Drinking water

తీరనున్న తాగునీటి కష్టాలు!

Date:25/04/2018
నాగర్‌కర్నూల్‌ ముచ్చట్లు:
తెలంగాణ వాసుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించాలన్నది సర్కార్ టార్గెట్. ఈ లక్ష్యం మేరకు రాష్ట్రవ్యాప్తంగా పైప్ లైన్ పనులు జోరుగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రయల్ రన్స్ కూడా ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల అయితే నీటి సరఫరా సైతం సాగుతోంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ పూర్తైతే రాష్ట్రవాసులకు తాగునీటి సమస్యలు తొలగిపోతాయనే అంతా భావిస్తున్నారు. ఇదిలాఉంటే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ట్రయల్ రన్ కు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరుకు మిషన్‌ భగీరథ సన్నాహక పరీక్షను  ప్రారంభించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. మే నెలాఖరుకు అన్ని గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం పూర్తి చేసి సన్నాహాక పరీక్షలు విజయవంతం చేయటానికి అధికారులు పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీటి కోసం అంతా ఎదురుచూస్తున్నారు.
నాగర్‌కర్నూల్‌తో పాటూ వనపర్తి, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాలకు తాగునీరు సరఫరాకు కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు సమీపంలో మిషన్‌ భగీరథ హెడ్‌వర్క్సు ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మించారు. ప్రస్తుతం ఇది ప్రారంభానికి సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 3,200 గ్రామాలు, పట్టణాలకు శాశ్వత తాగునీటిని అందించేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారు. ఈ పనులను 2018 నవంబరు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇదిలా ఉంటే మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఎల్లూరు జలాశయం నింపుకొని మిషన్‌ భగీరథకు సరఫరా చేయాలని అధికారులు మొదట్లో భావించారు. ఈ రిజర్వాయరు సామర్థ్యం 0.350 టీఎంసీలు మాత్రమే ఉంది. మిషన్‌ భగీరథకు 7 టీఎంసీల నీరు అవసరం. ఎల్లూరులో ఇపుడు నిల్వ చేసుకున్న నీరు కేవలం 10 రోజులకు మాత్రమే సరిపోతుందని తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా ఎప్పటికప్పుడు నీటిని తోడుకుందామంటే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ అడుగంటిపోతోందని అధికారులు అంటున్నారు. దీంతో అధికారులు కూడా సన్నాహక పరీక్షలు ముగించి, వర్షాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఏదేమైనా నాగర్‌కర్నూల్‌లో మిషన్ భగీరథ పనులు కొలిక్కి రానుండడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తాగునీటి సమస్యలకు తెరపడుతుందని అంటున్నారు.
Tags:Drinking water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *