పంచాయితీ ఎన్నికల్లో వ్యయ పరమితి పెంపు 

Date:19/06/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ అభ్యర్థుల వ్యయ పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం పెంచింది. పంచాయతీ జనాభా 5 వేల కంటే ఎక్కువుంటే…ఒక్కో అభ్యర్థి రెండున్నర లక్షలు, వార్డు అభ్యర్థి 50 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు అని తెలిపింది… రాష్ట్రంలో పంచాయతీ విధానాల్లో ఎన్నికల సంఘం పలు మార్పులు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు నిబంధనను అమలులోకి తీసుకువచ్చింది.తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం…పంచాయతీ చట్టం అనుగుణంగా నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఇప్పటి వరకు జనాభా పది వేలు లోపు, పది వేల కంటే ఎక్కువ రెండు భాగాలుగా ఉండేవి. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత 12వేల 751 పంచాయతీలు అయ్యాయ్. అంతకుముందు 8వేల 685 పంచాయతీలు మాత్రమే ఉండేవి. గిరిజన పంచాయతీల్లో 5వందల కంటే తక్కువ జనాభా ఉంది. వార్డుల సంఖ్య 87వేల 838 నుంచి లక్షా 13వేలకు పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా జనాభా 5 వేలు దాటిన, 5 వేల లోపు అనే రెండు వర్గీకరణలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 5 వేలు దాటిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రెండున్నర లక్షలు, 5 వేల లోపు ఉన్న గ్రామాల్లో ఒకటిన్నర లక్ష వరకు ఖర్చు పెట్టేందుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా 5 వేలు జనాభా దాటిన గ్రామాల్లో వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు 50 వేలు, 5 వేల లోపు ఉన్నచోట 30 వేల వరకు ప్రచారం కోసం ఖర్చు చేయవచ్చు. నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఎన్నికల వ్యయాన్ని సవరించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.ఎన్నికల పరిశీలకులు గ్రామాల్లో ప్రచార తీరును పరిశీలించి వ్యయాన్ని లెక్కిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీని కోసం మండలానికి నాలుగు నుంచి ఐదు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, వీడియో చిత్రీకరణ, అభ్యర్థుల వెంట తిరిగే జనం, వారి భోజనం, టిఫిన్ ఖర్చులు, జెండాలు, వాహనాల ఖర్చులపై అంచనా వేయాలని నిర్ణయించింది. కరపత్రాలు, ప్రకటనలపై కూడా ప్రత్యేకమైన దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. ఎన్నికల ప్రచారం సమయంలో ఖర్చుపై సంబంధిత అభ్యర్థి తరుపు ఏజెంట్లు మూడ్రోజులకోసారి లెక్కలను సమర్పించాలని స్పష్టం చేసింది.
Tags; Expenditure increases in Panchayat Elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *