారిద్దరి మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆరుషిని చంపి, సాక్షిగా ఉన్న హేమరాజ్‌ నూ రాజేష్‌ చంపాడని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆరుషి, హేమరాజ్‌ అభ్యంతరకర పరిస్థితుల్లో రాజేష్‌ కు కనిపించారని, దీంతో కోపం పట్టలేక రాజేష్‌ వారిద్దరినీ హత్య చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ విచారణలో మొదటి నుండి తల్వార్‌ దంపతుల ప్రవర్తన, చర్యలపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. రకరకాల కథనాలు చెప్పడం, మర్డర్‌ స్పాట్‌ ను క్లీన్‌ చేయడం, పోస్ట్‌ మార్టం డాక్టర్లను మేనేజ్‌ చేయాలని చూసినట్లు ఆరోపణలు రావడం, ఆరుషి రూం పక్కనే ఉన్నా హత్య జరగడం తెలియదనడం తదితర అంశాలు తల్వార్‌ దంపతులను అనుమానించేలా చేశాయి. ఆరుషిని, హేమరాజ్‌ ను తల్వార్‌ దంపతులే చంపారని సిబిఐ ఆరోపించింది. ఇదే విషయాన్ని సిబిఐ కోర్టు నిర్థారించింది. హానర్‌ కిల్లింగ్‌ (పరువు హత్యలు) దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలను సైతం కలవరపెడుతున్న పదం. ముఖ్యంగా ఇంకా చాంధసభావాలతో, కట్టుబాట్ల మధ్య బతికే భారత్‌ లాంటి అనేక సంప్రదాయ దేశాల్లో హానర్‌ కిల్లింగ్స్‌ ఏటా వందల సంఖ్యలో జరిగిపోతూనే ఉన్నాయి. కులం, మతం, ధనం, పేద, ధనిక అనే కట్టుబాట్లు మధ్య పరువు ప్రతిష్ట అనే నేపథ్యంలో గౌరవమైన హత్యలు యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి. వేరే మతం వారినో, కులం వారినో ప్రేమించినందుకో, పెళ్లి చేసుకున్నందుకో జరిగే ఘటనలు చాలా ఉన్నాయి. ఆరుషి హత్యలో అంతర్లీనంగా ఉన్న అంశం పరువు మాత్రమే అని భావిస్తున్నారు. దేశంలో నిత్యం పరువు కోసం అనేక హత్యలు జరుగుతున్నాయి. కులాన్ని కాదన్నందుకో, మతం కాదన్నందుకో తల్లిదండ్రులు, తోడబుట్టినవాళ్లు కత్తులు కటార్లతో తెగబడుతున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఓ ఘటన కోల్‌ కతాలో జరిగింది. గ్రాఫిక్‌ డిజైన్‌ ఇన్‌ స్ట్రక్టర్‌ గా పనిచేస్తున్న రిజ్వాన్‌ స్టూడెంట్‌ ప్రియాంక ప్రేమలో పడ్డాడు. రిజ్వాన్‌ సాధారణ కుటుంబానికి చెందినవాడు కాగా ప్రియాంక ఓ పారిశ్రామికవేత్త కూతురు. పెద్దలకు చెప్పకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రిజ్వాన్‌ ఇంట్లో కాపురం పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రియాంక పేరెంట్స్‌ పోలీసుల సహకారంతో కూతుర్ని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి రిజ్వాన్‌ కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఓరోజు రిజ్వాన్‌ రైలు పట్టాలపై శవమై కనిపించాడు. రిజ్వాన్‌ ది ముమ్మాటికి హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపించినా పట్టించుకునేవారెవరు? ప్రేమకు అడ్డం పరువే కాదు, సమాజంలోని కట్టుబాట్లు కూడా ప్రేమికుల పాలిట శాపంగా మారాయి. ఒకే గోత్రానికి చెందిన వారు పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. ఎందుకంటే సోదర సోదరి వరుస అవుతారని భావన. తెలుగునాట కూడా ఈ ఆచారం అమలులో ఉంది. ఝాట్‌ కులానికి చెందిన మనోజ్‌, బబ్లి లు ప్రేమ పెళ్లి చేసుకుని భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కారణంతో బబ్లి బంధువులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గ్రామ పెద్దల పంచాయితీలో కూడా దీన్ని వ్యతిరేకించారు. ప్రేమికులు కోర్టు నుంచి ప్రొటెక్షన్‌ తీసుకున్నా వారికి రక్షణ దొరకలేదు. ప్రేమికుల్ని దారుణంగా చంపేశారు. ఇదో రకంగా పరువు హత్య లాంటిదే. నిన్నామొన్నటిదాకా ప్రేమకు కులం అడ్డుగోడయ్యేది. కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి తమిళనాడులో కుల ప్రాబల్యంతో పాటు స్థానిక రాజకీయ నేతల జోక్యం పెరిగిపోయింది. ధర్మపురి జిల్లాలో వేర్వేరు కులాలకు చెందిన దివ్య, ఇళవరశన్‌ లు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్న ఈ ప్రేమ జంట దూరంగా మరోచోట కాపురం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఓరోజు ఇళవరశన్‌ శవమై తేలాడు. ఆధునిక జీవన శైలిలో మార్పులు, సామాజిక విలువల పతనమే ఈ పరువు హత్యలకు కారణం. పిల్లల పెంపకాన్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం, సంపాదనపైనే దృష్టి సారించటం, విలాసాలకు వినోదాలకు ప్రాధాన్యం ఇవ్వటం, కుటుంబ సంబంధాలు తగ్గుముఖం పట్టడంతో, నైతిక విలువలు దిగజారుతున్నాయని సామాజిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనందున పిల్లల ఇంటర్నెట్‌ వినియోగం హద్దులు దాటుతోంది. పోర్న్‌ వెబ్‌ సైట్లు, సోషల్‌ సైట్లలో విపరీత పోకడల దుష్ప్రభావం టీనేజ్‌ యువతపై తీవ్రంగా ఉంటోంది. ఇలాంటి నేపధ్యం నుండే ఆరుషి హత్యకు దారి తీసిన కారణాలు వచ్చి ఉంటాయని విశ్లేషకుల భావన. ప్రాణాలు ఎవరూ తిరిగి తీసుకురాలేనివి. ఆరుషి మరణానికి కారణమైన సమాజపు పోకడలే ఈ హత్యకు కారణం. ఇప్పుడు పోయింది సమాజపు పరువు మాత్రమే.

Tag : Dowry murder is the first place …


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *