F2H2 O Boat racing works speed

ఎఫ్1హెచ్2ఓ బోట్ రేసింగ్ పనులు వేగవంతం

– ద్వారకా తిరుమలరావు, మీనా, లక్ష్మికాంతం, నివాస్, శుక్లా విస్రృత చర్చలు
Date:12/10/2018
విజయవాడ ముచ్చట్లు:
ఎఫ్1హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ నిర్వహణకు సంబంధించిన పనులు వేగవంతం అయ్యాయి. జిల్లా స్ధాయిలో ఏర్పాటైన  సమన్వయ కమిటీ తొలి క్ష్రేత్ర పర్యటన శుక్రవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తుండగా, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. పర్యాటక, బాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో సమావేశమైన ఈ కమిటీలో విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మికాంతం, విజయవాడ మున్సిపల్ కమీషనర్ నివాస్, ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా తదితరులు ఉండగా పున్నమి ఘాట్‌లో సమావేశమైన కమిటీ విభిన్న అంశాలపై లోతుగా చర్చించారు.
ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్రస్దాయిలో సమావేశం నిర్వహించి దీని నిర్వహణకోసం  ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే క్రమంలో జిల్లా స్ధాయి సమన్వయ కమిటీని సైతం ఏర్పాటు చేసి, శుక్రవారమే క్ష్రేత్ర సందర్శన చేయాలని ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు  సమావేశమైన ఉన్నతాధికారులు నవంబరు 16 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఎఫ్1హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై 30 శాఖల అధికారులతో సమీక్షించారు. ఎఫ్1 హెచ్2ఓ పవర్ బోట్  రేసింగ్ నిర్వహణ ద్వారా ప్రపంచం దృష్టిని అమరావతి వైపు ఆకర్షింప చేయాలని సిఎం భావిస్తున్నారని ఈ క్రమంలో ప్రతి విభాగం నుండి తాము సహకారం ఆశిస్తున్నామని పర్యాటక కార్యదర్శి మీనా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
విజయవాడ ప్రకాశం జలాశయం వేదికగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని, అమరావతిలో జరిగే పోటీల్లో 10 బృందాలకు గాను ఒక్కో జట్టు నుంచి 50 సభ్యులు చొప్పున 500 మంది జల క్రీడాకారులు వస్తున్నట్టు తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారని, వీఐపీ, వీవీఐపీ, జట్టు సభ్యులు, జట్టుతో వచ్చిన వారు, మీడియా ఇలా ఎవరికి వారికి ప్రత్యేక గ్యాలరీలు నిర్మిస్తామని వివరించారు. నూతన రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న మొట్ట మొదటి ప్రపంచస్థాయి  జల క్రీడల పోటీలను అంతా మెచ్చేలా ఘనంగా నిర్వహించాలన్న పట్టుదలతో సిఎం ఉన్నారని మీనా తెలిపారు. పోటీలు జరిగే విధానం, రేస్ ట్రాక్ కు సంబంధించిన అంశాలను శుక్లా సమావేశంకు వివరించారు.  ప్రధానంగా గ్యాలరీల ఏర్పాటుకు సంబంధించి సమావేశం నిశితంగా చర్చించింది.
నది ఒడ్డున ఉన్న నిర్మాణ సామాగ్రిని తరలించాలని నిర్ణయించారు. మరోవైపు రహదారులను అందంగా తీర్చిదిద్దాలని అవాంతరాలను తొలిగించాలని భావించారు. ప్రకాశం బ్యారేజ్‌పై ఎంతమంది ప్రజలు నిలబడవచ్చు, దాని సామర్ధ్యం ఏమిటి అన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖకు సూచించారు. నది వెంబడి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న స్ధలాలను కూడా వినియోగించుకోవాలని, అక్కడ నిర్వహిస్తున్న సర్కస్‌ను త్వరితగతిన ముగించేలా చూడాలని నిర్ణయించారు. నగర సుందరీకరణ అంశాన్ని తన బాధ్యతగా తీసుకుంటానని మున్సిపల్ కమీషనర్ నివాస్ తెలపగా, జిల్లా యంత్రాంగం అంతటినీ అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ లక్ష్మికాంతం తెలిపారు. ఆహ్వానాలకు సంబంధించిన పూర్తి బాధ్యతను కలెక్టర్‌కు అప్పగిస్తూ సమావేశం నిర్ణయించింది.సమయం తక్కువగా ఉండగా  ప్రతి ఒక్క రోజూ విలువైనదేనని, పోటీలకు చేస్తున్న ఏర్పాట్లపై నిశిత పర్యవేక్షణ జరపనున్నామని మీనా తెలిపారు. .
నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ అంతర్జాతీయ బోట్ రేసర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసు విభాగానికి అందచేయాలని, తద్వారా తాము వారికి పూర్తి స్దాయి రక్షణకు కల్పించగలుగుతామని అన్నారు. సమావేశంలో కనకదుర్గ అమ్మవారి దేవస్దానం ఇఓ కోటేశ్వరమ్మ, జాయింట్ కలెక్టర్ బాబూరావు, శిల్పారామం ప్రత్యేక అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు మన ఘనమైన వారసత్వ గొప్పతనాన్ని ప్రతిబింబింపచేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, జలవనరులు, పర్యాటక ప్రాధాన్యంపై మూడు రోజుల పాటు కార్యగోష్టి నిర్వహిస్తున్నామని, శిల్పారామం నేతృత్వంలో క్రాప్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని వీటన్నింటికీ అవసరమైన స్ధలాలను నిర్ణయించవలసి ఉందని మీనా గుర్తు చేసారు.
ముందు జాగ్రత్త చర్యగా గ్రీన్ ఛానల్ బోట్ రేసింగ్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే క్షతగాత్రులను అత్యంత వేగంగా ఆసుప్రతికి తరలించటంపై ప్రత్యేకంగా సమావేశం చర్చించింది. ఐదు నిమిషాల వ్యవధికి మించకుండా అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి బాధితులు చేరాలంటే గ్రీన్ ఛానల్ ఆవశ్యకత ఉంటుందని ఇందుకు పోలీస్ విభాగం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలసి ఉంటుందని మీనా తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు వివరించారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ పరంగా పూర్తి స్ధాయి పరికరాలతో అత్యవసర సేవలకు సిద్దంగా ఉండాలని, ఇందుకోసం రెండు చోట్ల ఎమర్జెన్సీ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
Tags:F2H2 O Boat racing works speed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *