Ensure Balyam through education: Udayalakshmi

విద్య ద్వారానే బాల్యానికి భరోసా: ఉదయలక్ష్మి

Date: 05/01/2018

ఏలూరు ముచ్చట్లు:

ప్రతీ ఒక్కరూ తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించి వారి భవితకు భరోసానివ్వాలని ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి బి. ఉదయలక్ష్మి అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 37వ డివిజన్‌ చేపల తూము సెంటర్‌లో కార్పోరేటర్‌ భీమవరపు హేమసుందరి అధ్యక్షతన శుక్రవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జితో కలిసి ఉదయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధికి, జీవిత ఉన్నతికి విద్యే మార్గమన్నారు. ప్రతీ ఒక్కరికీ మెరుగైన విద్యనందించేందుకు ఏటా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు. ముఖ్యంగా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారికి భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విద్యాభోధన అందిస్తున్నామని అంతేకాకుండా ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేకుండా ఉచితంగా రెండు జతల యూనిఫారం, మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మరోపక్క సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల్లోని ఆడపిల్లలు కోసం కస్తూరిభాయి గాంధీ విద్యాలయాల ద్వారా ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకూ ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలలో నాణ్యమైన రెసిడెన్షియల్‌ విద్యను అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా అమ్మాయి 10వ తరగతి పూర్తయితే చాలని పెళ్లిచేసి ఒక అయ్యచేతులో పెట్టేస్తే బాధ్యత తీరిపోతుందని అనుకోవద్దని ఉదయలక్ష్మి అన్నారు. ఆడపిల్లలను చదివిస్తే వారు ఆకుటుంబాలకు ఆసరాగా నిలబడడంతోపాటు ఉన్నత చదువు అయిన తర్వాత వివాహాలు చేస్తే ఆరోగ్యంగా కూడా ఉంటారన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి కోట రామారావు (బుజ్జి) మాట్లాడుతూ చదువుకుంటే ఉన్నతస్ధితికి రావడంతోపాటు ఆకుటుంబ ఆర్ధికపరిస్ధితిలో మార్పు వస్తుందన్నారు. విద్య పొందడం ద్వారా పదిమందికి ఉపయోగపడతామన్నారు. ఈదృష్ట్యా ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్ధులకు ఎన్నో ప్రయోజనాలు ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రయివేట్‌ పాఠశాలల్లో కేవలం శిక్షకులకు కేవలం 10 వేలు మించి వేతనాలు ఉండవని అదే ప్రభుత్వ పాఠశాలల్లో నియమించే ఉపాధ్యాయుల ఎంపికలో వారి విద్యార్హతలు వారి నైపుణ్యాన్ని గుర్తించి ఎంపిక చేయడం జరుగుతుందని తద్వారా అనుభవజ్ఞులైన శిక్షణ పొందిన ఉపాధ్యాయలు పాఠశాలల్లో ఉంటారన్నారు. ప్రతీ తల్లీ-తండ్రీ తమ పిల్లలను క్రమంతప్పకుండా పాఠశాలలకు పంపించాలని ఆయన హితవు పలికారు. పాఠశాల బాలబాలికలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలను కూడా అందిస్తున్నామన్నారు. ఏలూరు కార్పోరేషన్‌ పరిధిలో బాగా చదివే విద్యార్ధులకు 12 పంపుల చెరువు మున్సిపల్‌ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో ఎంతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను నియమించి విద్యాభోధన అందిస్తున్నామన్నారు. ఉన్నత విద్య చదివేందుకు విదేశాలకు వెళ్లే పేదవిద్యార్ధులకు 10 లక్షల వరకూ ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. తాను కూడా ఇంటర్‌లో 8.5 పైబడి మార్కులుతెచ్చుకుని ఉన్నత చదువుకునే విద్యార్ధినీ విద్యార్ధులకు 5 వేల రూపాయలు చొప్పున ప్రతీ ఏటా ఆర్ధిక సహాయం అందిస్తున్నానని గతేడాది 20 లక్షల రూపాయలు అందించానన్నారు. చదువు విషయంలో ఎటువంటి అశ్రద్ధ చేయకుండా తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. తాత్కాలిక అవసరాలు కోసం పిల్లలను చదివించకుండా పనుల్లో పెట్టవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుజ్జి హితవు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంకోసం అమలు చేస్తున్న చంద్రన్న బీమా, పెన్షన్ల మంజూరు, తదితర అంశాలను వివరించారు. నగరమేయరు షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఉన్న అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కోటి రూపాయలు కేటాయించామన్నారు. నగరంలో గుర్తించిన 7 నగరపాలకసంస్ధ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ప్రారంభించడంతోపాటు వంటషెడ్డు, సైకిల్‌ స్టాండ్‌, ఆటస్ధలం అభివృద్ధి తదితర ఎన్నో కార్యక్రమాలను చేసామన్నారు. 10వ తరగతి ఫలితాల్లో మంచి విజయాలను సాధించాలనే ఉద్ధేశ్యంతో ఆతరగతి విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారికి అల్పాహారం, తదితరాలను అందిస్తున్నామన్నారు. ఏలూరు నగరంలో రోడ్లు, డ్రైయిన్లు, యల్‌ఇడి బల్భ్‌లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలను 150 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నామన్నారు. ఏలూరు నగరంలో 18 వేలమందికి వృద్ధాప్య, వితంతు, తదితర పెన్షన్లు అందిస్తున్నామని ఇంకా అర్హులైనవారుంటే వారి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఫిబ్రవరి నుండి పెన్షన్లు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా బడేటి శ్రీహరిరావు ట్రస్టు సహకారంతో పదిమందికి కుట్టుమిషన్లను ప్రభుత్వ కార్యదర్శి బి. ఉదయలక్ష్మి, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగరమేయరు షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులు పంపిణీ చేసారు. అదేవిధంగా పలువురుకు చంద్రన్న బీమా పత్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకల కిట్‌లను అందజేసారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు, డిప్యూటీ మేయరు నాయుడు పోతురాజు, స్ధానిక కార్పోరేటర్‌ భీమవరపు హేమసుందరీ, నగరపాలకసంస్ధ కోఆప్షన్‌ మెంబరు యస్‌యంఆర్‌ పెదబాబు, జన్మభూమి ప్రత్యేకాధికారి కరుణకుమారి, నగరపాలకసంస్ధ విప్‌ గూడవల్లి శ్రీనివాసు, కార్పోరేటర్‌ బుట్టి రత్నం, నగరపాలకసంస్ధ కమిషనరు మోహనరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌యన్‌ఆర్‌. నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags: Ensure Balyam through education: Udayalakshmi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *