రైతులకు చుక్కలే.. 

Date:15/02/2018
మచిలీపట్నం ముచ్చట్లు:
 మద్దతు ధర పొందాలని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించటానికి వెళ్లే డెల్టా ప్రాంత రైతులకు చుక్కెదురవుతోంది. ఇప్పటికే వారి పేరిట విక్రయించినట్లు ఉందని సిబ్బంది ఇస్తున్న సమాధానంతో  విస్తుపోతున్నారు. అంతర్జాలంలో నమోదై ఉన్నందున కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తుండటంతో గగ్గోలు పెడుతున్నారు. వరి కోత కోసి గూళ్లు వేసి మాగబెట్టిన అనంతరం ఇప్పుడు నూర్పిడి చేసి ఇంటికి తెచ్చిన ధాన్యం ఎక్కడ విక్రయించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళారుల దోపిడీని కట్టడి చేస్తూ ఆరుగాలం శ్రమించిన పంట సాగు చేసిన అన్నదాతలకు మద్దతు ధర కల్పించటం కోసం ఈసారి ముందుగానే మేల్కొన్న ప్రభుత్వం నవంబరు మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. పశ్చిమకృష్ణా పరిధిలోని గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో డిసెంబరు నెలాఖరు నాటికి ధాన్యం నూర్పిడి ప్రక్రియ పూర్తి చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా బీపీటీ రకం సాగు చేయటంతో కుటుంబ అవసరాల నిమిత్తం పోనూ మిగిలిన ధాన్యాన్ని  సంక్రాంతి నాటికి విక్రయాలు పూర్తి చేశారు. డెల్టా ప్రాంతమైన తూర్పుకృష్ణాలో వరి కోతలు, నూర్పిడి ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. వరి కోతలకు ముందే రబీ సీజన్‌లో భాగంగా మినుము విత్తనాలు చల్లి, కోసిన వరి పంటను గూళ్లుగా వేసి మాగబెట్టారు. సంక్రాంతి అనంతరం డెల్టా ప్రాంతంలో ఊపందుకున్న నూర్పిడి ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంటికి చేరిన ధాన్యాన్ని విక్రయించటానికి కొనుగోలు కేంద్రాలకు వెళ్తే నిరాశే మిగులుతోంది. లక్ష్యం మేరకు సేకరణ పూర్తయిందని గత నెల కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ నిలిపివేయటంతో రైతుల ఆందోళన బాటపట్టారు. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ చివరకు రోడ్డెక్కారు. ప్రభుత్వ సూచనల మేరకు  ఎక్కడైనా ధాన్యం విక్రయించుకొనే వెసులుబాటు కల్పిస్తూ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఉత్తర్వులు జారీ చేయటంతో తిరిగి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది.డిసెంబరు మొదటి వారం నాటికి జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 3,324 మంది రైతుల నుంచి రూ.68.55 కోట్ల విలువైన 43,388.640 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా రెండు నెలల వ్యవధిలో 55,526 మంది నుంచి రూ.898.62 కోట్ల విలువైన 5,66,155.360 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసినట్లు ఉన్న గణాంకాలు అనుమానాలకు తావిస్తోంది. ప్రారంభంలో 330 కేంద్రాలకు 86 మాత్రమే చురుగ్గా పనిచేస్తున్నట్లు అధికారులే వివరాలను వెల్లడించారు. అలాంటిది ముందస్తు నూర్పిడి జరిగిన పశ్చిమకృష్ణాలో పూర్తిస్థాయిలో సేకరించినా, ఇప్పుడు నూర్పిడి జరుగుతున్న తూర్పుకృష్ణాలో లక్ష్యం మేరకు ఎలా సేకరించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏఏ రైతు వరి పంట పండిస్తున్నారో, ఎంత విస్తీర్ణంలో పంట వేశారనే వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈక్రాప్‌  విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు ఆయా పొలాలను చిత్రాలు తీసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం నమోదులో వ్యవహరించిన నిర్లక్ష్యంతో ఒక రైతుకు కేటాయించిన ఐడీల్లోనే  ఇద్దరు, ముగ్గురి పొలాలకు సంబంధించిన సర్వే నంబర్లు నమోదు చేశారు. ఒక రైతు ధాన్యం విక్రయిస్తే మిగిలిన వారికి విక్రయించటానికి లేకుండా పోతుంది.  ఈక్రాప్‌లో వివరాలు మార్పు చేయాల్సింది వ్యవసాయాధికారులేనని రెవెన్యూ అధికారులు తేల్చటంతో అన్నదాతలు వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు.
Tags: Duck farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *