కేసులతో తాగుబోతులకు చుక్కలు

Date:12/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం, చాలాన్లు విధించడం, అవసరమైతే జైలుకు పంపడం వంటి చర్యలూ తీసుకుంటున్నారు. ప్రతి రోజూ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో అనేక మంది పట్టుబడుతున్నారు.హైదరాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల్లోనే 630 మందిపై పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. వారిని ఎర్రమంజిల్‌ 3వ-4వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్ల ఎదుట హాజరుపర్చారు. వీరిలో 125 మందికి రెండు రోజుల నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించారు. 33 మంది లైసెన్స్‌లను రద్దు చేశారు. రూ.11,80,600 జరిమానా విధించారు.ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చలాన్‌ విధిస్తున్నారు. అయితే కొందరు చలాన్‌ చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు వారికి తిరిగి పెనాల్టీ చలాన్‌ విధించడంతోపాటు కోర్టులో ప్రవేశపెడుతున్నారు. చలాన్‌ చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన 42 మందికి తాజాగా జైలు శిక్ష విధించారు. వీరిలో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేసి పట్టుబడిన వారు 14 మంది ఉండగా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన వారు 13 మంది, ర్యాష్‌డ్రైవింగ్‌ చేసిన నలుగురు, ట్రాఫిక్‌ నిబంధనలు పట్టించుకోని వారు 11 మంది ఉన్నారు. అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుడిన 33 మంది వాహనదారుల లైసెన్స్‌లను రద్దు చేశారు. వారిలో నలుగురి లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దయ్యాయి. మరో నలుగురి లైసెన్స్‌లు రెండేండ్ల పా టు, ఒకరి లైసెన్స్‌ ఏడాది, మరో 23 మంది లైసెన్స్‌లు మూడు నెలల పాటు రద్దు చేశారు. లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ డాక్టర్‌ రవీందర్‌ తెలిపారు.
Tags: Ducks for drunkards with cases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *